ఆ కార్డులకు రేషన్ కట్
- ఈ నెలలో కూడా తీసుకోకుంటే వచ్చే నెల నుంచి రేషన్ లేనట్టే
- ఈ-పాస్‌తో ప‘రేషాన్’
- త్వరలో ఫ్యామిలీ కార్డులు జారీ
సరుకులు కేటాయింపులు ఆపేసినప్పటికీ ఆ కార్డులను మాత్రం రద్దు చేసే అవకాశాలు లేవని జేసీ నివాస్ చెబుతున్నారు. కనీసం రెండు నెలల పాటు వరుసగా సరుకులు తీసుకోలేని కార్డుదారులను గుర్తించి వారికి కేటాయింపులు ఆపేస్తామన్నారు. మాకు సరుకులు అవసరం లేదు.కార్డు ఉంటేచాలు అని కోరే వారందరికి రేషన్ కార్డుల స్థానే స్మార్ట్ కార్డు తరహాలో ఫ్యామలీ కార్డులు జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు.
సాక్షి, విశాఖపట్నం: ‘ఈ-పాస్’ సాకుతో ‘సర్కార్’ నిరుపేదలకు ‘రేషన్’ దూరం చేస్తోంది. గత నెలలో నూటికి నూరు శాతం ఈపాస్ ద్వారానే నిత్యావసరాలు పంపిణీ చేశామని చెబుతున్న సర్కార్ సరుకులు తీసుకోలేని వారికి ఈ నెలలో మరో అవకాశం ఇస్తోంది. ఈ నెలలో కూడా సరుకులు తీసుకోకుంటే వచ్చేనెల నుంచి పూర్తిగా ఆపేయాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఆదేశాలందాయి. ఈ విషయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జే.నివాస్ స్పష్టం చేశారు. వచ్చే నెల నుంచి ఆ మేరకు కేటాయింపులుతగ్గించేస్తామని తెలిపారు. జీవీఎంసీలోని 412, భీమిలి, అనకాపల్లి, యలమంచలి, నర్సీపట్నం మున్సిపాల్టీలతో పాటు మరో పదిమండలాలపరిధిలో 274 రేషన్‌షాపులో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈపాస్ అమలు చేస్తున్నారు.
మిషన్లు మొరాయించడం, నెట్‌వర్క్ సరిగా పనిచేయకపోవడం వంటి సమస్యలతో తొలి నెలలో 26 శాతం మందికి మాత్రమే ఈపాస్ ద్వారా పంపిణీ జరిగింది. మిగిలిన వారికి మాన్యువల్‌గానే పంపిణీ చేశారు. మేలో నూరు శాతం ఈ పాస్ ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించగా, జీవీఎంసీలోని 2,50,888 కార్డుదారులకు, , ఇతర మన్సిపాల్టీలు, ఎంపిక చేసిన మండలాల్లో 3,55,556 కార్డుదారులకు మాత్రమే పంపిణీ చేయగలిగారు. అర్బన్‌లో 72 శాతం, రూరల్‌లో 89శాతం మాత్రమే పంపిణీ చేశారు. జీవీఎంసీలో 28 శాతం, రూరల్‌లో 11 శాతం చొప్పున 2,56,245 కార్డుదారులకు సరుకుల పంపిణీ జరగలేదు.
సెలవులు..డీలర్ల ఆందోళన: వేసవి సెలవులు కావడంతో చాలా మంది పుణ్యస్థలాలు, పర్యాటక ప్రాంతాలు, సొంత ఊళ్లకు వెళ్లడం వల్ల సరుకులు తీసుకోలేకపోవడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఈ పాస్ మిషన్ల పనిచేస్తున్నప్పటికీ చాలా మంది డీలర్లు కావాలనే ఒకటికి పదిసార్లు తిప్పించుకోవడంతో చాలామంది కార్డుదారులు తీవ్ర నిరుత్సాహంతో వెనుదిరిగారు. మరి కొంత మంది బయోమెట్రిక్ పనిచేయకపోవడంవంటిసాంకేతిక కారణాలతో కూడా సరుకులు తీసుకెళ్లలేకపోయారని తెలుస్తోంది.కమిషన్ పెంచాలంటూ డీలర్లు ఆందోళన బాటపట్టడం కూడా సరుకుల పంపిణీపై ప్రభావం చూపిందంటున్నారు.
కానీ అధికారుల వాదన మరోలా ఉంది. గతంలో రేషన్ సరుకుల కోసం కార్డులు తీసుకునే వారు కొంతమందైతే.. వైద్యం,ఇతర అవసరాల కోసం మరి కొంతమంది కార్డులు తీసుకున్నారని, వీరంతా ఏనాడు రేషన్‌సరుకులు తీసుకునే వారు కాదని చెబుతున్నారు. గతనెలలో సరుకులు తీసుకోలేని వారిలో ఎక్కువ మంది ఇదే కోవకు వచ్చే అవకాశాలు లేకపోలేదని భావిస్తున్నారు.