ఈ–పాసు’ గాలా..! | e-pass system faild | Sakshi
Sakshi News home page

ఈ–పాసు’ గాలా..!

Published Sun, Oct 23 2016 7:26 PM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM

ఈ–పాసు’ గాలా..! - Sakshi

ఈ–పాసు’ గాలా..!

–రేషన్‌ బియ్యం పక్కదారి!
–అక్రమాలను అరికట్టలేని టెక్నాలజీ
–సర్కారు కోతలు వట్టిదే!
–పట్టుబడిన 25 టన్నుల బియ్యం
 
lప్రజాపంపిణీ వ్యవస్థలో అక్రమాలను అరికట్టేందుకు సర్కారు ప్రవేశపెట్టిన ఈ–పాస్‌ విధానం ఆచరణలో విఫలమైంది. దీనివల్ల లబ్ధిదారులకే సరుకులు అందుతాయని, అవకతవకలకు తావే ఉండదని ప్రభుత్వం పలికిన బీరాలు వట్టిదేనని తేలిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకూ జిల్లా నుంచి అక్రమంగా రవాణా అవుతున్న 25 టన్నుల బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. అడపదడపా చేపట్టిన దాడుల్లోనే ఇంతపెద్దమొత్తంలో బియ్యం పట్టుబడితే.. వాస్తవంగా జిల్లాలు దాటుతున్న బియ్యం విలువ ఎంత ఉంటుందో అంచనాకూ అంతుబట్టని దుస్థితి నెలకొంది.  
 
 
చింతలపూడి : జిల్లాలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. 
జిల్లాలో రేషన్‌ బియ్యం పక్కదారి పడుతూంది. మన జిల్లా నుండే కాకుండ సరిహద్దు రాష్ట్రమైన తెలంగాణ నుండి కూడ రేషన్‌ బియ్యం భారీగా దిగుమతి అవుతూంది. తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపనలు వస్తున్నాయి. పేదల కడుపు నింపాల్సిన రూపాయి కిలో బియ్యం రైస్‌ మిల్లులకు చేరి పాలిష్‌ చేసి బహిరంగ మార్కెట్లో సన్న బియ్యంగా మారి అధిక ధరలకు అమ్ముడవుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జిల్లాలో అధికారులకు పట్టుబడిన రేషన్‌ బియ్యం సుమారు 25 టన్నులు. పట్టుబడకుండ జిల్లాలు దాటుతున్న బియ్యం ఏస్ధాయిలో ఉందో ఊహకే అంతుపట్టదు. ప్రభుత్వం సబ్సిడీ భరించి  రూపాయికే  కిలో బియ్యం అందిస్తూంది. జిల్లాలో 12,46,871 రేషన్‌ కార్డులు ఉన్నాయి. వాటిలో 10,77,504 తెల్ల రేషన్‌ కార్డులు కాగ, 1,034 అన్నపూర్ణ కార్డులు, 1,60,033 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. సబ్సిడీ బియ్యానికి బయట మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో అక్రమ రవాణా వ్యాపారంగా మారింది. కొన్నిచోట్ల డీలర్లు, మరికొన్ని చోట్ల లబ్దిదారులే చౌక బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తంతు కొనసాగుతూంది. అధికారులకు విషయం తెలిసినా ఎవరైనా సమాచారం అందించే వరకు పట్టించుకోరన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని భావించిన ప్రభుత్వం ఈ పాస్‌ విధానం ప్రవేశపెట్టి బయోమెట్రిక్‌ విధానం ద్వార లబ్దిదారుల నుండి వ్రేలిముద్రలు సేకరించి మరీ రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తుంది. బియ్యం లబ్దిదారులకు చేరాక అసలు తతంగం ప్రారంభం అవుతుంది. రేషన్‌ బియ్యానికి భారీ సబ్సిడీ ఉండటం, భారీగా లాభాలు వస్తుండటంతో లబ్దిదారులను ప్రలోభపెట్టి కిలో 10 నుండి 12 రూపాయలకు దళారులు కొంటున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని  తూర్పు గోదావరి జిల్లాలోని మిల్లులకు సరఫరా చేసి కోట్లు దండుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి మండలం, రాఘవాపురం కేంద్రంగా ఈ అక్రమ దందా యధేచ్ఛగా సాగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తూంది. ఇటీవల రాఘవాపురం నుండి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పోలీసులు పట్టుకుని పౌరసరఫరాల అధికారులకు అప్పగించారు. అంతకుముందు కూడ గణిజర్ల నుండి అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ళ రేషన్‌ బియ్యాన్ని పౌరసరఫరాల అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెడుతున్నా పరిస్ధితిలో మార్పు రావడం లేదు. మూడు సార్లు ఒకే వ్యక్తి ఈ అక్రమ రవాణా చేస్తూ పట్టుబడటం ఇక్కడ విశేషం.  భారీ లాభాలు వస్తుండటంతో వ్యాపారులు బరితెగించి ఈ వ్యాపారంలో దిగుతున్నారు. దీనికి తోడు సబ్సిడీ బియ్యం పట్టుబడ్డ సందర్భాల్లో అధికారులు తీసుకుంటున్న చర్యలు కూడ నామమాత్రంగా ఉంటున్నాయి. ఈ కేసుల్లో పట్టుబడ్డ వారిపై సాధారణంగా 6(ఏ) కేసులు నమోదు చేస్తారు. వీటిని పూర్తి స్ధాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకునే సరికి కాలం గడిచి పోతూంది.  ఒకవేళ ఎవరికైనా శిక్ష పడిన దాఖలాలు ఉన్నాయా అంటే అవీ లేవు.  దీంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణా  మూడు పువ్వులు ఆరు కాయలుగా యధేఛ్ఛగా సాగిపోతూంది. తెలంగాణాకు సరిహద్దు మండలం కావడంతో తెలంగాణ రాష్ట్రం నుండి రేషన్‌ బియ్యం ఇక్కడికి భారీగా దిగుమతి అవుతూంది. ఇక్కడి నుండి లారీల్లో లోడు చేసి మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు దష్టి సారించి రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ ఏడాది 6 కేసులు నమోదు 
ఈ ఏడాది ఇప్పటి వరకు రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై 6 కేసులు నమోదు చేశాం. 25 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నాం. రేషన్‌ బియ్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు సమాచారం అందిస్తే దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటాం. 
                                              ఎస్‌ శివశంకర్‌రెడ్డి –డీఎస్‌ఓ ,ఏలూరు 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement