
సూళ్లురుపేట : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటకు చేరుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే చంద్రయాన్-2 ప్రయోగాన్ని ఆయన వీక్షించనున్నారు. సోమవారం వేకువ జామున 2.51 గంటలకు ఇస్రో ఈ ప‍్రయోగాన్ని చేపట్టనుంది. ఇందుకోసం ఆదివారం సాయంత్రం శ్రీహరికోటకు చేరుకున్న రాష్ట్రపతికి ఇస్రో చైర్మన్ శివన్, నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు, ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఘన స్వాగతం పలికారు. శ్రీహరికోటలోని రెండో వాహక అనుసంధాన భవనాన్ని రాష్ట్రపతి పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేతలు ఇస్రో ప్రయోగాల తీరు తెన్నులను రాష్ట్రపతికి వివరించారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా శ్రీహరికోట పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, కోవింద్ షార్ కేంద్రాన్ని సందర్శించిన నాలుగో రాష్ట్రపతి కావడం విశేషం.
అంతకుముందు రాష్ట్రపతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డిని, ఈఓ సింఘాల్‌ను రాష్ట్రపతి అభినందించారు. అనంతరం రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్రపతికి గవర్నర్ నరసింహన్, చిత్తూరు కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తాలు వీడ్కోలు పలికారు.