పక్కా దగా..
Published Tue, Nov 15 2016 12:55 PM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
ముఠాలుగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా దందా
నిలువరించని సాంకేతిక పరిజ్ఞానం
పౌర సరఫరాల శాఖలో వేళ్లూనుకున్న అక్రమాలు
తూతూమంత్రంగా తనిఖీలు
పేదలకు పూర్తిస్థాయిలో అందని బియ్యం
బినామీ పేర్లతో రేషన్ బియ్యం పక్కదారి
పేదల బియ్యం పక్కదారిపడుతోంది. రూపాయికి కిలోబియ్యం పథకం కొందరికి కాసులు కురిపిస్తోంది. పక్కా ప్రణాళికతో సాగుతోన్న ఈ గోల్‌మాల్ దందాతో రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. జిల్లాలో డీలర్ల పేరుతో సాగుతున్న ఈ బినామీల దందా వెనుక పెద్దల హస్తాలున్నట్లు తెలుస్తోంది. సరుకులు దారి మళ్లిస్తున్న ఈ వ్యవహారంపై తనిఖీలు తూతూమంత్రంగా నిర్వహిస్తూ తమవంతు సహకరిస్తున్నారు కొందరు అధికారులు. పౌర సరఫరాల శాఖలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న జియో ఫెన్సింగ్ సాంకేతిక పరిజ్ఞానం కూడా ఈ దగాను ఏమాత్రం నిలువరించలేకపోతోంది.
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను కొందరు తమకు అనుకూలంగా మార్చుకొని పేదల బియ్యాన్ని నొక్కేసి సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ శాఖలతో పాటు జియోఫెన్సింగ్ యాప్ కూడా పనిచేస్తున్నప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రావడంలేదు. దొడ్డిదారిన బియ్యం తరలిపోతున్నా అక్రమాలను కట్టడి చేయడానికి అధికారులు సాహసించడం లేదు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న దళారులు రెచ్చిపోయి బియ్యాన్ని దారి మళ్లిస్తున్నారు. ప్రతినెల చౌకధర దుకాణాల ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యాన్ని దళారులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు అవినీతి మత్తులో జోగుతున్నారనే ఆరోపణలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 3,66,813 రేషన్ కార్డులున్నాయి. అందులో 3,39,393 ఆహార భద్రత కార్డులు, 27,164 అంత్యోదయ కార్డులు, 256 అన్నపూర్ణ కార్డులున్నాయి. ఆహార భద్రత కింద కుటుంబంలో ఎంతమంది సభ్యులున్నా సీలింగ్ విధించకుండా ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ 6కిలోల చొప్పున బియ్యం సరఫరా చేస్తుంది. ప్రతినెల 8222 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతోంది. జిల్లాకేంద్రం మహబూబ్‌నగర్ పట్టణంలోనే మొత్తం 86 రేషన్ డీలర్ షాపులు ఉన్నాయి. ఒకరిద్దరి చేతుల్లోనే దాదాపు 37డీలర్ షాపులు నడుస్తున్నట్లు సమాచారం. గత నాలుగేళ్లుగా కొత్త డీలర్ల నియామకాలు లేకపోవడంతో కొంతమందికి ఇన్ చార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఇన్ చార్జ్ లుగా వ్యవహరిస్తున్న కొందరు డీలర్లు ఇదే అదనుగా భావించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ బియ్యం అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
జియో ఫెన్సింగ్‌యాప్ ఉఫ్...
