బియ్యం మాఫియాకే ‘ప్రజా పంపిణీ’
► కొరవడిన అధికారుల నిఘా
► బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్న రేషన్ బియ్యం
► అరకొర పంపిణీతో పేదల పాట్లు
నరసరావుపేట టౌన్ : పౌర సరఫరాల శాఖాధికారుల నిర్లక్ష్యానికి చౌకదుకాణ డీలర్ల అక్రమాలు తోడు కావడంతో పేదలకు అందాల్సిన నిత్యావసర సరుకులు పక్కదారి పడుతున్నాయి. ఎంఎల్‌ఎస్ గోడౌన్ నుంచి ఎగుమతైన నిత్యావసరాలు అధికారుల పర్యవేక్షణ లోపించడంతో రూటుమారి నల్లబజారుకు తరలిపోతున్నాయి.
పేరుకే నిబంధనలు
నరసరావుపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ప్రతి నెలా తెల్ల రేషన్ కార్డు దారులకు పంపిణీ కోసం నిత్యావసరాలు రేషన్ షాపులకు దిగుమతి అవుతుంటాయి. నరసరావుపేట పట్టణ పరిధిలో 238 టన్నుల బియ్యం, రూరల్ పరిధిలో 248, రొంపిచర్ల 228, నకరికల్లు 235, ఫిరంగిపురం 264 టన్నులు చౌక దుకాణాలకు చేరతాయి. ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి ఎగుమతై రేషన్ దుకాణంలో నిత్యావసరాలు దిగుమతయ్యే వరకూ రూట్ అధికారి వీఆర్వో పర్యవేక్షణ తప్పనిసరి. చౌక దుకాణంలో రేషన్ దించాక సంబంధిత డీలర్, రూట్ అధికారి ఈపాస్ మిషన్‌పై వేలిముద్రలు వేసి సరుకు అందినట్లు నిర్ధారించాలి. అయితే ప్రజాపంపిణీ దిగుమతి, ఎగుమతిలో రూట్ అధికారి, రేషన్ డీలర్ కుమ్మక్కైన కారణంగా నిత్యావసరాలు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎగరేసుకుపోతున్న బియ్యం మాఫియా
ముందుగా కుదిరిన ఒప్పందం మేరకు రూట్ అధికారి ఆ పరిసరాల్లోనే కనిపించడంలేదు. ఈ పాస్ మిషన్‌పై వేలిముద్రలు ఎక్కడ వేస్తున్నారన్న విషయం అంతు చిక్కకుండా ఉంది. దుకాణానికి సరుకు చేరినరోజే వాటిని అధికార పార్టీకి చెందిన బియ్యం మాఫియా ఎగరేసుకు పోతున్నారని ఆరోపణలు లేకపోలేదు. గతంలో ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకూ రేషన్ షాపుల్లో ప్రజా పంపిణీ కొనసాగేది. ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకు వచ్చి ఐదో తేదీలోపే పంపిణీ పూర్తిచేసి ముగించాలన్న ఆదేశాలు డీలర్లకు కనకవర్షం కురిపిస్తున్నాయి. ఈపాస్ మిషన్ మొరాయిస్తుందన్న సాకు చూపి రేషన్ డీలర్లు అసలు దుకాణాలే తెరవడం లేదు. పంపిణీ అవుతున్న సరుకులు నాసిరకంగా ఉంటున్నాయి. దీంతో విసుగెత్తుతున్న కార్డుదారులు డీలర్లు ఇచ్చినంత పుచ్చుకుని వేలిముద్రలు వేస్తుండటంతో పేదలకు పంచాల్సిన రేషన్‌ను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. డీలర్ల అక్రమాలపై ఎన్ని ఫిర్యాదులు అందుతున్నా అసలు చౌక దుకాణాలపై అధికారులు తనిఖీలు చేయడానికి ధైర్యం చేయలేక పోతున్నారు. దీనికి ముఖ్య కారణం డీలర్లంతా అధికార పార్టీకి చెందినవారు కావడమనేది జగమెరిగిన సత్యం.
బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ
ప్రజా పంపిణీ ద్వారా ప్రతి నెలా తెల్ల కార్డుదారులకు బియ్యం, పంచదార మాత్రమే ప్రభుత్వం ద్వారా అందుతోంది. గత ప్రభుత్వం అమ్మహస్తం పేరుతో బియ్యం, పంచదార, గోధుమపిండి, పామాయిల్, పసుపు, కారం, గోధుమలు, చింతపండు, కందిపప్పు ఇలా 9 రకాల సరుకులు పంపిణీ చేసేది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ ప్రజా పంపిణీగా పేరు మార్చి బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమ పిండి పంపిణీ చేస్తోంది. అయితే ఐదు నెలల నుంచి వాటిలో బియ్యం, పంచదార మాత్రమే పంపిణీ అవుతున్నాయి. మిగిలిన సరుకుల గురించి కార్డుదారులు ఎవ్వరైనా డీలర్లను ప్రశ్నిస్తే పైనుంచి సరఫరా లేదని చెబుతున్నారు. దీంతో పేదలు కడుపునిండా ఆహారానికి నోచుకోవడంలేదు. ఇప్పటికైనా రేషన్‌షాపు ద్వారా అందించే సరుకులు పూర్తి స్థాయిలో పంపిణీ అయ్యేలా చూడాల్సి ఉంది.