రేషన్ ‘గోల్’మాల్
Published Thu, Oct 17 2013 4:17 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
కాగజ్‌నగర్, న్యూస్‌లైన్ :పేదలకు చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ప్రభుత్వం కిలో రూపాయికి పంపిణీ చేస్తుండగా, కొందరు డీలర్లు అక్రమార్గం ఎంచుకుంటున్నారు. వ్యాపారులకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా కాగజ్‌నగర్ పట్టణంలోని గోల్ బజార్‌లో విచ్చలవిడిగా సాగుతోంది. సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్(టి), కౌటాల, బెజ్జూర్, దహెగాంతోపాటు కాగజ్‌నగర్ మండలాల నుంచి రోజూ వందల క్వింటాళ్ల రేషన్ బియ్యం గోల్ బజార్‌కు చేరుతున్నాయి. కొంతమంది రేషన్ డీలర్లు, స్మగ్లర్లు, దళారులు ఆయా గ్రామాల నుంచి నేరుగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు.
‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు
గతంలో బియ్యం మాఫీయాపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో స్థానిక తహశీల్దార్ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గోల్ బజార్‌లో దాడులు నిర్వహించి రూ.లక్షల విలువ చేసే సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనపర్చుకోవడమే కాకుండా, ఇరువురు వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. అనంతరం అధికారులు ‘మాములు’గా తీసుకున్నారు. రేషన్ బియ్యంతోపాటు పామాయిల్ వ్యాపారం కూడా మొదలైంది. సిర్పూర్ నియోజకవర్గంలో గల కాగజ్‌నగర్ మండల లెవల్ స్టాక్ పాయింట్ (ఎంఎల్‌ఎస్), సిర్పూర్ మండల లెవల్ స్టాక్ పాయింట్ల నుంచి కూడా అధికారుల ప్రోద్బలంతో చౌక ధరల సరుకులను ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
మహారాష్ట్రకు బియ్యంతోపాటు పామాయిల్ రవాణా
గోల్ బజార్‌లో రోజూ రేషన్ డీలర్లు వందల క్వింటాళ్ల బియ్యాన్ని రూ.5 చొప్పున వ్యాపారులకు విక్రయిస్తుంటారు. వ్యాపారులు ఈ బియ్యానికి పాలిష్ చేసి కిలో. రూ.15 చొప్పున సరిహద్దులు దాటిస్తున్నారు. ఆసిఫాబాద్, బెజ్జూర్ మండలాల గుండా మహారాష్ర్టకు తరలిస్తూ రూ.లక్షలు సంపాదిస్తున్నారు. కాగా, రేషన్ బియ్యంతోపాటు పామాయిల్‌ను ఇతరత్రా ప్రాంతాలకు తరలిస్తున్నారు. గోల్ బజార్‌లో ఏ సమయానికి వెళ్లినా అక్కడ ఒక ప్రభుత్వ గోదాం తరహాలో లోడింగ్ అన్‌లోడింగ్ వ్యవహారం దర్శనమిస్తోంది. ఒక వ్యాపారి కనుసన్నళ్లలో ఈ వ్యవహారం జరుగుతోంది. సదరు వ్యాపారి రైల్వేమార్గం ద్వారా ఇక్కడి నుంచి బియ్యాన్ని మహారాష్ర్టలోని విరూర్, మానిక్‌గఢ్, బల్లార్షా, చంద్రాపూర్ ప్రాంతాలకు తరలిస్తున్నాడు.
రూటు మార్చిన వ్యాపారులు
రైళ్ల ద్వారా బియ్యం అక్రమంగా రవాణా చేస్తుండటం వల్ల అందరికీ తెలిసిపోతుండటంతో అధికారులు దాడులు నిర్వహించక తప్పడం లేదు. దీంతో అప్రమత్తమైన సదరు వ్యాపారులు ప్రస్తుతం ప్రైవేట్ ట్రాలీలు, వ్యాన్‌లను ఏర్పాటు చేసుకొని, నేరుగా రోడ్డు మార్గంలో బియ్యాన్ని మహారాష్ర్టకు తరలిస్తున్నారు. రెవెన్యూ శాఖాధికారులు గోల్ బజార్‌లో పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తే, మరిన్ని విషయాలు బయటపడే అవకాశాలు లేకపోలేదు. అక్రమ బియ్యం వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Advertisement