గాలేరు–నగరిలో రివర్స్‌ టెండరింగ్‌ | Reverse tendering in Galeru Nagari Sujala Sravanthi Project | Sakshi
Sakshi News home page

గాలేరు–నగరిలో రివర్స్‌ టెండరింగ్‌

Published Thu, Aug 29 2019 4:22 AM | Last Updated on Thu, Aug 29 2019 8:19 AM

Reverse tendering in Galeru Nagari Sujala Sravanthi Project - Sakshi

సాక్షి, అమరావతి: గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం రెండో దశ పనుల ప్రక్షాళన, అవినీతి నిర్మూలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌కు సిద్ధమైంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడటానికి వారం రోజుల ముందు పెంచిన అంచనా వ్యయంతో రెండు ప్యాకేజీల పనులను సీఎం రమేష్‌ సంస్థకు అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకునేలా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు జలవనరుల శాఖపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్యాకేజీల పనులను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీటికి రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని ఆదేశించింది. దీనివల్ల భారీ ఎత్తున ప్రజాధనం ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

బెదిరించి ప్రీ క్లోజర్‌!
గాలేరు–నగరి సుజల స్రవంతి రెండో దశలో మొదటి ప్యాకేజీ(ప్రధాన కాలువ 32.64 కి.మీ. నుంచి 66.150 కి.మీ. వరకు తవ్వకం, పది వేల ఎకరాలకు నీళ్లందించి మిగతా డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు) పనుల్లో 2014 నాటికి రూ.69.89 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. రెండో ప్యాకేజీ (ప్రధాన కాలువ 66.15 కి.మీ. నుంచి 96.50 కి.మీ. వరకు తవ్వకం, 12 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించేలా డిస్ట్రిబ్యూటరీల ఏర్పాటు)లో రూ.110 కోట్ల విలువైన పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను బెదిరించి ఒప్పందం రద్దు (ప్రీ–క్లోజర్‌) కోసం గత సర్కారు దరఖాస్తు చేయించింది. దీనిపై జలవనరులశాఖతో ఆమోదముద్ర వేయించిన చంద్రబాబు 2018–19 ఎస్‌ఎస్‌ఆర్‌ (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ఆధారంగా మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేయించారు.

టెండర్లలో గోల్‌మాల్‌..
ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు నెలల ముందు గాలేరు–నగరి రెండో దశ మొదటి ప్యాకేజీ పనులకు రూ.391.31 కోట్ల అంచనా వ్యయంతో ఫిబ్రవరి 11న ఎల్‌ఎస్‌(లంప్సమ్‌)–ఓపెన్‌ పద్ధతిలో గత ప్రభుత్వం టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఫ్రిబవరి 25న టెక్నికల్‌ బిడ్‌ తెరిచారు. రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌, ఎన్‌సీసీ, ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ షెడ్యూళ్లను దాఖలు చేశాయి. ఇందులో ఎమ్మార్కేఆర్, ఆర్వీఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు అర్హతలున్నా షెడ్యూళ్లపై అనర్హత వేటు వేశారు. కోటరీలోని ఎన్‌సీసీ.. రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ కంటే ఎక్కువ ధరకు షెడ్యూలు దాఖలు చేసేలా చక్రం తిప్పారు. దీనికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉండగానే అప్పటి సీఎం చంద్రబాబు ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులు గత ఫిబ్రవరి 26న ఫైనాన్స్‌ బిడ్‌ ఓపెన్‌ చేశారు.

సీఎం రమేష్‌ సంస్థ 3.99 శాతం ఎక్సెస్‌ (406.73 కోట్లు), ఎన్‌సీసీ 4.65 శాతం ఎక్సెస్‌ (రూ.409.50 కోట్లు)కు కోట్‌ చేస్తూ షెడ్యూలు దాఖలు చేసినట్లు వెల్లడైంది. వీటిని ఫిబ్రవరి 28న సీవోటీ పరిశీలనకు పంపగా ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా అదే రోజు టెండర్‌ను ఆమోదించింది. సాధారణ పరిస్థితుల్లో టెండర్‌ నిర్వహించి ఉంటే కనీసం పది శాతం తక్కువకే పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేశారు. అప్పుడు ఖజానాకు రూ.54.74 కోట్ల మేర మిగిలేది. ఇదే పద్ధతిలో రెండో ప్యాకేజీ పనులకు రూ.343.52 కోట్ల అంచనా వ్యయంతో ఎల్‌ఎస్‌–ఓపెన్‌ విధానంలో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయించి 4.76 శాతం అధిక ధరలకు సీఎం రమేష్‌ సంస్థకే కట్టబెట్టారు. దీనివల్ల ఖజానాపై రూ.50.70 కోట్ల భారం పడింది.

రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజాధనం ఆదా
గాలేరు–నగరి సుజల స్రవంతి రెండో దశ పనులను ఇటీవల సమీక్షించిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌.. ఎన్నికల ముందు టెండర్ల ద్వారా అప్పగించిన మొదటి, రెండు ప్యాకేజీల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేయాలని ఆదేశించారు. ఆ రెండు ప్యాకేజీలకు గతంలో నిర్ణయించిన అంచనా విలువనే కాంట్రాక్టు విలువగా నిర్ణయించి అధిక సంఖ్యలో కాంట్రాక్టర్లు పోటీ పడేలా నిబంధనలు సడలించి రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబరు మొదటి వారంలో గాలేరు–నగరి రెండు ప్యాకేజీలకు రివర్స్‌ టెండరింగ్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement