సాగుకు సన్నద్ధం
12 వేల ఎకరాల్లో తగ్గనున్న వరి
6.37 లక్షల నుంచి 6.25 లక్షల ఎకరాలకు కుదింపు
రాజధాని నిర్మాణం, పట్టణీకరణ పెరగడమే కారణం
సేంద్రియ పద్ధతిలో సాగుకు ఏర్పాట్లు
మచిలీపట్నం : జిల్లాలో ఖరీఫ్ సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. 8.72 లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వేరుశెనగ, పత్తి, మిరప, చెరుకు, నువ్వుల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఉష్ణోగ్రతల్లో మార్పులు రాకపోవటం, కాలువలకు సాగునీటిని ఎప్పటికి విడుదల చేస్తారనే అంశంపై ప్రభుత్వం నుంచి స్పష్టత లేని కారణంగా సాగు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
12 వేల ఎకరాల్లో తగ్గనున్న వరి సాగు...
జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో 6.25 లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సాధారణంగా 6.37 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగాల్సి ఉండగా రాజధాని నిర్మాణం, పట్టణీకరణ పెరగటం తదితర అంశాల నేపథ్యంలో 6.25 లక్షల ఎకరాల్లో వరిసాగుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పత్తి 1.39 లక్షల ఎకరాల్లో, చెరుకు 30,600, మిర్చి 27,500, మొక్కజొన్న 16,250, పెసర 12,500, కందులు 6,250, మినుము 6,250, వేరుశెనగ 2,872, నువ్వులు 1,250 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయ అధికారులు ప్రణాళిక రూపొందించారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వరి, చెరుకు తదితర పంటల్లో సాగు విస్తీర్ణాన్ని కొంతమేర తగ్గించారు. ఈ ఏడాది 30 వేల మట్టి నమూనాలను సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సేకరించారు. భూమిలో నత్రజని, భాస్వరం తదితర లోపాలతో పాటు సూక్ష్మధాతు లోపాలను గుర్తించి రైతులకు ఎరువుల వాడకంపై అవగాహన కల్పించనున్నారు. జింకు 3,500 టన్నులు, జిప్సం 6 వేలు, బోరాక్స్ 80 టన్నులను పంపిణీకి సిద్ధంగా ఉంచారు. దీనిలో 878 టన్నుల జిప్సం, జింకులను రైతులకు అందజేశారు.
సేంద్రియ విధానంలో సాగు
ఈ ఏడాది సేంద్రియ పద్దతుల్లో వ్యవసాయాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. 2014 ఖరీఫ్ సీజన్‌లో 12,900 టన్నుల జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను పంపిణీ చేయగా.. ఈ ఏడాది 17,500 టన్నుల పచ్చిరొట్ట విత్తనాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 11,038 టన్నుల విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వాటిలో 3,212 టన్నుల విత్తనాలను రైతులకు అందజేశారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయాన్ని తక్కువ ఖర్చుతో చేయటంతో పాటు వెదజల్లే పద్ధతిలో సాగును పెంచాలని నిర్ణయించారు. 2014 ఖరీఫ్‌లో వెదజల్లే పద్ధతి ద్వారా 43 వేల ఎకరాల్లో సాగు జరగగా, ఈ ఏడాది దీనిని 62 వేల ఎకరాలకు పెంచారు. శ్రీ వరిసాగు పద్ధతిలో గత ఏడాది 2,435 ఎకరాల్లో చేయగా, ఈ ఏడాది దీనిని 6,250కి పెంచాలని నిర్ణయించారు. డ్రమ్ సీడర్, సీడ్ డ్రిల్ పద్ధతిలో 25 వేల ఎకరాల్లో వరిసాగు చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో వరిలో బీపీటీ 5204, ఎంటీయూ 1061 వంగడాలను 29,797 క్వింటాళ్లు, వేరుశెనగ 100 క్వింటాళ్లు, పెసర 1,000 క్వింటాళ్లు, మినుము 1,500 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై రైతులకు అందజేయాలని నిర్ణయించారు.
1.98 లక్షల పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం...
ఈ ఖరీఫ్‌లో 1.39 లక్షల ఎకరాల్లో పత్తిసాగు జరుగుతుందని అంచనా వేయగా 1.98 లక్షల విత్తన ప్యాకెట్లు అవసరమని నిర్ధారించారు. వీటిలో 1.20 లక్షల ప్యాకెట్లను సిద్ధంగా ఉంచారు. మైకో, నూజివీడు, కావేరీ, తులసీ సీడ్స్‌ను అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఒక్కొక్క ప్యాకెట్టు 450 గ్రాముల బరువు ఉంటుంది. ఒకచోట ఒక విత్తనాన్నే నాటాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు రెండు విత్తనాలను వేస్తారని దీంతో విత్తన ప్యాకెట్ల అవసరం పెరుగుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో అన్ని పంటలకు కలిపి 3,01,379 టన్నుల ఎరువులు అవసరమని నిర్ధారించారు.