పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేయడంలో డీలర్లు జాప్యం చేస్తున్నారని...
- రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలు
- సబ్ కలెక్టర్‌కు ఆహార సలహా సంఘం సభ్యుల ఫిర్యాదు
తాండూరు రూరల్: పేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేయడంలో డీలర్లు జాప్యం చేస్తున్నారని, దీంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని పలువురు ఆహార సలహా సంఘం సభ్యులు వికారాబాద్ సబ్ కలెక్టర్ ఆలగు వర్షిణికి ఫిర్యాదు చేశారు. తాండూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరగిన నియోజకవర్గస్థాయి ఆహార సలహా సంఘం సమావేశంలో సంఘం సభ్యులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ఇప్పటికీ పేదలకు రేషన్ సరుకులు అందడం లేదన్నారు.
చాలామంది పేదలు ఆహార భద్రత కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. గ్రామాల్లో రేషన్ డీలర్లు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని ఆరోపించారు. రేషన్ డీలర్లకే 17వ తేదీ తర్వాత సరఫరా చేస్తే... వారు లబ్ధిదారులకు ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. పెద్ద గ్రామపంచాయతీలకు అదనంగా రేషన్ డీలర్లను నియమించాలని కోరారు.
విజిలెన్స్‌తో విచారణ జరిపించాలి,,
ఆహార సలహా సంఘం సమావేశంలో తాండూరు జెడ్పీటీసీ సభ్యుడు రవిగౌడ్, తాండూరు, యాలాల ఎంపీపీలు కొస్గి లక్ష్మమ్మ, సాయన్నగౌడ్ మాట్లాడుతూ గ్రామాల్లో పేదలకు రేషన్ సరుకులు అందడం లేదని, ఈ విషయమై ప్రభుత్వం విజిలెన్స్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రేషన్ సరుకులు రాక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు..
రేషన్ సరుకుల పంపిణీలో డీలర్లు అక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని వికారాబాద్ సబ్ కలెక్టర్ అలగు వర్షిణి హెచ్చరించారు. సరుకులు పంపిణీ చేసి పేదలకు న్యాయం చేయాలన్నారు. ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. గ్యాస్ సరఫరాలో వినియోగదారులకు ఇబ్బందులు కలిగించ వద్దని ఏఎస్‌ఓ దీప్తని ఆదేశించారు, సమావేశంలో ఆహార సలహా సంఘం సభ్యులు సురేందర్‌రెడి, మల్లారెడ్డి, కృష్ణ ముదిరాజ్, బంట్వారం భద్రేశ్వర్, శరణప్ప, శ్రీనివాస్, బుగ్గప్ప, ఆయా మండలాల తహసీల్దార్లు గోవింద్‌రావు, ప్రేమ్‌కుమార్, భిక్షపతినాయక్ పాల్గొన్నారు.