పట్టపగలే రియల్టర్ దారుణ హత్య
ఆ సెంటర్ రద్దీగా ఉంది. అక్కడి ఆలయానికి భక్తులు వచ్చిపోతున్నారు. మిట్టమధ్యాహ్నం 12.45 గంటలు కావస్తోంది. వాహనాలతో రోడ్డు కళకళలాడుతోంది. ఇరువైపులా ఉన్న దుకాణాల్లో వినియోగదారులు కిక్కిరిసి ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తి కొబ్బరి బోండాలు నరికే కత్తితో మరో వ్యక్తి వెంటపడుతున్నాడు. ఏం జరుగుతుందో అర్థంకాక అందరి కళ్లూ వారిద్దరిపై పడ్డాయి. క్షణాల్లో కత్తి ఉన్న వ్యక్తి చేతిలో పరిగెడుతున్న వ్యక్తి దారుణ హత్యకు గురై రక్తపు మండుగులో పడి ఉన్నాడు.
ఒంగోలు క్రైం : నగరంలో సోమవారం మిట్టమధ్యాహ్నం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఎప్పుడూ ర ద్దీగా ఉండే లాయర్‌పేటలోని సాయిబాబా గుడి సమీపంలో రైతు బజారుకు ఎదురుగా టంగుటూరు ప్రకాశం పంతులు విగ్రహం పక్కనే జరిగిన ఈ హత్యను అనేక మంది కళ్లారా చూశారు. స్థానిక వీఐపీ రోడ్డులోని లక్ష్మీనరసింహ అపార్టుమెంటులో నివాసం ఉంటున్న యద్దనపూడి భ్రమరాచారి (39)ని ప్రత్యర్థి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కొబ్బరి బోండాలు నరికే కత్తితో వెంటాడి మరీ దాడి చేయగా ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కత్తితో రెండు మూడు వేట్లు బలంగా వేయడం తో తల నుజ్జునుజ్జయింది. రక్తపు మడుగులో అందరూ చూస్తుం డగానే గిలగిలా కొట్టుకుని భ్రమరాచారి ప్రాణాలు విడిచాడు.
వ్యాపార భాగస్వామితో కలతలు
ఒంగోలు గాంధీనగర్‌కు చెందిన మేడిపి విష్ణుమూర్తితో కలిసి భ్రమరాచారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాడు. కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి మనస్పర్థలు వచ్చాయి. దాదాపు రూ.4 లక్షలు విష్ణుమూర్తికి ఇవ్వాల్సి వచ్చింది. డబ్బులివ్వకుంటే అంతు చూస్తానని హెచ్చరించడంతో భ్రమరాచారికి ప్రాణభయం పట్టుకుంది. విష్ణుమూర్తి నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు భ్రమరాచారి ఇది వరకే ఫిర్యాదు చేసి ఉండటం గమనార్హం.
భార్యతోనూ సఖ్యత కరువు
రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్థికంగా దెబ్బతినడంతో కొన్ని నెలలుగా భ్రమరాచారి దంపతుల మధ్య గొడవలు పొడచూపాయి. తరచూ భార్యతో ఘర్షణ పడటంతో భార్య బ్రహ్మేశ్వరి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తల మధ్య కనీసం మాటమంతీ కూడా లేదు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఇదీ.. హతుని నేపథ్యం
హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమా.. అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొనకనమిట్ల మండలం మూగచింతలకు చెందిన భ్రమరాచారి కుటుంబం తొలుత పొదిలిలో స్థిరపడింది. ఈయన 20 ఏళ్ల క్రితమే ఒంగోలు వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగాడు. గతంలో నక్షత్ర రియల్ ఎస్టేట్ సంస్థలో ఏజెంట్‌గా పనిచేసి ఆర్థికంగా స్థిరపడ్డాడు. నక్షత్ర కంపెనీపై పోలీసులు కేసు నమోదు చేసి డెరైక్టర్లను అరెస్టు చేయడంతో పాటు కంపెనీకి సంబంధించిన లావాదేవీలను స్తంభింపజేశారు. దీంతో ప్రైవేటుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నాలుగైదేళ్ల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం కుప్ప కూలిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.
మాటామాటా పెరిగి..
భ్రమరాచారి తన బైకుపై రైతు బజారు ఎదురుగా ఉన్న టీకొట్టు వద్దకు వచ్చాడు. అక్కడ ఓ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా ఇద్దరి మధ్య వాదన పెరిగింది. తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకున్నారు. తోపులాట కూడా జరిగింది. భ్రమరాచారితో ఘర్షణ పడిన వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఆ పక్కనే చెట్టు కింద కొబ్బరి బోండాల దుకాణంలో ఉన్న కత్తి తీసుకుని భ్రమరాచారి వెంట పడ్డాడు. సరిగ్గా ప్రకాశం పంతులు విగ్రహం వద్ద కత్తితో బలంగా తలపై బాదాడు. ఒక్క దెబ్బకు కింద పడిపోయిన భ్రమరాచారి తలపై రెండు మూడు సార్లు కత్తితో దాడి చేశాడు. బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడు. హంతకుడు క్షణాల్లో పరారయ్యాడు.
అందరూ చూస్తుండగానే..
కళ్లెదుటే హత్య జరగడంతో దుకాణాలు మూసి వ్యాపారులు ఇళ్లకు వెళ్లిపోయారు. జనం ఎందుకొచ్చిన గొడవనుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. అందరూ చూస్తుండగానే దారు ణం జరుగుతున్నా ఏ ఒక్కరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఒన్‌టౌన్ సీఐ కె.వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా ఎవరూ సహకరించలేదు.
కొబ్బరి బోండాల దుకాణ యజమాని వెంకట్రావు కూడా భీతిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. వెంకట్రావును సీఐ పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రాంత వీఆర్‌వో రామును సంఘటన స్థలానికి పిలిపించుకుని పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.