పాఠశాల ముందు ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కోవడానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తుతెలియని యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.
గుత్తి (అనంతపురం) : పాఠశాల ముందు ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కోవడానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తుతెలియని యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులను అప్రమత్తం చేయడంతో.. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తిఆర్‌ఎస్‌లో శుక్రవారం జరిగింది.
స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల ముందు దుకాణం వద్దకు వెళ్లి వస్తుండగా.. ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఓ యువకుడు ఆ అమ్మాయిని ఎత్తుకుని అదే పాఠశాలలోని ఒక గదిలోకి తీసుకెళ్లి తలుపులేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు తలుపులు బాదడంతోపాటు ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో.. దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చేపడుతున్నారు.