కొత్తగూడెం, న్యూస్‌లైన్: తెలంగాణ జిల్లాల ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం స్థానిక ప్రకాశం స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాలను సిద్ధం చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన మెడికల్ కిట్లను సీఈఆర్ క్లబ్‌లో ఏర్పాటు చేశారు. ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ ర్యాలీలో 100 మంది ఆర్మీ సిబ్బంది, 20 మంది ఆర్మీ అధికారులు, 600 మంది పోలీసులు, సింగరేణి, మున్సిపల్ శానిటరీ సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. ఈ ఏర్పాట్లను కొత్తగూడెం ఆర్డీవో, ర్యాలీ కో-ఆర్డినేటర్ డి.అమయ్‌కుమార్, ఆర్మీ రిక్రూట్‌మెంట్ సెల్ డెరైక్టర్ యోగేష్ ముదిలియార్, కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్ పర్యవేక్షిస్తున్నారు.
మొదట ఎంపీసీ అభ్యర్థులకు ఎంపికలు..
మొత్తం ఐదు అంశాలలో నిర్వహిస్తున్న ఈ రిక్రూట్‌మెంట్ తొలిరోజు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన మాత్రమే ఉంటుంది. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదటి దఫా ఎంపికలు ప్రారంభించనున్నారు. సోల్జర్ టెక్నికల్ విభాగంలో ఎంపీసీ చేసిన వారు ఈ ఎంపికలకు అర్హులు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రైల్వేస్టేషన్, బస్టాండ్ సెంటర్లలో సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిక్రూట్‌మెంట్ చేసే అధికారులకు తెలుగు రానందున అనువాదం చేసేందుకు ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచనున్నారు.
తరలివస్తున్న అభ్యర్థులు..
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి అభ్యర్థులు కొత్తగూడెం తరలివస్తున్నారు. వారు ముందుగా ప్రకాశం స్టేడియం వద్దకు చేరుకుని నోటిఫికేషన్, పరీక్షల తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. ఏజెన్సీలోని మారుమూల ప్రాంతాల గిరిజన అభ్యర్థుల కోసం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకం గా కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాట్లు చేశారు. శనివా రం జరిగే మొదటి దఫా ర్యాలీకి సుమారు 5 వేల మంది హాజరవుతారని అంచనా.
ఎంపిక జరిగే తీరు ఇలా..
ఈ ర్యాలీలో వివిధ పరీక్షల నిర్వహణకు ప్రకాశం స్టేడియం, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం, సీఈఆర్ క్లబ్‌లలో ఏర్పాట్లు చేశారు. తొలుత అభ్యర్థులు ప్రభుత్వ జూనియ ర్ కళాశాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి ఎత్తు పరిశీలించిన తర్వాత సెక్యూరిటీ బ్యాండ్, టోకెన్ ఇస్తారు. ఇక్కడి నుంచి 300 మందిని ఒక బ్యాచ్‌గా ఏర్పాటు చేసి ప్రకాశం స్టేడియానికి తరలిస్తారు. అక్కడ దేహ దారుఢ్య పరీక్షలతోపాటు రన్నింగ్, లాంగ్‌జంప్, బార్ బ్యాలన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఇదే స్టేడియంలో ఏర్పా టు చేసిన టెంట్ వద్ద రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత సాధారణ వైద్య పరీక్షలు పూర్తి చేసి, పూర్తిస్థాయి వైద్య పరీక్షలు సీఈఆర్ క్లబ్‌లో నిర్వహిస్తారు. శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే రన్నింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఆర్మీ ర్యాలీకి అంతా రెడీ
Published Fri, Jan 17 2014 5:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
Advertisement
Advertisement