ఆ కాస్తా.. ఆధార్‌మూ కట్!
►ఆధార్‌తో అనుసంధానం కాని కార్డులకు రేషన్ నిలిపివేత
►ఆగస్టు కోటా నుంచే అమలుకు అధికారులు సిద్ధం
►జిల్లాలో ఇంకా పూర్తి కాని ఆధార్ నమోదు ప్రక్రియ
►6.36 లక్షల యూనిట్లకు నిలిచిపోనున్న సరుకుల సరఫరా
►ప్రభుత్వ నిర్ణయంతో పేదవర్గాలకు శరాఘాతం
శ్రీకాకుళం పాత బస్టాండ్: మంత్రి కాదంటారు.. అధికారులు తప్పదంటారు!.. అనడమే కాదు.. మంత్రి సూచనలను బేఖాతరు చేస్తూ తమ పని తాము చేసుకుపోతున్నారు. ఫలితంగా ఆగస్టు నెల నుంచి లక్షలాది మందికి రేషన్ సరఫరా నిలిచిపోనుంది. ఇదంతా ఆధార్ కార్డుల పితలాటకం. పేదలకు నెలనెలా ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ సరుకులు ఎంతోకొంత ఆదరువుగా ఉంటున్నాయి. ఇప్పుడు రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేయడం, అనుసంధానం చేసుకోని కార్డుదారులకు ఆగస్టు నుంచి రేషన్ కోటా నిలిపివేయాలని పౌరసరఫరాల అధికారులు నిర్ణయించడంతో పేదలు ఆ చిన్న ఆధారం కూడా కోల్పోయినట్లే.
దీని వల్ల జిల్లాలో 6,36,828 మంది ప్రజలకు రేషన్ నిలిచిపోనుంది. ఆధార్ ప్రక్రియ మూడేళ్ల క్రితం ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. ప్రభుత్వం మాత్రం అన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తోంది. అందులో భాగంగానే రేషన్‌కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నారు. జూలై 31తో దీని గడువు ముగుస్తుంది. అప్పటికీ అనుసంధానం చేసుకోని వారికి ఆగస్టు నెల రేషన్ కట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆధార్ నెంబర్ లేని రేషన్ యూనిట్లను గుర్తించాలని కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. ఆధార్‌తో పని లేకుండా కార్డుదారులందరికీ రేషన్ ఇవ్వాలని పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత ఒకపక్క సూచిస్తున్నా.. అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో ఆధార్ కోసం పేర్లు నమోదు చేసుకోని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
పది నెలలుగా కేంద్రాల మూత
ఆధార్ నమోదు ప్రక్రియ పెద్దగా ముందుకు సాగడం లేదు. గత పది నెలలుగా నమోదు కేంద్రాలను మూసివేశారు. మండల, డివిజన్ స్థాయిలో నిరంతరం పని చేసేలా ఆధార్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా, అధికారులు మాత్రం ఆ పనిని మీ సేవ కేంద్రాలకు అప్పజెప్పారు, అయితే అక్కడ నివాస ధ్రువపత్రాలు, నెట్‌వర్క్, ఇతర సమస్యల కారణంగా ఆధార్ నమోదు ప్రక్రియ అంతగా జరగడం లేదు. మరోవైపు పేరు నమోదు చేయించుకున్నా ఇప్పటికి వేల సంఖ్యలో ప్రజలకు ఆధార్ నెంబర్లు గానీ, కార్డులు గానీ అందలేదు.
ఈ కారణాల వల్ల జిల్లాలోని రేషన్ కార్డుదారుల్లో ఇప్పటివరకు 76.15 శాతం మందే ఆధార్ నెంబర్ పొందారు. వీరంతా రేషన్ కార్డులతో అనుసంధానం చేయించుకున్నా మిగిలిన 23.85 శాతం మంది పరిస్థితి అగ మ్యగోచరంగా మారింది. వీరితోపాటు వికలాంగులు, పిల్లలు, కుష్ఠు వ్యాధిగ్రస్తులు, వృద్ధులు వేలుముద్రలు, ఐరిష్ వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరంతా పేద వర్గాలకు చెందిన వారే కావడం.. ఆధార్ లేకపోవడం వల్ల బియ్యం, ఇతర రేషన్ సరుకులు అందకుండాపోయే ప్రమాదం ఉంది.
6,360 క్వింటాళ్ల కోటా బియ్యం కట్
జిల్లాలో 7,98,415 కుటుంబాలకు రేషను కార్డులు ఉన్నాయి. వీటిలో 26,70,083 మంది పేర్లు(యూనిట్లు) నమోదై ఉన్నాయి. రేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యుడిని ఒక్కో యూనిట్‌గా పరిగణించి నాలుగు కేజీలు చొప్పున బియ్యం అందజేస్తారు. అయితే వీరిలో ఇంతవరకు 18,09,976 (76,15 శాతం) మందే ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు. మిగిలిన 6,36,828 మంది (23,85శాతం) అనుసంధానం కాలేదు, ఈ లెక్కన ఆగస్టు నుంచి జిల్లాలో సుమారు 6,360 క్వింటాళ్ల బియ్యం కోటా రద్దుకానుంది. ఈ మేరకు రాయితీ భారం ప్రభుత్వానికి తగ్గుతుంది. ఈ భారం సాధ్యమైనంత వరకు తగ్గించుకునేందుకే బోగస్ కార్డులు, ఆధార్ అనుసంధానం పేరుతో కోటా కట్ చేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.