ఎచ్చెర్ల సమీపంలో జాతీయ రహదారి
శ్రీకాకుళం, ఎచ్చెర్ల క్యాంపస్/ రణస్థలం: 16వ నంబరు జాతీయ రహదారిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అతివేగానికి పెట్టింది పేరైన ఈ రహదారిపై ఏ కారణంతోనైనా ట్రాఫిక్ సమస్య తలెత్తినా దారి పొడవునా వాహనాలు నిలిచిపోయే పరిస్థితి. దీనికితోడు ఏదో ఒకచోట ప్రమాదాలు సంభవిస్తుంటాయి. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకుని విస్తరణ పనులు వేగవంతం చేయాలి. అయితే పక్క జిల్లాలతో పోల్చితే మన జిల్లాకు సంబంధించి పనుల్లో జాప్యమవుతోంది. ఇప్పటికీ భూములు కోల్పోయిన వారికి పరిహారాలు చెల్లింపులో, బైపాస్ భూ సేకరణలో వేగవంతం కావడంలేదు. జిల్లాలో పైడిభీమవరం నుంచి ఇచ్ఛాపురం వరకు 16వ నంబరు జాతీయ రహదారి విస్తరించి ఉండగా, ట్రాఫిక్, ప్రమాదాలు, వాహనాల రాకపోకల సంఖ్య ఆధారంగా రణస్థలం నుంచి నరసన్నపేట వరకు 54.20 కిలోమీటర్లు ఆరులైన్లుగా విస్తరిస్తున్నారు.
నరసన్నపేటలో ఇప్పటికే బైపాస్ నిర్మాణం నాలుగు లైన్ల విస్తరణ సమయంలోనే పూర్తయ్యింది. ప్రస్తుతం ఎచ్చెర్లలో కింతలిమిల్లు నుంచి చిలకపాలెం టోల్‌ప్లాజా వరకు ఐదు కిలోమీటర్లు బైపాస్ నిర్మాణం చేపడుతున్నారు. ఇందుకోసం 81.77 ఎకరాల సేకరణ చేపట్టారు. రణస్థలం నుంచి లావేరు మండలం రావివలస వరకు మూడున్నర కిలోమీటర్లు బైపాస్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఈ నిర్మాణానికి 66.36 ఎకరాలు సేకరిస్తున్నారు. భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ ధరలు, పట్టణ ప్రాంతాల ఆధారంగా డబ్బులు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. భూ సేకరణ రెవెన్యూ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో చురుగ్గా సాగని పనులు
రణస్థలం నుంచి నరసన్నపేటకు ఆరులైన్లు, రెండు బైపాస్ రోడ్ల నిర్మాణం పనులు ఆఫ్‌కో ఇన్‌ఫ్రా సంస్థ టెండర్లు దక్కించుకుంది. అంచనా విలువ రూ. 1,665 కోట్లు, రోడ్డు నిర్మాణానికి రూ.1,183 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఈ సంస్థ ఎచ్చెర్ల సమీపంలో స్థలం లీజుకు తీసుకుని సామగ్రి, సిబ్బంది నివాసాలు కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరులైన్ల రోడ్డు నిర్మాణానికి సిబ్బంది సర్వే, నిర్మాణ పాయింట్లు గుర్తింపు పూర్తి చేశారు. సిమెంట్, కాంక్రీట్, బీటీ ఇలా మూడు లేయర్లతో రోడ్డు నిర్మాణం చేపడతారు.
విశాఖపట్నం జిల్లా ఆనందపురం నుంచి రణస్థలం వరకు, జిల్లా పరిధిలో పైడిభీమవరం నుంచి రణస్థలం వరకు ఆరులైన్ల విస్తరణ పనులు పూర్తవుతున్నాయి. ఈ ప్రాజెక్టు టెండరును అశోక్ బిల్డర్స్ కాంట్రాక్టు సంస్థ రూ. 1,187 కోట్లకు దక్కించుకుంది. మొత్తంగా 48 కిలోమీటర్లు రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు.
ప్రమాదాల నియంత్రణకు మార్గం
ప్రస్తుతం బైపాస్, ఆరులైన్ల రోడ్లు పూర్తయితే ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. భారీ వాహనాలు బైపాస్ రోడ్డుపై నుంచి తరలించొచ్చు. పెరుగుతున్న వాహన రవాణాకు సైతం సరిపడే వ్యవస్థ వస్తుంది. బైపాస్ భూసేకరణ నష్టపరిహారం చెల్లింపులు పూర్తయిన వెంటనే పనలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. రణస్థలం నుంచి ఆరులైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్ సిబ్బంది నిరంతరం జాతీయ రహదారిపై సర్వే నిర్వహిస్తున్నారు. మరోవైపు శాటిలైట్ సర్వేలు సైతం అనేకసార్లు చేశారు. కాంట్రాక్టు గడువులోపు పూర్తి కావాలంటే వేగవంతం చేస్తేనే సాధ్యమవుతోంది.
గడువులోగా పనులు పూర్తవుతాయి
2017 నవంబరులో ప్రారంభించిన ఈ పనులకు కాంట్రాక్టు గడువు 2020 మే 14 వరకు ఉంది. ఆలోగా ఆరు లైన్ల విస్తరణ, బైపాస్ రోడ్లు పూర్తవుతాయి. రోడ్ల నిర్మాణ పనులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహిస్తాం. ప్రస్తుతం వాహనాల రాకపోకలు, భవిష్యత్తు అవకాశాల ఆధారంగా పనులు చేస్తున్నాం. రోడ్డు నిర్మాణానికి సంబంధించి పనులు కొనసాగుతున్నాయి.
– జేసీహెచ్ వేంకటరత్నం, ఎన్‌హెచ్ విశాఖపట్నం ప్రాంతీయ ప్రాజెక్టు డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment