
విలేకరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు
వెంకటాచలం: చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమం కుంటుపడి రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు ‘రావాలి జగన్, కావాలి జగన్’ కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గంలో మొదట వెంకటాచలం మండలం గొలగమూడి నుంచి సోమవారం ప్రారంభించారు. గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆలయంలో పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబుపాలనలో వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి, మరోసారి బాబు మోసాల వలలో పడవద్దని ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తామన్నారు. బాబు నాలుగన్నరేళ్ల పాలనలో ఎంచేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి తప్ప అభివృద్ధి ఛాయలు ఎక్కడా కన్పించడంలేదన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి, ఆయన కుమారుడు కలిసి పంచభూతాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వచ్చి ఓట్లు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఎవరూ వాళ్లను నమ్మొద్దన్నారు. చంద్రబాబు ఎన్నికుట్రలు చేసినా మొక్కువోని ధైర్యంతో ముందుకు సాగుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల కార్యక్రమంతో ప్రతీ కుటుంబానికి రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు లబ్ధి చేకూరే అవకాశం ఉందనే విషయాన్ని ప్రతిఓక్కరూ గుర్తించుకోవాలన్నారు. తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు మాట్లాడుతూ చంద్రబాబులాంటి మోసపూరిత సీఎం మరొకరు లేరన్నారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఒక్కటైనా నెరవేర్చారా.. లేదనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలన్నారు. ఎన్నికల ముందు బాబు ఇచ్చిన మోసపూరిత వాగ్దానాలను తెలియజేసేందుకు మూడోసారి ప్రజల్లోకి వస్తున్నామని చెప్పారు. పేదలకు న్యాయం చేసేవారైతే నాలుగన్నరేళ్ల పాలన ముగిసిన తరువాత అన్న క్యాంటీన్‌లు ప్రారంభిస్తారా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కోడూరు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, పార్టీ మండల కన్వీనర్ కె.చెంచుకృష్ణయ్య, ఎంపీటీసీ కోసూరు పద్మాగౌడ్ పాల్గొన్నారు.