లెప్రసీ వల్ల వేలి ముద్రలు లేక రేషన్ కోసం ఇబ్బంది పడుతున్న నాగేశ్వరరావు
సాక్షి, అమరావతి: తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటకు చెందిన కె.నాగేశ్వరరావుకు లెప్రసీ వ్యాధి వల్ల చేతి వేళ్లు సరిగా లేవు. ఈ–పాస్ మిషన్లో వేలి ముద్రలు వేస్తేనే రేషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ బియ్యం తీసుకోవాలంటే ప్రతి నెలా ఇలాంటివారికి కష్టాలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో లెప్రసీతోపాటు తాపీ పనిచేసే వాళ్లకు వేలి ముద్రలు సరిగా పడటం లేదు. వీరితోపాటు వయసు మీరడం వల్ల రేషన్ దుకాణం వరకు వెళ్లలేని వాళ్లు రాష్ట్రంలో 57,810 మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.42 కోట్ల తెల్లరేషన్ కార్డుల్లో వేలిముద్రలు సరిగా పడని, రేషన్ దుకాణం వరకు వెళ్లలేని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆరు నెలల కిందట ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా వాటి గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. వేలిముద్రలు సరిగా పడనివారి నుంచి ఐరిష్ తీసుకొని సరుకులు ఇవ్వాలని రేషన్ డీలర్లకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఐరిష్ మిషన్లు ఎక్కడా పనిచేయడం లేదు.
అంబాజీపేటకు చెందిన నాగేశ్వరరావు సబ్సిడీ బియ్యం కోసం రేషన్ దుకాణానికి వెళ్లి ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా ఐరిష్ పనిచేయలేదు. ఈ విషయాన్ని రేషన్ డీలర్ తూర్పుగోదావరి జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. దీంతో రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు ద్వారా పౌరసరఫరాల శాఖ కమిషనర్ బి.రాజశేఖర్ దృష్టికి తీసుకెళ్లడంతో తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. ఇలా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిష్కరిస్తే లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని డీలర్లు కోరుతున్నారు.
కాగా.. రేషన్ షాపుల వరకు వెళ్లలేని వారికి.. మీ ఇంటికి–మీ రేషన్ పథకం ద్వారా ఇళ్లకే సరుకులు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆరు నెలల కిందట నిర్ణయం తీసుకుంది. అయితే కొందరు రేషన్ డీలర్లు దీన్ని పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉండే వీఆర్వోల ద్వారా సరుకులను అంగవైకల్యం ఉన్నవారి ఇళ్లకు పంపాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే వీఆర్వోలు సరిగా అందుబాటులో ఉండని కారణంగా సమస్య ఉత్పన్నమవుతోందని డీలర్లు అంటున్నారు. వేలిముద్రలు సరిగా పడని కారణంగా, అంగవైకల్యం వల్ల రేషన్‌కు దూరంగా ఉంటున్న లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం జిల్లాల వారీగా సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment