కర్ణాటక సరిహద్దున ఉన్న దుర్గాల్లో రాయదుర్గం చారిత్రాత్మకమైనది. విజయనగర రాజుల పాలనా వైభవానికి, నాటి శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా నిలిచిన ప్రాంతం. 15వ శతాబ్దంలో రాజకీయ, సాంస్కృతిక రంగాలకు నిలయం. కాలక్రమేణా రాజులు పోయినా.. రాజ్యాలు అంతరించినా.. ఆ సంస్కృతీ పరిమళాలు మాత్రం ఇప్పటికీ గుభాళిస్తూనే ఉన్నాయి. అత్యంత ప్రశాంతమైన ఈ నియోజకవర్గంలో ఎడారి ఛాయలు విస్తరిస్తుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
సాక్షి, రాయదుర్గం : నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 67 ఏళ్లలో ఇప్పటి వరకు 16 సార్లు జరిగాయి. అయితే శాసనసభ్యులుగా గెలుపొందిన నాయకులు మాత్రం పదవులకు ఆమడదూరంలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రాధాన్యత లేకపోవడంతో నియోజకవర్గం అభివృద్ధికి కూడా ఆమడదూరంలో ఉంది. 2014లో టీడీపీ తరఫున గెలుపొందిన కాలవ శ్రీనివాసులు మాత్రం ఆ చరిత్రను చెరిపేశారు. ప్రభుత్వ చీఫ్‌విప్, గృహనిర్మాణ, పౌరసమాచార శాఖ మంత్రి అయ్యారు. మున్సిపాలిటీతోపాటు రాయదుర్గం, గుమ్మగట్ట, డి.హీరేహాళ్ , బొమ్మనహాళ్ , కణేకల్లు మొత్తం ఐదు మండలాలున్నాయి. అంతకు మునుపు ఆంధ్రాలో ఉన్న బళ్లారి జిల్లాను కర్ణాటకలో కలవడంతో బళ్లారి జిల్లాలో ఉన్న రాయదుర్గం నియోజకవర్గం అనంతపురం జిల్లాలో చేరింది.
గుమ్మఘట్ట మండలం పూలకుంట వద్ద 2016 ఆగస్టు 31న రక్షకతడుల ప్రారంభానికి వచ్చిన చంద్రబాబు ఆ ఏడాదిలోపు బీటీపీకి నీరు తెస్తామంటూ తొలిసారి హామీ ఇచ్చారు. 2017 జూన్ 9న ఏరువాక కార్యక్రమ ప్రారం భానికి రెండోసారి వచ్చిన బాబు అదే ఏడాది ఆగస్టు 15న బీటీపీ పనులకు మంత్రి కాలవ శంకుస్థాపన చేస్తారని, రూ.968 కోట్లతో 2018 అక్టోబర్ 10న బీటీ ప్రాజెక్టు పనులు ప్రారంభించి, 2019 సంక్రాంతికి నాటికి కృష్ణజలాలతో ప్రాజెక్ట్‌ను నింపుతామని గొప్పగా చెప్పారు. ఇందుకు సంబంధించి ప్రధాన రహదారుల పక్కన రైతులకు నష్టపరిహారం చెల్లించకుండానే అక్కడక్కడ కాలువలు తవ్వి వదిలేశారు. కమీషన్లతో పాలకులే లబ్ధి పొందారు. రాయదుర్గం కేంద్రంగా జీన్స్ పరిశ్రమకు విద్యుత్ రాయితీ ఇచ్చి, గార్మెంట్ రంగాన్ని అంతర్జాతీయ గుర్తింపు పొందేలా అభివృద్ధి చేస్తానని గతంలో బాబు ఇచ్చిన హామీ మాటలకే పరిమితమైంది. బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో కొండల్లా పేరుకుపోయిన ఇసుకమేటలను తొలగిస్తామని ఇచ్చిన హామీ ఎండమావిగానే మిగిలింది.
ప్రధాన సమస్యలు..
నియోజకవర్గాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ప్రధానమైనది కరువు. ఏటా తీవ్ర వర్షాభావంతో సాగు చేసిన పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉపాధి హామీ పనులను పూర్తిస్థాయిలో చేపట్టడకపోవడంతో వ్యవసాయ కూలీలతోపాటు రైతులు వేలాదిగా కర్ణాటకకు వలస వెళుతున్నారు. హెచ్చెల్సీ ఆధునీకరణ పనులు వేగవంతం చేసి చివరి ఆయకట్టు రైతుల భూములకు నీరివ్వడంలోనూ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. బీటీపీకి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నీరు మళ్లించి 12 వేల ఎకరాల భూములను సాగులోకి తేవాలని కోరుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. జీన్స్ కార్మికులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు.