పౌర సరఫరాల శాఖలో బియ్యం సరఫరా, పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేకంగా అమలు చేస్తున్న జియోఫెన్సింగ్ యాప్ ఆశించిన ఫలితాన్నివ్వడం లేదు. బియ్యాన్ని సరఫరా చేసే లారీలకు జియో మ్యాపింగ్ చేశారు. డీలర్లు, గోదాం అధికారులు, పౌర సరఫరాల అధికారుల ఫోన్ నెంబర్లకు ఈ జియో ఫెన్సింగ్ యాప్‌ను అనుసంధానించారు. గోదాం నుంచి బియ్యం లారీ బయలుదేరి స్టేజ్–2 అధికారి పర్యవేక్షణలో ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేరుతుంది. లారీ బయలుదేరడం, ఎంఎల్‌ఎస్ పాయింట్‌కు చేరడం వంటి ప్రక్రియ జియోఫెన్సింగ్ యాప్‌లో నమోదవుతుంది. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి చౌకధర దుకాణాలకు చేరిన వెంటనే సంబందింత డీలర్ సంతకం చేసి బియ్యాన్ని స్టాక్ చేసుకుంటారు. ఈ ప్రక్రియ మొత్తం సంబందిత యాప్ సర్వర్‌లో నమోదు చేస్తారు. దీంతో స్టాక్ వచ్చినట్లు లబ్ధిదారులకు, అధికారులకు సమాచారం వెళ్తుంది. అలా లారీ బయలుదేనప్పటి నుంచి ఎక్కడెక్కడ వెళ్లిందనేది తెలుస్తుంది. ఇంతమంచి వ్యవస్థ ఉన్నా కేవలం యాప్‌ను సక్రమంగా వినియోగించకపోవడం వల్లే బియ్యం అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.
ధనార్జనే లక్ష్యంగా..
రూపాయికి కిలో బియ్యం అందజేసి పేదవారి కడుపు నింపాలనే ప్రభుత్వ ఆశయానికి అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు బినామీ డీలర్లు రూ.12నుంచి రూ.14ల వరకు బియ్యాన్ని దళారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు ఇదే పనిగా తిరుగుతున్నారు. కొనుగోలు చేసిన రేషన్ ను పక్కాప్లాన్ తో ప్యారా బాయిల్డ్ రైస్‌మిల్లులకు చేరుస్తున్నారు. రాత్రికిరాత్రే బియ్యాన్ని సన్నబియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. ప్రభుత్వానికే తిరిగి రూ.30 చొప్పున విక్రయిస్తున్నారని తెలుస్తోంది.
ముఠాగా ఏర్పడి రూ.కోట్ల దందా..
పేదల బియ్యాన్ని మార్కెట్‌లోకి తెచ్చేందుకు జిల్లాలో పెద్ద ముఠానే పనిచేస్తోంది. దీనంతటికీ కల్వకుర్తిలోని ఓ బియ్యం మిల్లు వ్యాపారి ఏజెంటుగా వ్యవహరిస్తున్నారు. మహబూబ్‌నగర్, అలంపూర్, గద్వాల, జడ్చర్లలో కొందరు బడావ్యక్తుల ద్వారా ఈ అక్రమ వాపారాన్ని సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారానికి అడ్డు చెప్పకుండా జిల్లాస్థాయిలో కొందరు అధికారులకు ప్రతినెలా కొంత మొత్తాన్ని ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నట్లు సమాచారం.
కఠిన చర్యలు తీసుకుంటాం
పేదలకు ఆహార భద్రత కింద అందజేస్తున్న బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. డీలర్ షాపులపై డిసెంబర్ నుంచి పర్యవేక్షణ పెంచుతాం. పౌర సరఫరాల శాఖ విభజన ఇంకా పూర్తికాలేదు. ఉమ్మడి జిల్లా కేటాయింపులే ఉన్నాయి. ఈనెలాఖరులోగా విభజన పూర్తవుతుంది. చిన్న జిల్లాలో మా టీంతో రేషన్ షాపులపై నిరంతర పర్యవేక్షణ పెంచుతాం. డీలర్లు అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటాం. బినామీ దందాను ఎట్టి పరిస్థితుల్లో సహించబోం.
- శారదా ప్రియదర్శిని, డీఎస్‌ఓ
Advertisement