రేషన్ దుకాణాల్లో సరకుల పంపిణీ
► నాలుగురోజుల్లోనే జిల్లాలో 50.25 శాతం సరఫరా
► తెనాలి డివిజన్‌లో 49.88 శాతం
తెనాలి : రేషన్ దుకాణాల్లో సరఫరా చేస్తున్న నిత్యావసర సరకుల పంపిణీ వేగవంతం చేస్తున్నారు. నిర్ణీత సమయాల్లో కచ్చితంగా దుకాణాలు తెరచి ఉంచడం, కార్డుదారులకు సరఫరా చేయడంతో డీలర్లను పరుగులు తీయిస్తున్నారు. మార్చి నెల నుంచి పదో తేదీలోగా పంపిణీ పూర్తిచేయాలని పౌరసరఫరాల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ముందుగా 5వ తేదీతో ముగించేయాలని నిర్ణయం తీసుకున్నా, కార్డుదారులు మిగిలిపోవడంతో పొడిగించారు. ఏప్రిల్‌లో మళ్లీ అదే స్పీడుతో పనిచేయిస్తున్నారు. ఫలితంగా 4వ రోజయిన సోమవారం సాయంత్రానికి జిల్లాలో 50.25 శాతం సరకుల పంపిణీని పూర్తిచేయగలిగారు.
తెనాలి డివిజన్‌లోని 18 మండలాల్లో 49.99 శాతం పంపిణి చేసినట్టు ఆర్డీవో జి.నర్సింహులు తెలియజేశారు. డివిజన్‌లో 842 చౌకధరల దుకాణాలు ఉండగా, 4,10,923 కార్డుదారులు ఉన్నారు. ఇందులో 2,04,988 మంది కార్డుదారులు తమ సరకులు తీసుకున్నారు. వాస్తవంగా పంపిణీ గడువు పూర్తయ్యేసరికి 80-85 శాతం సరకులనే పంపిణీ చేయగలుగుతున్నారు. రేషన్ కార్డులోని కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చౌకదుకాణం వరకు వెళ్లి వేలిముద్రలు వేయడం తప్పనిసరి కావడంతో అది ఇష్టం లేని కొందరు సరకులు తీసుకోవడం లేదు. బియ్యం, పంచదార అవసరం లేని కార్డుదారులు ఇదే తరహాలో పట్టించుకోకపోవడం ఇందుకు కారణం. 85 శాతానికి మించని పంపిణీలో ఇప్పటికే 50 పూర్తయిందంటే చాలావరకు సరఫరా చేసినట్టని చెప్పొచ్చు.
డివిజన్‌లో ఇతర మండలాలకన్నా నగరం మండలం 64.19 శాతం సరకుల పంపిణీతో ప్రథమస్థానంలో ఉంది. ఇక్కడ 17,410 కార్డుదారులకు 11,176 మంది కార్డుదారులు సరకులు తీసుకున్నారు. ద్వితీయస్థానంలో నిజాంపట్నం మండలం (56.35 శాతం), తర్వాతి స్థానంలో కాకుమాను మండలం (56.33 శాతం) ఉన్నాయి. అన్నిటికన్నా తక్కువగా 38,91 శాతం పంపిణీతో దుగ్గిరాల మండలం చివరిస్థానంలో ఉంది. చివరి నుంచి రెండోస్థానంలో తెనాలి నిలిచింది. ఇక్కడ 42.5 శాతం పంపిణీ చేయగలిగారు.