నిమ్మగడ్డ రమేష్‌కుమార్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదివారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణాలు ఇలా ఉన్నాయి.
► ఆదివారం ఉదయం 10కి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విలేకరుల సమావేశం ఉంటుందని ఎన్నికల సంఘం కార్యాలయం శనివారం రాత్రి 7 గంటలప్పుడు మీడియాకు సమాచారం ఇచ్చింది. (ఎన్నికల వాయిదా విరమించుకోండి : సీఎస్)
► రాష్ట్ర ఎన్నికల కమిషన్ ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్ ఆదివారం జారీ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కోసమేనని అధికారులు, మీడియా ప్రతినిధులు భావించారు.
► నిమ్మగడ్డ రమేష్‌కుమార్ శనివారం రాత్రంతా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలోనే బస చేశారు. కొన్ని రోజులుగా ఆయన కమిషన్ కార్యాలయంలోని తన ఛాంబర్‌లోనే రాత్రి వేళలో కూడా ఉంటున్నారు.
► షెడ్యూల్ ప్రకారం ఆదివారం విడుదల చేయాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌కు సంబంధించిన కాపీలను ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కార్యాలయంలో పనిచేసే జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి ఒకరు రమేష్‌కుమార్ ఛాంబరుకు తీసుకెళ్లి ఇవ్వబోతే.. తర్వాత పిలుస్తానంటూ ఆ అధికారిని రమేష్‌కుమార్ వెనక్కి పంపారని తెలిసింది.
► చంద్రబాబు ప్రభుత్వ హయాం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న, ఇటీవలి కాలం వరకు ఎన్నికల కమిషన్ ఇన్‌చార్జి కార్యదర్శిగా కొనసాగిన సత్య రమేష్‌ను ఆదివారం ఉదయం 9 గంటలకు రమేష్‌కుమార్ ప్రత్యేకంగా తన ఛాంబర్‌కు పిలిపించుకున్నారని.. ఆయన హడావుడిగా కమిషనర్ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం.
► కొద్దిసేపు వీరిద్దరి మధ్య ఆంతరంగిక చర్చలు కొనసాగిన తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేత నోట్‌ను సత్యరమేష్ ఛాంబర్‌లో రహస్యంగా తయారు చేయించినట్లు తెలిసింది.
► కమిషనర్ రమేష్‌కుమార్, జాయింట్ కమిషనర్ సత్యరమేష్ మధ్య ఉదయం 9.30 గంటల ప్రాంతంలో చర్చలు జరుగుతున్న సమయంలో కార్యాలయంలో పనిచేసే ఇతర అధికారులు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ గురించి మరోసారి రమేష్‌కుమార్ వద్ద ప్రస్తావించగా.. తాను చెప్పే వరకూ విలేకరుల సమావేశంలో ఈ నోటిఫికేషన్ వివరాలను ఇవ్వవద్దని ఆయన వారికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
► ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఐఏఎస్ అధికారి కమిషన్ కార్యదర్శి హోదాలో పనిచేస్తుంటారు. ఇన్‌చార్జి కమిషన్ కార్యదర్శి సత్యరమేష్ స్థానంలో నెలన్నర క్రితం రామసుందర్‌రెడ్డి అనే ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు. ఎన్నికల నిలిపివేత నిర్ణయాన్ని విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించే వరకు కమిషన్ కార్యదర్శి రామసుందర్‌రెడ్డికి కనీసం సమాచారం కూడా తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కార్యాలయంలో చర్చ జరుగుతోంది.
► ఎన్నికల ప్రక్రియ నిలిపివేత.. ఇద్దరు ఐఏఎస్‌లు, ఇద్దరు ఐపీఎస్ అధికారులతో పాటు మరికొందరు పోలీసు సిబ్బంది తొలగింపునకు సంబంధించి ఏం మాట్లాడాలన్నది రమేష్‌కుమార్ ఒక నోట్‌బుక్‌లో రాసుకున్నారు. దానినే విలేకరుల సమావేశంలో చదివి వినిపించారు. (చదవండి: 'విచక్షణ' కోల్పోతోందా?)
ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిందిదీ..
► కరోనా ప్రభావంపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పరిస్థితిని అంచనా వేయాలి.
► శాంతిభద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై వాస్తవ పరిస్థితిపై ఒక అంచనాకు రావాలి.
►ఎన్నికల నిర్వహణ తీరు.. నిబంధనల ఉల్లంఘన.. హింసాత్మక సంఘటనలు చోటుచేసుకుంటే జిల్లాల ఎన్నికల
► పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులతో ప్రత్యేక నివేదికలు తెప్పించుకోవాలి.
► వీటి ఆధారంగా పరిస్థితి అదుపు తప్పిందని భావిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపి.. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలా? వాయిదా వేయాలా? అన్న అంశంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి.
ఇది నిపుణుల మాట.. కానీ ఇవేవీ జరిగిన దాఖలాలు లేవని వైఎస్సార్‌సీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment