రాయపాటి డైలమా !
సాక్షి ప్రతినిధి, గుంటూరు :డామిట్ .. కథ అడ్డం తిరిగిందన్న చందంగా గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు రాజకీయ భవితవ్యం ఒక్కసారిగా డైలమాలో పడింది. యూపీఏ అధిష్టానంకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ అధిష్టానం మంగళవారం ఆ పార్టీకి చెందిన ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను బహిష్కరించింది. వారిలో గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండటం జిల్లా పార్టీ శ్రేణుల్లో కలకలం రేపింది. ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపడంపై భిన్నకథనాలు వినపడుతున్నాయి.
కాంగ్రెస్ ఆడుతున్న డ్రామాలో ఇది ఓ భాగమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా రాయపాటి మొదటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెడితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తనతోపాటు అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేస్తారని ప్రకటించారు. తామంతా సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని, అధిష్టానం తమ మాట ఖాతరు చేయ కుండా రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకుంటూ వచ్చారు. ఈ విధమైన ప్రకటనలు ద్వారా కాంగ్రెస్ నిర్ణయానికి తాను వ్యతిరేకంగా ఉన్నానని తెలియజేస్తూ ప్రజల్లో సానుభూతి పెంచుకునే యత్నం చేశారు.
ఎంపీగా ఐదు సంవత్సరాల కాలంలో ప్రజలకు చేసిన సేవలు అంతంత మాత్రంగానే ఉండటంతో రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు వచ్చే అవకాశాలు లేవు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడేందుకు సమైక్యాం ధ్ర ఉద్యమాన్ని రాయపాటి ఒక ఆయుధంగా వాడుకున్నారనే అభిప్రాయం వినపడుతోంది.
రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో కాంగ్రెస్‌కు నూకలు చెల్లే అవకాశాలు ఉండటంతో ఆ పార్టీ అధిష్టానం వ్యూహాత్మకంగానే కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిలను సమైక్యాంధ్రకు అనుకూలంగా వ్యవహరించే విధంగా ఏర్పాట్లు చేసిందని చెబుతున్నారు. ఆ వ్యూహంలో భాగంగానే రాయపాటి... సీఎం కిరణ్‌కుమార్ రెడ్డికి అనుకూలం గా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారని భావిస్తున్నారు. సీఎం నేతృత్వంలో ఆవిర్భవించనున్న కొత్త పార్టీ తరఫున సమైక్యాంధ్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లి ఓట్లు పొందే ఆలోచనలో రాయపాటి ఉన్నారనే ఊహాగానాలు వినపడుతున్నాయి.