సాక్షి, హైదరాబాద్: తిరుపతిలో తానేమీ తప్పుగా మాట్లాడలేదని, ఆ మాటలు తప్పు అనుకుంటే క్షమాపణ కోరతానని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ వీ.హనుమంతరావు చెప్పారు. తిరుమలలో శనివారం ఆయన మీడియా ముందు చేసిన వ్యాఖ్య లు వివాదాస్పదమైన నేపథ్యంలో.. ఆదివారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం వద్ద దానిపై వివరణ ఇచ్చారు. ‘‘కేంద్రం నిర్ణయం తీసుకున్నాక రేషియో ప్రకారమే ఆంధ్రా ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళతారని, పోనటువంటివారు, ఇష్టం లేనివారు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఈడనే ఉండొచ్చని అన్నాను. వెళ్లిపొమ్మని నేను ఎక్కడా అనలేదు’’ అని చెప్పారు. తిరుమలలో తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ వీహెచ్ ఈసారి రాయలసీమ ప్రాంతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళే సమయంలో ఏం చేస్తారో చెప్పలేం కదా. అందులోనూ రాయలసీమ. రాయలసీమ అంటే తెలంగాణ వాళ్లకు భయం కదా! సీమ వాళ్లు ఏమైనా చేయగలుగుతారని ముందే భార్య, పిల్లలు అందరినీ పంపేశా. నేను ఒక్కడినే మిగిలా’’ అని వ్యాఖ్యానించారు.