పేదల బియ్యం పక్కదారి!
- డీలర్లు.. మిల్లర్ల మాయాజాలం
- అక్రమంగా తరలుతున్న రూ.కిలో బియ్యం
- గుట్టుగా మహారాష్ట్రకు తరలింపు
- మన మిల్లుల్లోనూ రీసైక్లింగ్
- అనంతరం మార్కెట్‌కు...
- పౌరసరఫరాల మంత్రి ఇలాఖాలోనే అవినీతి దందా!
సాక్షి, కరీంనగర్ : రేషన్ బియ్యం అక్రమంగా తరలుతోంది. బియ్యం అక్రమ రవాణాలో డీలర్ల పాత్ర కీలకంగా మారింది. కొంత మంది డీలర్లు తమకు వచ్చిన బియ్యాన్ని కోటా నుంచి మిగుల్చుకుంటే.. ఇంకొందరు పేదలకు ఇవ్వాల్సిన దాంట్లో సగం కోటా ఇవ్వకుండా స్థానికంగా ఉండే రైస్‌మిల్లర్లు, దళారులు, వ్యాపారులకు రూ.10 నుంచి రూ.15కు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు దళారులు, వ్యాపారులు నేరుగా ఆ బియ్యాన్ని రోడ్డు, రైలు మార్గాల ద్వారా మహారాష్ట్రకు తరలిస్తున్నారు. అక్కడ రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి (మరపట్టి) జిల్లాకు తీసుకొచ్చి.. మళ్లీ మనకే బహిరంగ మార్కెట్లో కిలోకు రూ.23 చొప్పున విక్రయిస్తున్నారు.
ఈ అక్రమ రవాణాపై రెవెన్యూశాఖ రైల్వేస్టేషన్లపై నిఘా పెట్టి అప్పుడప్పుడు దాడులు చేస్తుండగా అక్రమంగా తరలుతోన్న క్వింటాళ్లకొద్దీ బియ్యం పట్టుబడుతోంది. అధికారుల దాడులు తెలుసుకున్న కొందరు రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా బియ్యాన్ని రైళ్లలో సరిహద్దు దాటిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలోనే జరిగే రీసైక్లింగ్ ఇప్పుడు మన జిల్లాలోని పలు రైస్‌మిల్లుల్లోనూ జరుగుతున్నట్లు సమాచారం. కొందరు డీలర్లు మిల్లర్లకు ఐదారు రూపాయలకు కిలో బియ్యం విక్రయిస్తున్నారు. మిల్లర్లు.. ఆ బియ్యాన్ని స్థానిక మిల్లుల్లో మరపట్టించి.. బహిరంగ మార్కెట్లో కిలో రూ.23 నుంచి రూ.27కు అమ్ముతున్నారు. రేషన్‌బియ్యం పక్కదారి పట్టడం వెనక పలువురు రేషన్ డీలర్లు.. కాంట్రాక్టర్లతోపాటు అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పేదల పొట్ట కొట్టి బియ్యాన్ని పక్కదారి పట్టించిన చాలామంది డీలర్లు ఇప్పటికే లక్షలు గడించారు. ఇటు మిల్లర్లూ అదే బియ్యాన్ని మార్కెట్లో అధిక ధరకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ఈ నెల 15న.. విజిలెన్స్ అధికారులు కరీంనగర్‌లోని ఓ రైస్ మిల్లులో పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జిల్లాలో జరుగుతున్న అవినీతి దందాకు అద్దం పడుతోంది. అదే రాత్రి జూలపల్లి మండలంలో 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుబడింది. అక్రమంపై కొరడా ఝుళిపించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగడంతో ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. సాక్షాత్తూ.. రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోనే అవినీతి దందా ఈ స్థాయిలో జరగడం చర్చనీయాంశమైంది.
తరలింపు తీరిది!
బియ్యం అక్రమ రవాణాకు రైలు, రోడ్డు మార్గాలను ఎంచుకున్న దళారులు, వ్యాపారులు డీలర్ల నుంచి సేకరించిన బియ్యాన్ని ప్లాస్టిక్ బస్తాల్లో నింపి రోజుకు కొన్ని బస్తాల చొప్పున గుట్టుచప్పుడు కాకుండా జమ్మికుంట, పొత్కపల్లి, ఓదెల, కొలనూరు, పెద్దపల్లి, రాఘవపురం, ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని బెల్లంపల్లి, రేచినిరోడ్డు, ఆసిఫాబాద్ రోడ్డు, కాగజ్‌నగర్, సిర్పూర్ రైల్వేస్టేషన్ల నుంచి తరలిస్తారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా విరూర్ స్టేషన్‌కు బియ్యాన్ని చేరవేస్తారు. బస్తాలన్నీ ఒకే ప్రాంతం నుంచి లోడ్ చేసే సమయం ఉండకపోవడం.. అందరికీ అనుమానం వచ్చే అవకాశాలు ఉండడంతో దళారులు చాకచక్యంగా బియ్యాన్ని లారీలో నింపుకుని జిల్లా పరిధిలో ఉన్న రైల్వేస్టేషన్లలో కొన్ని, కొన్ని చొప్పున డంప్ చే సుకుంటూ పోతున్నారు.
మరో రోడ్డు మార్గాన్ని ఎంచుకున్న వ్యాపారులు జిల్లాలో పలు కేంద్రాలను చేసుకుని సిద్దిపేట- కామారెడ్డి మీదుగా మహారాష్ట్రకు బియ్యాన్ని తరలిస్తున్నారు. సుల్తానాబాద్, నిమ్మలపల్లి, వేములవాడ నుంచి బియ్యం లారీ ద్వారా పెద్ద ఎత్తున మహారాష్ట్రకు వెళ్తుంది. ఈ దందాతో దళారులకు అన్ని ఖర్చులు పోనూ ప్రతి నెలా రూ.3 లక్షలు మిగులుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
- ఈ నెల 15న కరీంనగర్ మండలం రేకుర్తి నుంచి ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేటకు 12 క్వింటాళ్ల రేషన్ బియ్యం తరలిస్తుండగా జూలపల్లి మండలం వడ్కాపూర్ శివారులో పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు.
- 15న జిల్లా కేంద్రంలోని ఓ రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 99.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- 12న కొడిమ్యాల నుంచి సిరిసిల్లకు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు వేములవాడలో పట్టుకున్నారు.
- 4న.. ఓదెల మండలం కొలనూరులో 15 క్వింటాళ్లు పట్టుకున్నారు.
- గత నెల 5న.. సుల్తానాబాద్‌లో ట్రాలీలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని రె వెన్యూ, డీటీసీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
- మే నెలలో సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద 6 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
- మార్చి 11న.. వేములవాడలో వాహనంలో 23 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు.
- జమ్మికుంట రైల్వేస్టేషన్ కేంద్రంగా.. రేషన్ బియ్యం రైళ్లో అక్రమంగా మహారాష్ట్రకు తరలుతోంది. మార్చి 29న జమ్మికుంటలో 10 క్వింటాళ్లు.. నాలుగు నెలల వ్యవధిలో 50 క్వింటాళ్ల బియ్యం మహారాష్ట్రకు తరలిస్తుండగా.. రెవె న్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.