నొక్కేసింది.. కక్కించాల్సిందే | Recommendations of the Expert Committee to State Government On irregularities in projects | Sakshi
Sakshi News home page

నొక్కేసింది.. కక్కించాల్సిందే

Published Sun, Nov 3 2019 4:15 AM | Last Updated on Sun, Nov 3 2019 4:16 AM

Recommendations of the Expert Committee to State Government On irregularities in projects - Sakshi

సాక్షి, అమరావతి: భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఎత్తిపోతల, వంశధార ప్రాజెక్టు రెండో దశ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల కాలువల్లో నీటి ప్రవాహం మాటేమోగానీ అక్రమాలు పోటెత్తాయని నిపుణుల కమిటీ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. మిగిలిన పనుల వ్యయాన్ని భారీగా పెంచేసి.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులప్పగించి, ప్రజాధనం దోచుకున్నారని స్పష్టం చేసింది. అంచనా వ్యయం పెరగడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పెరిగిందని.. పనులు మాత్రం పూర్తి కాలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో విచారణ జరిపించి.. కాంట్రాక్టర్లు దోచేసిన సొమ్మును వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా తన నివేదికను సమర్పించింది. 

భూసేకరణ లేకుండానే పనులా?
అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా తొలి దశలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టులోకి(బీటీపీ) నీటిని ఎత్తిపోసి, ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే పనులకు అక్టోబర్‌ 24, 2018న రూ.968.99 కోట్లతో అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. హంద్రీ–నీవాలో నీటి లభ్యతపై అధ్యయనం చేయకుండానే.. 3.7 టీఎంసీల సామర్థ్యంతో బీటీపీ ఎత్తిపోతలకు అనుమతిచ్చారని నిపుణుల కమిటీ పేర్కొంది.  కాలువ పనులను రూ.358.20 కోట్లకు బీఎస్సార్‌ ఇన్‌ఫ్రాకు.. 14 పంప్‌హౌస్‌ల మెకానికల్‌ పనులను రూ.175 కోట్లకు మరో కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టారు. తక్కువ సామర్థ్యం కలిగిన పంప్‌లు వాడేందుకు స్కెచ్‌ వేశారు. కాలువల తవ్వకానికి 1,407 ఎకరాలు అవసరం కాగా, ఒక్క ఎకరా కూడా సేకరించకుండానే రూ.33.02 కోట్ల విలువైన(8.94 శాతం) పనులు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. నీటి లభ్యతను పున:సమీక్షించి, ఈ పథకం పనులు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. 

వంశధారకు అవినీతి మకిలి 
వంశధార ప్రాజెక్టు రెండో దశ అంచనా వ్యయాన్ని రూ.933 కోట్ల నుంచి రూ.1,616.23 కోట్లకు పెంచేస్తూ ఫిబ్రవరి 26, 2016న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  
- 87వ ప్యాకేజీ పనులను 2005లో ‘హార్విన్‌’కు రూ.72.64 కోట్లకు అప్పగించారు. రూ.11.48 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్‌ వేటు వేసి, కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. మిగిలిన రూ.61.16 కోట్ల పనుల వ్యయాన్ని రూ.181.58 కోట్లకు పెంచేసి.. 18 నెలల్లో పూర్తి చేసేలా అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టŠస్‌ సంస్థకు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అంచనా వ్యయాన్ని ఒకేసారి 300 శాతం పెంచినా సీఎం రమేష్‌ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయిందని వివరించింది. పనులు పూర్తి చేయని రిత్విక్‌ సంస్థకు అదనంగా రూ.11.35 కోట్ల విలువైన పని అప్పగించడాన్ని తప్పుబట్టింది. ఇప్పటివరకూ ఆ సంస్థ రూ.98 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారని.. చేసిన పనులను సక్రమంగా లెక్కించకుండానే బిల్లులు చెల్లించారని తెలిపింది. 
- 88వ ప్యాకేజీ పనులను 2005లో రూ.66.68 కోట్లకు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌ దక్కించుకుంది. 2016 నాటికి రూ.20.76 కోట్ల విలువైన పనులు చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్‌ వేటు వేసింది. మిగిలిన రూ.45.92 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.1,79.51 కోట్లకు పెంచేసి సాయిలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ అప్పగించింది. ఈ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలి. కానీ, ఇప్పటికి రూ.69.34 కోట్ల విలువైన పనులను మాత్రమే చేసింది. 38.63 శాతం పనులు చేయని ఆ సంస్థకే అదనంగా రూ.18.91 కోట్ల పనులను అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. 
- చేయని పనులకు 87వ ప్యాకేజీలో రూ.14.68 కోట్లు.. 88వ ప్యాకేజీలో రూ.3.18 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మును తక్షణమే రికవరీ చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల ఆయకట్టుకు నీళ్లందకపోవంతోపాటు ఖజానాపై భారీ ఎత్తున భారం పడిందని తేల్చింది. పనులు చేయని కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్‌కు సిఫార్సు చేసింది.

గాలేరు–నగరిలో..
గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశ పనులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ, అంచనా వ్యయాన్ని రూ.2,155.45 కోట్ల నుంచి రూ.2,800.82 కోట్లకు పెంచుతూ 2015లో సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అయిన వారికి అప్పగించి భారీ ఎత్తున దోచేశారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. 
- గాలేరు–నగరిలో 29వ ప్యాకేజీ పనులను రూ.171.63 కోట్లకు 2005లో దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 2014 నాటికే రూ.166.69 కోట్ల పనులు పూర్తి చేసింది. కేవలం రూ.4.94 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఈ పనుల వ్యయాన్ని రూ.110.91 కోట్లకు పెంచేసి సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌కు అప్పగించి.. బిల్లులు చెల్లించేశారని.. ఈ అక్రమాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంతో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కాంట్రాక్టర్‌ దోచేసిన సొమ్మును రికవరీ చేయాలని సర్కార్‌కు నిపుణుల కమిటీ సూచించింది. 
- గాలేరు–నగరి 30వ ప్యాకజీ పనుల్లో భాగమైన అవుకు సొరంగం పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల సొరంగం బదులుగా లూప్‌ వేయాల్సి వచ్చింది.. ఈ పనులకు రూ.50.69 కోట్లు చెల్లించారని.. ధరల సర్దుబాటు కింద రూ.14.07 కోట్లను అదనంగా దోచిపెట్టారని పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement