ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల నిఘా లేక పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అందుకు ఎంఎల్‌ఎస్ పాయింట్లు అక్రమాలకు అడ్డాగా మారాయి
సాక్షి, సంగారెడ్డి:
ప్రజా పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల నిఘా లేక పీడీఎస్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. అందుకు ఎంఎల్‌ఎస్ పాయింట్లు అక్రమాలకు అడ్డాగా మారాయి. బోగస్ కార్డుల కింద వచ్చే కోటాను కొందరు డీలర్లు రైస్ మిల్లులకు విక్రయిస్తున్నారు. అక్కడి నుంచి అవే బియ్యం మరో నెల కోటా కింద తిరిగి పీడీఎస్‌కు చేరుకుంటున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు చర్యలు చేపట్టలేకపోతున్నారు. ఒకవేళ దొరి కిరా ‘మామూలే’నట్టు వదిలేస్తున్నారు.
జిల్లాలో ఏడు లక్షల 36 వేల 838 పేద కుటుంబాలకు ప్రతి నెలా కోట్లాది రూపాయల సబ్సిడీతో ప్రభుత్వం నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ సరుకులు దారి మళ్లుతున్నాయి. బియ్యాన్ని రేషన్ దుకాణాలకు చేర్చే బాధ్యత అధికారులే. బియ్యం లోడ్ వాహనంలో ‘రూట్ అధికారులు’ విధిగా ప్రయాణించి సరుకులు పక్కదారి పట్టకుండా చూడా లి. ప్రతి మండలానికి ఇద్దరు రూట్ అధికారులను నియమించాల్సి ఉండగా.. ఎక్కడా ఈ వ్యవస్థ అమలు కావడం లేదు. కేవలం రవాణా కాంట్రాక్టర్లపై గుడ్డినమ్మకంతో సరుకులను రోడ్డెక్కిస్తున్నారు. రేషన్ డీలర్లు సిండికేట్‌గా మారి తమ పరిధిలో గల బోగస్‌కార్డులకు సం బంధించిన బియ్యాన్ని వదిలేసి మిగిలిన సరుకును ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి తీసుకెళ్తున్నారు. ఇలా అందరూ మిగిల్చిన బియ్యాన్ని ఒకేసారి లిఫ్టు చేసి గుట్టు చప్పుడు కాకుండా రైస్ మిల్లులకు తరలించేస్తున్నారు.
ఈ బియ్యా న్ని రూ.6.50 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్న మిల్లర్లు డబుల్ పాలిష్ చేసి సన్న బియ్యంగా మార్చేసి కిలో రూ.15 చొప్పున మార్కెట్లో విక్రయిస్తున్నారు. పక్కనే గల మహారాష్ట్ర, కర్ణాటకలో డిమాండ్ అధికంగా ఉండడంతో అక్కడికి తరలిస్తున్నట్టు సమాచారం. లెవీ సేకరణలో మిల్లర్ల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న బియ్యంలో దాదాపు 10 శాతం పీడీఎస్ బియ్యం రీసైకిల్ అవుతుంది. రూపాయికి కిలో సరఫరా చేసిన బియ్యాన్ని మళ్లీ రూ.13 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి రావడంతో ప్రజా ధనం దోపిడీదారుల పరమవుతుంది.
ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జీలు, రేషన్ డీలర్లు, రవాణా కాంట్రాక్టర్లు, మిల్లర్లు మాఫియాగా మారి ఈ తంతును నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. మెదక్, సిద్దిపేట, జహీరాబాద్ ప్రాంతాల్లోని రైస్ మిల్లులకు పీడీఎస్ బియ్యం తరలిపోతుంది. వరి సాగు జరగని జహీరాబాద్ ప్రాంతంలో భారీ సంఖ్యలో రైస్ మిల్లులు ఏర్పాటు కావడానికి ఇదే కారణమని తెలుస్తోంది. ప్రతి నెలా రూ.లక్షల్లో ముడుపులు అందుతుండడంతో అధికారులు నిఘాను పక్కన పెట్టినట్టు సమాచారం. గతంలో పనిచేసిన జిల్లా స్థాయి అధికారి ఒకరు దాదాపు 10 నెలల కిందట శంకరంపేటలోని ఓ రైస్ మిల్లులో 2,400 టన్నుల బియ్యాన్ని సీజ్ చేసి పీడీఎస్ సరుకుగానిర్ధారించారు. దీంతో అప్పట్లో రెండు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇన్‌చార్జీలను జిల్లా యంత్రాంగం సస్పెండ్ చేసింది. మిల్లర్ల లాబీకి తలొగ్గిన జిల్లా అధికారులు పునర్విచారణ జరిపి కోట్ల రూపాయలు విలువ చేసే ఈ సరుకును తిరిగి మిల్లర్లకు కట్టబెట్టినట్టు ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు మిన్నకుండిపోయారు.
అక్రమాలకు అడ్డాలు..
ఎఫ్‌సీఐ గోదాముల నుంచి మండల్ లెవల్ స్టాక్(ఎంఎల్‌ఎస్) పాయింట్లకు స్టేజ్-1 రవాణా కాంట్రాక్టర్లు సరుకులను చేరవేస్తున్నారు. వే బ్రిడ్జీలు లేకపోవడంతో అక్కడికి చేరిన సరుకును తూకం వేయకుండానే బస్తాలను లెక్కించి గుడ్డిగా నిర్ధారించుకుంటున్నారు. ఎఫ్‌సీఐ గోదాముల్లోనే కన్నాలు వేసి ఒక్కో బస్తా నుంచి 2 నుంచి 3 కిలోల వరకు సరుకును తస్కరించి రవాణా చేస్తున్నా స్వీకరించక తప్పని పరిస్థితి నెలకొంది.
ఇక ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరిన సరుకును చౌక ధరల దుకాణాలకు తరలించే ‘స్టేజ్-2’ రవాణా వ్యవస్థలోనూ కొందరు దండిగా సంపాదిస్తున్నారు. 19 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా జిల్లాలోని 46 మండలాలకు సరుకుల పంపిణీ జరుగుతోంది. స్టాకు లెక్కల్లో భారీ తేడాలు వెలుగు చూస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. తహశీల్దార్లు గోదాము ఇన్‌చార్జీలకు ఫోన్ చేసి స్టాకు వివరాలను సేకరించి తనిఖీ చేసినట్లు నివేదికలు పంపుతున్నారు. ఈ అంశంపై ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం నిఘా సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.