‘దుర్గం’ దాహార్తి తీర్చిన
గతంలో రాయదుర్గం పట్టణంలో తీవ్రమైన తాగునీటి సమస్య ఉండేది. పట్టణ ప్రజలు నిత్యం నీటి కోసం కొట్టుకోవాల్సిన దుస్థితి ఉండేది. అయితే వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2005లో తాగునీటి పథకానికి రూ.48 కోట్లు విడుదల చేశారు. కణేకల్లు వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు కు 168 ఎకరాలు భూసేకరణ చేసి, ట్యాంకు నిర్మించారు. హెచ్చెల్సీ నీటిని ట్యాంకులోకి ఎత్తిపోతల ద్వారా నింపి అక్కడి నుంచి రాయదుర్గం వరకు పైపులైను నిర్మించారు. ఆ తర్వాత 2009లో అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కోరిక మేరకు తాగునీటి కోసం రూ.4 కోట్లు విడుదల చేశారు. మహానేత కృషికి గుర్తుగా రాయదుర్గం తాగునీటి పథకానికి వైఎస్సార్ తాగునీటి పథకంగా నామకరణం చేశారు.
టీడీపీకి వ్యతిరేక పవనాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలు నెరవేర్చకపోవడం, నియోజకవర్గంలో మంత్రి కాలవతో పాటు అతని అనుచరగణం చేసిన మట్టి, ఇసుక దోపిడీతో ప్రజల్లో టీడీపీకి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంక్షేమ పథకాలు అర్హులకు అందించకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకోవడంపై కూడా బాధితులు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి కాలవ తన కోటరీ ద్వారా వేల కోట్లు దండుకున్నట్లు ఆ పార్టీలోని నాయకులే బహిరంగంగా ప్రకటిస్తున్నారు. మంత్రి అవినీతిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, సీనియర్ టీడీపీ నేతలు సమావేశాలు పెట్టి చెబుతున్నారు. టీడీపీకి చెందిన దీపక్‌రెడ్డి వర్గాన్ని కేసులు పెట్టి వేధించాడని, దాడులు చేయించాడని ఆవేదన చెందుతూ మంత్రికి వ్యతిరేకంగా ఓటు వేయిస్తామంటూ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీకి ఆదరణ
నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి ఆదరణ పెరుగుతోంది. ఆ పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రజాసమస్యలపై ఎప్పటికప్పుడు పోరాటాలు సాగిస్తూ వస్తున్నారు. నవరత్నాలపై ఇప్పటికే నియోజకవర్గమంతా ముమ్మర ప్రచారం చేశారు. జగన్ పథకాలతో ఆకర్షితులైన పలువురు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి రాకతో రాయదుర్గం పట్టణంతోపాటు కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో పార్టీకి మరింత బలం పెరిగింది. సామూహిక వివాహాలు, ట్రై సైకిళ్ల పంపిణీ, ఉచిత కంటి ఆపరేషన్లు, మసీదులు, ఆలయాల అభివృద్ధికి విరివిగా విరాళాలు తదితర సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ ‘కాపు’ తన ప్రత్యేకతను చాటుకున్నారు.
రాయదుర్గం నియోజకవర్గ వివరాలు....
మొత్తం జనాభా | 3,19,479 |
మొత్తం ఓటర్లు | 2,40,196 |
పురుషులు | 1,20,350 |
మహిళలు | 1,19,839 |
ఇతరులు | 07 |
పోలింగ్ బూత్‌లు | 316 |
రాయదుర్గం ఎమ్మెల్యేలు వీరే..
సంవత్సరం | పార్టీ | విజేత |
1952 | కాంగ్రెస్ | గురుమాల నాగభూషణ |
1957 | కాంగ్రెస్ | ఎన్‌సీ శేషాద్రి |
1962 | కాంగ్రెస్ | లక్కా చిన్నపరెడ్డి |
1967 | స్వతంత్ర | గొల్లపల్లి తిప్పేస్వామి |
1972 | కాంగ్రెస్ | గొల్లపల్లి తిప్పేస్వామి |
1975 | రెడ్డి కాంగ్రెస్ | పయ్యావుల వెంకటనారాయణ |
1978 | కాంగ్రెస్ | కేబీ చన్నమల్లప్ప |
1983 | స్వతంత్ర | పాటిల్ వేణుగోపాల్ రెడ్డి |
1985 | టీడీపీ | బండి హులికుంటప్ప |
1989 | కాంగ్రెస్ | పాటిల్ వేణుగోపాల్ రెడ్డి |
1994 | టీడీపీ | బండి హులికుంటప్ప |
1999 | కాంగ్రెస్ | పాటిల్ వేణుగోపాల్‌రెడ్డి |
2004 | టీడీపీ | మెట్టు గోవిందరెడ్డి |
2009 | కాంగ్రెస్ | కాపు రామచంద్రారెడ్డి |
2012 | వైఎస్సార్‌సీపీ | కాపు రామచంద్రారెడ్డి |
2014 | టీడీపీ | కాలవ శ్రీనివాసులు |
Comments
Please login to add a commentAdd a comment