‘రూపాయి’తో కోటి! | illegal ways to move the one rupee kilo rice | Sakshi
Sakshi News home page

‘రూపాయి’తో కోటి!

Published Mon, Jun 16 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 8:51 AM

‘రూపాయి’తో కోటి!

‘రూపాయి’తో కోటి!

రూపాయికే కిలో బియ్యం ఎంతోమంది పేదోళ్ల కడుపులు నింపుతోంది.  కానీ.. అదే బియ్యం పక్కదారి పడితే.. కొంతమంది గద్దలకు కోట్లు సంపాదించి పెడుతోంది. ఆ బియ్యం పేదోళ్లకు చేరితే న్యాయం.. ‘పెద్దోళ్ల’ చేతుల్లో పడితే అక్రమం. జిల్లాలో చాలా వరకు అక్రమం.. అన్యాయమే జరుగుతోంది.

రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది. జిల్లాలో కొందరు రైస్‌మిల్లర్లు రేషన్‌దుకాణాల ద్వారా బియ్యాన్ని కొనుగోలు చేసి.. రైస్‌మిల్లుల్లోనే రీ సైక్లింగ్ చేసి.. సంచులను మార్చేసి ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో తరలిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకూ చేరవేస్తున్నారు. రూపాయికి కిలో బియ్యాన్ని రూ. 25కు అమ్ముతూ కోట్లు సంపాది స్తున్నారు. ఇందుకు అర్సపల్లి రైస్‌మిల్లులో రూ.28లక్షల విలువ గల రేషన్ బియ్యం పట్టుబడటమే ఉదాహరణ. వీరికి అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తున్నాయి.

 
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : కిలో బియ్యం ధర బహిరంగ మార్కెట్లో రూ.32ల నుంచి రూ.40లకు పైగా ధర పలుకుతోంది. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యం సరఫరా చేస్తుంది. మార్కెట్‌లో ఆ నాణ్యత ఉన్న బియ్యం ధర రూ.25పైనే పలుకుతోంది. రేషన్ బియ్యం సరఫరాను అడ్డుకోవాల్సిన అధికార వ్యవస్థ చేతులెత్తేయడం అక్రమార్కులకు వరంలా మారింది.

రూపాయికి సరఫరా చేసే కిలో బియ్యంతో కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అక్రమ దందా జిల్లా అధికారులు సూత్రధారులుగా.. దళారు లు, మిల్లర్లు పాత్రధారులుగా నడుస్తున్నట్లు ఆరోపణలూ వస్తున్నాయి. ప్రతినెలా జిల్లాకు కనీసం 10,720.944 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం కేటాయిస్తారు. ఒక్కోసారి బియ్యం కోటా పెరుగుతుంది. జిల్లాలోని రేషన్ దుకాణాల ద్వారా 7,67,960 కార్డులకు బియ్యాన్ని సరఫరా చేస్తారు.
 
అయితే ఇదివరకే సరఫరా అవుతున్న రేషన్‌బియ్యంలో నాలుగో వంతు ‘నల్లబజారు’కు తరలుతుందన్న ఆరోపణలున్నాయి. బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తే లాభాలు భారీ స్థాయిలో వస్తుండటంతో అక్రమాలు పెరిగే ప్రమాదం ఉంది. తాజాగా శనివారం అర్సపల్లిలోని రైస్‌మిల్ గోదాముల్లో సుమారు రూ.28 లక్షల విలువ చేసే రేషన్ బియ్యం నిల్వ చేసి.. రీసైక్లింగ్ చేస్తున్న వ్యవహారం బట్టబయలైంది. దీంతో వ్యాపారులు, రైసుమిల్లర్ల చీకటి బాగోతం బయటపడింది. ఇలా జిల్లావ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్నట్లు అనుమానాలున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడే స్పందిస్తున్నారన్న ఆరోపణలు న్నాయి.
 
‘బియ్యం’లో అందరికీ వాటాలు..!

రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న బాగోతంలో అందరికీ వాటాలు అందుతున్నాయన్న ప్రచారం ఉంది. పౌరసరఫరాల శాఖలోని ‘నిఘా’ అధికారులు కొందరికీ ఇది ‘మామూలే’నన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా నిత్యవసర వస్తువులు నల్లబజారుకు తరలుతున్నాయని బహిరంగంగా చర్చ జరుగుతున్నా సదరు అధికారులు పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిలో బియ్యం రెండు రూపాయలున్న తరుణంలో నాలుగో వంతు నల్లబజారుకు తరలించిన వ్యాపారులకు ఇప్పుడు కిలోపై ఇంకో రూపాయి అదనంగా లభిస్తుంది.
 
సాధారణంగా ప్రభుత్వం లబ్ధిదారుడికి రూపాయికి కిలో బియ్యం ఇస్తుండగా.. లబ్ధిదారుడి పేరుతో స్థానికంగా ఉండే వ్యాపారులు రూ.7 నుంచి రూ.9 కిలో చొప్పున కొంటున్నారు. వ్యాపారులు మధ్యస్థాయి టోకు వ్యాపారికి కిలో రూ.12కు విక్రయిస్తుండగా, మధ్యస్థాయి వ్యాపారి సిండికేట్‌కు రూ.15లకు విక్రయిస్తున్నట్లు సమాచారం. అక్కడ మిల్లర్లు, దళారులు ప్రవేశించి రీమిల్లింగ్, రీ సైక్లింగ్ ప్రక్రియ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ)కి పంపిస్తుండటం గమనార్హం. భూమి గుండ్రగా ఉందన్న రీతిలో సాగుతున్న ఈ అక్రమ దందా ద్వారా బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో.. వివిధ మార్గాల ద్వారా మళ్లీ అక్కడికే వెళ్తున్నాయి. కానీ ఏడాదిలో కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి.
 
రే షన్ బియ్యానికి ‘లెవీ’ రంగు
జిల్లావ్యాప్తంగా చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్న రూపాయికి కిలో బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు వ్యాపారులు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. 16 మండల స్థాయి నిల్వ కేంద్రాల(ఎంఎల్‌ఎస్ పాయింట్లు) ద్వారా 7,67,960 కార్డుల లబ్ధిదారులకు సరఫరా చేసేందకు రేషన్ దుకాణాలకు బియ్యం తరలిస్తారు. బాగా సాన్నిహిత్యం ఉన్న గోదాం ఇన్‌చార్జి ఉంటే.. గోదాముల స్థాయిలోనే బియ్యం చేతులు మారుతాయి. లేదంటే రేషన్ బియ్యానికి సంబంధించి గోనెసంచులు మార్చడం, పాలిష్ పట్టి తరలిస్తున్నారని తెలిసింది.
 
గోదాముల నుంచి రేషన్ దుకాణానికి తరలించకుండా బియ్యాన్ని అక్రమ వ్యాపారులు ఏజెంట్ల ద్వారా టోకున విక్రయిస్తున్నట్లు తెలిసింది. నెలవారీగా వచ్చే బియ్యం కోటా నుంచి కొందరు డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి గోదాము నుంచే నేరుగా లారీ లోడు ద్వారా సమీపంలోని రైస్‌మిల్లులకు తరలిస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసిన రైస్‌మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి లెవీ రూపంలో పంపిస్తుండటం విశేషం. అంతేకాకుండా జిల్లాలో వివిధ ప్రాంతాలలో సేకరించిన కొందరు దళారులు రేషన్ బియ్యాన్ని అధిక ధరలకు విక్రయించేందుకు మూమూళ్ల ముట్టజెప్తూ సాలూర, మద్నూరు తదితర చెక్‌పోస్టుల ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. పేదోడికి చేరాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా ప్రత్యేక నిఘా కమిటీలు ఏం చేస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement