అడవుల్లో అత్యాచారం, ఆపై ఇద్దరి దారుణ హత్య
స్థానిక కోమటిబండ అటవీప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం వెలుగుచూసింది.
గజ్వేల్, న్యూస్‌లైన్: స్థానిక కోమటిబండ అటవీప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని మహిళలు దారుణ హత్యకు గురైన ఘటన గురువారం వెలుగుచూసింది. ఇద్దరిపై అత్యాచారం జరిపి అపై మద్యం బాటిళ్లతో శరీరంపై ఎక్కడికక్కడా కోత పెట్టి పాశవికంగా హతమార్చారు. కలకలం సృష్టించిన ఈ సంఘటన వివరాలిలాఉన్నాయి..మండలంలోని కోమటిబండ గ్రామంలోగల మేకిన్స్ వ్యవసాయ క్షేత్రానికి ఎదురుగా ఉన్న ప్రదేశంలో గురువారం ఉదయం సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసు కలిగిన ఇద్దరు గుర్తుతెలియని మహిళల శవాలు పడివుండటాన్ని గ్రామస్థులు చూశా రు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. దీంతో స్థానిక సీఐ అమృత్‌రెడ్డి, ఎస్‌ఐ ఆంజనేయులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతదేహాలు 15 గజాల దూరంలో పడివున్నాయి.
సంఘటనా స్థలంలో కండోమ్ ప్యాకెట్లు, మద్యం సీసాల పెంకులు, గిఫ్ట్‌బాక్స్, మహిళలకు చెందిన చీరల సంచి ఉన్నాయి. హతమైనవారిలో ఒకరు ముదరు ఆకుపచ్చ రంగు చీర, మరొకరు గోధుమ రంగు బొట్ల చీర జాకెట్ ధరించి ఉన్నారు. ఇద్దరు మహిళలకు మద్యం తాగించి అత్యాచారం జరిపి దారుణంగా హతమార్చినట్లు సంఘటనాస్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తోంది. ముఖాలను గుర్తుపట్టకుండా ఉండేందుకు గాజు పెంకులతో కోశారు. ఇద్దరిని హతమార్చిన తర్వాత శవాలను దూరంగా పడేసినట్లు స్పష్టమవుతోంది.
ఇదిలావుంటే శవాల పక్కన గిఫ్ట్ బాక్స్ పడివుండటం బుధవారం గజ్వేల్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బతుకమ్మ సంబరాలను ముగించుకుని వెళ్లే క్రమంలో హత్యకు గురై ఉంటారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. డీఎస్పీ వెంకట్‌రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. గజ్వేల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఓ మహిళ జగదేవ్‌పూర్ మండలం చేబర్తి గ్రామస్తురాలిగా గుర్తించారు.