నంద్యాల, న్యూస్‌లైన్ : అధికారుల నిఘా వైఫల్యం.. రేషన్ డీలర్ల అత్యాశ.. అధికార పార్టీ నాయకుల అండదండలు వెరసి చౌక బియ్యం రూపంలో స్మగ్లర్ల జేబులు కాసులతో కళకళలాడుతున్నాయి. నంద్యాల కేంద్రంగా సాగుతున్న ఈ రేషన్ బియ్యం తరలింపు యవ్వారంలో ఒక్కో స్మగ్లర్ సగటున నెలకు రూ. 30 లక్షలు ఘడిస్తున్నట్లు సమాచారం. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు సివిల్ సప్లయ్ పాయింట్ నుంచి నంద్యాల పట్టణం, మండలం, గోస్పాడు, బండి ఆత్మకూరు, మహానంది, పాణ్యం, గడివేముల మండలాల్లోని రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా అవుతాయి.
స్మగ్లర్లు రెండు, మూడు వర్గాలుగా విడిపోయి సంబంధిత డీలర్ల నుంచి కిలో రూ. 10 నుంచి రూ.15 మధ్యన కొనుగోలు చేస్తున్నారు. అనంతరం కర్ణాటకకు తరలించి కిలో రూ.20నుంచి రూ.30 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ యవ్వారంలో కిలో బియ్యంపై స్మగ్లర్‌కు రూ.10, డీలర్‌కు రూ.10, అధికారులకు రూ. 5 తక్కువ కాకుండా అందుతున్నట్లు సమాచారం.
ప్రతి నెలా 30 లారీల బియ్యం తరలింపు
నంద్యాల సివిల్ సప్లయ్ పాయింట్‌కు వచ్చే బియ్యంలో రోజుకు కనీసం ఒక లారీ బియ్యం సరిహద్దులు దాటిపోతున్నాయి. ఒక్కోసారి ఒక్కో రకమైన వాహనం(టాటా ఏస్, ట్రాక్టర్లు, టిప్పర్లు)లో తరలిస్తూ ఎవరికీ అనుమానం రాకుండా స్మగ్లర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పలు ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని డోన్, ఆదోని మధ్య లారీకి ఎక్కించి రహదారుల వెంట మామూళ్లు ముట్టజెబుతూ కర్ణాటకకు తరలిస్తున్నారు. విస్తృత నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని అధికారుల దాడులకు సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దందా సాగిస్తున్నారు. ఒక్కొక్క లారీకి అన్ని ఖర్చులు పోను లక్ష రూపాయలు మిగిలించుకుంటున్నట్లు తెలుస్తోంది.
కొన్ని రైస్ మిల్లులు వీటికే ప్రత్యేకం..
నంద్యాల, పరిసర ప్రాంతాల్లో కొందరు రైస్‌మిల్లు బోర్డులను తగిలించుకొని స్మగ్లర్ల బియ్యాన్ని కొనుగోలు చేసి వాటి ప్యాకింగ్ మార్చడంలో నిమగ్నమయ్యారు. బయటకు ప్రయివేటు వ్యాపారులు అధికారికంగా చేసే ప్యాకింగ్‌లతో స్మగ్లింగ్ బియ్యం సరఫరా చేస్తున్నారు.