రేషన్‌ దందా | ration rice to black market | Sakshi
Sakshi News home page

రేషన్‌ దందా

Published Tue, Aug 16 2016 10:23 PM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM

జగదేవ్‌పూర్‌లో పట్టుబడిన రేషన్‌ బియ్యం లారీలు

జగదేవ్‌పూర్‌లో పట్టుబడిన రేషన్‌ బియ్యం లారీలు

  • యథేచ్ఛగా రేషన్‌ బియ్యం పక్కదారి
  • రీ-సైక్లింగ్‌ లేదా కోళ్ల దాణాకు సరఫరా
  • దండుకుంటున్న వ్యాపారులు
  • దాడులు జరిగినా తగ్గని అక్రమాలు
  • మెదక్‌/గజ్వేల్‌/జగదేవ్‌పూర్‌: ‘కంచే చేను మేసినట్టు’రేషన్‌ డీలర్ల అక్రమార్జన కొనసాగుతోంది. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రైస్‌ మిల్లులకు తరలిస్తూ లక్షలు గడిస్తున్నారు. బియ్యాన్ని నూకలుగా మార్చుతూ కోళ్లదాణాగానూ అమ్మేసుకుంటున్నారు. చర్యలు అంతంతమాత్రంగా ఉండటంతో దందా కట్టడి కావడం లేదు. గజ్వేల్‌, మెదక్‌ ప్రాంతాల్లో సాగుతోన్న ఈ దందా పౌరసరఫరాల అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

    అడ్డాగా గజ్వేల్‌, మెదక్‌..
    రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా సేకరిస్తున్న వ్యాపారులు రీ-సైక్లింగ్‌ లేదా కోళ్లదాణాకు సరఫరా చేస్తున్నారు. గజ్వేల్‌ నియోజకవర్గం ఈ దందాకు అడ్డాగా మారింది. ప్రధానంగా జగదేవ్‌పూర్, గజ్వేల్‌ మండలాల్లో రేషన్‌ బియ్యం దందా జోరుగా కొనసాగుతోంది. తాజాగా ఆదివారం 150 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం జగదేవ్‌పూర్‌లో పట్టుబడటమే ఇందుకు నిదర్శనం.

    నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, మెదక్‌ జిల్లాల చిరు వ్యాపారులు రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి జగదేవ్‌పూర్‌లో విక్రయిస్తున్నారు. గజ్వేల్‌కు సైతం వివిధ ప్రాంతాల నుంచి అక్రమంగా బియ్యం వస్తున్నాయి. అలాగే మెదక్‌ ప్రాంతంలో సైతం అక్రమంగా రేషన్‌ బియ్యం తరలింపు వ్యవహారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నియోజకవర్గంలోని దాదాపు అన్ని రేషన్‌ దుకాణాల నుంచి సరుకు నేరుగా రైస్‌ మిల్లులకు చేరుతోంది.

    కలిసివచ్చిన సరిహద్దు ప్రాంతం
    జగదేవ్‌పూర్‌ మండలం జిల్లా సరిహద్దు ప్రాంతం. అధికారుల పర్యవేక్షణ కూడా ఇక్కడ అంతంతే. దీంతో కొందరు వ్యాపారులు ‘రింగ్‌’గా ఏర్పడి రేషన్‌ బియ్యం దందా ప్రారంభించారు. చిరు వ్యాపారుల నుంచి రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తూ లక్షలు గడిస్తున్నారు. అధికారులు కన్నెత్తి చూడకపోవడంతో వారి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్‌లో అప్పటి జగదేవ్‌పూర్‌ తహసీల్దార్‌ పరమేశం స్థానికంగా రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్న బుద్ద సత్యం దుకాణంపై దాడి చేసి 15 టన్నుల సరుకు పట్టుకున్నారు.

    ఈ ఏడాది మార్చి 10న తహసీల్దార్‌ అనిల్‌.. డీసీఎంలో తరలిస్తున్న బియాన్ని పట్టుకున్నారు. అందులో 60 కిలోల బస్తాలు 120 ఉన్నాయి. ఇదిలాఉండగా గజ్వేల్‌లో గతేడాది జూన్‌లో ఓ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని అధికారులు సీజ్‌ చేశారు. నెల రోజుల క్రితం గజ్వేల్‌ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లోని ఓ రైస్‌మిల్లులో రీ-సైక్లింగ్‌కు యత్నించిన 130 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు.

    బియ్యం సేకరణ ఇలా..
    చిరు వ్యాపారులు ఊరురా తిరుగుతూ రేషన్‌ బియ్యాన్ని సేకరించి ఇంటి వద్ద నీళ్లలో నానబెట్టి నూకలుగా తయారుచేస్తున్నారు. అదేవిధంగా మరికొందరు పసుపు కలిపి అమ్ముతున్నారు. కిలోకు చిరు వ్యాపారులకు రూ.12 నుంచి రూ.14 వరకు ధర అందుతోంది. సేకరించిన సరుకును ప్రతి శనివారం జగదేవ్‌పూర్‌లో వ్యాపారులకు అమ్ముతున్నారు. నల్లగొండ జిల్లా రాజాపేట మండలంలోని కొన్ని ప్రాంతాల నుంచి రేషన్‌బియ్యం దందా జరుగుతోంది.

    మహిళలు సైతం రంగారెడ్డి జిల్లా మదాపూర్, చీకటిమామిడి, లక్షామపూర్, ముడిచింతలపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి రేషన్‌బియ్యాన్ని రూ.10 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని వివిధ గ్రామాల బియ్యం ఇక్కడి వస్తున్నాయి. బియ్యాన్ని వ్యాపారులు ఓ గదిలో నిల్వ చేసి పైన నీళ్లు చల్లుతున్నారు. వాటినే రెండు రోజుల్లో నూకలుగా మార్చుతారు. వీటిని కోళ్ల దాణాగా విక్రయిస్తున్నట్టు సమాచారం.

    రైస్‌మిల్లులకు రేషన్‌ బియ్యం
    గతంలో వందల క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పాపన్నపేట మండలంలోని ఓ రైస్‌మిల్లులో విజిలెన్స్‌ అధికారులు పట్టుకొని సీజ్‌ చేసిన విషయం విదితమే. అదేవిధంగా మెదక్‌ మండల పరిధిలోని హవేళిఘణాపూర్‌లోని ఓ రైస్‌మిల్లుకు ఆటోలో తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు.

    రెండేళ్ల క్రితం మెదక్‌ మండలం సర్ధన నుంచి టాటా ఏ ఆటోలో రేషన్‌ బియ్యం, కిరోసిన్‌ తరలిస్తుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు. చిన్నశంకరంపేట మండలం జంగరాయి వాగులో చక్కెరకు సంబంధించిన ఖాళీ బస్తాలను పెద్ద మొత్తంలో పడేశారు. ఇటీవల మెదక్‌ పట్టణంలోని ఓ రైస్‌మిల్‌లోకి ఆటోలో అక్రమంగా రేషన్‌బియ్యం తరలించినట్లు సమాచారం. ఇలా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రేషన్‌ సరుకుల అక్రమ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement