జిల్లాలో కొత్త రాజకీయానికి తెర లేచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన టీడీపీ నేతలు ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే గ్రామాల్లో పట్టు కోసం వెంపర్లాడుతున్నారు. తొలి టార్గెట్‌గా రేషన్ డిపోల డీలర్లపై పడుతున్నారు. ఇందుకు అధికారులను ఉపయోగించుకుంటున్నారు. వారి ద్వారా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి డీలర్లు రాజీనామా చేసేలా ఎత్తులు, జిత్తులు వేస్తున్నారు. వీరి వేధింపులను తట్టుకోలేక జిల్లాలో ఇప్పటికే 20 మంది వరకు డీలర్లు రాజీనామా చేయటం పరిస్థితికి అద్దం పడుతోంది.
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడనే లేదు.. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు బాధ్యతలు సైతం చేపట్టలేదు.. ఇం తలోనే గ్రామాల్లో రాజకీయ వైషమ్యాలు పెరుగుతున్నాయి. గ్రామ స్థాయి టీడీపీ కార్యకర్త దగ్గరనుంచి ఎమ్మెల్యే వరకు గ్రామాల్లో పట్టు సాధించటానికి ప్రయత్నాలు ముమ్మ రం చేయటమే ఇందుకు కారణం. 2004, 2009 ఎన్నికల్లో తమకు సహకరించనివారిపై కక్ష సాధించటానికి వారు వ్యూహాలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా రేషన్ డీలర్లను తొలి టార్గెట్‌గా చేసుకుని వేధింపులు ప్రారంభించారు. తాము చెప్పిన డీలర్లను నయానో భయానో తొలగించాలని గ్రామ స్థాయి టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు ఆయా డీలర్లపై చర్య తీసుకోవాలని టీడీపీ శాసనసభ్యులు సివిల్ సప్లై తహశీల్దార్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు, మండల తహశీల్దార్లకు హుకుం జారీ చేస్తున్నారు.
టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 20 మంది వరకు రేషన్ డీలర్లు ఇప్పటికే రాజీనామా చేశారు. మరికొంతమంది ఈ నెల బియ్యం, ఇతర సరుకులకు సంబంధించిన డీడీలు చెల్లించే విషయమై సందిగ్ధంలో ఉన్నా రు. ఎందుకంటే సరుకులు డిపోకు చేరిన వెంటనే విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేసి 6ఏ కేసులు నమోదు చేస్తే డీడీల రూపంలో చెల్లించిన సొమ్ము వెనక్కివచ్చే అవకాశం ఉండదు. దీంతో ఇప్పటికే హెచ్చరికలు ఉన్న పలువురు డీలర్లు డీడీలు చెల్లించేందుకు వెనకాడుతున్నారు.
గార, శ్రీకాకుళం రూరల్ మండలాల్లో ముగ్గురు డీలర్లు రాజీనామా చేశారు. వీరితోపాటు రాజీనామా చేసిన మరో ముగ్గురు అధికారులను ప్రసన్నం చేసుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎచ్చెర్లలోను, టెక్కలి నియోజకవర్గంలోని సంతబొమ్మాళి మండలంలో నలుగురు డీలర్లు రాజీనామా చేయగా, మరో నలుగురు చేసేందుకు సిద్ధంగా ఉన్నా రు. కోటబొమ్మాళిలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఆమదాలవలస నియోజకవర్గంలోని పొందూరు, బూర్జ, సరుబుజ్జిలి, ఆమదాలవలస మండలాల్లో పలువురు డీలర్లపై మరో రెండు మూడు రోజుల్లో విజిలెన్స్, ఎన్ ఫోర్స్‌మెంట్ అధికారుల దాడులు జరగనున్నాయని విశ్వసనీయ సమాచారం.
రానున్న రెండు, మూడు నెలల్లో దాదాపు 100 మంది డీలర్లు రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 950 రేషన్ డిపోలు ఉండగా దాదాపు 500 మంది డీలర్లను టీడీపీ నేతలు టార్గెట్‌గా చేసుకున్నారని సమాచారం. ఈ మేరకు పక్కా వ్యూహం రూపొందించారని తెలుస్తోంది. గత ఏడాది కాలంలో జిల్లా స్థాయి అధికారులు, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నేరుగా డిపోలకు వెళ్లి తనిఖీ చేసిన సందర్భాలు పెద్దగా లేవు. జేసీ జి.వీరపాండ్యన్ గురువారం స్వయంగా శ్రీకాకుళం, ఆమదాలవలస, సరుబుజ్జిలి, బూర్జ మండలాల్లోని పలు డిపోలను తనిఖీ చేయటం గమనార్హం.
డీలర్లకు వేధింపుల పరేషాన్!
Published Fri, Jun 6 2014 2:56 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement