టీటీడీకే పంగనామాలు !
దోడ్డి దారిలో ఉద్యోగాలకు సిఫార్సులు
చక్రం తిప్పుతున్న ఇంటి దొంగలు
ఎఫ్‌ఎం రేడియోలో ఇదీ సంగతి
తిరుపతి సిటీ: శ్రీవారి ప్రాముఖ్యతను దశ దిశలా వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఎస్వీబీసీ, వెంకటేశ్వర ఎఫ్‌ఎం కమ్యూనిటీ రేడియోను నిర్వహిస్తోంది. స్థానికంగా ఐదు కిలోమీటర్ల పరిధిలో శ్రోతలను భక్తిమార్గం వైపు తీసుకెళ్లేందుకు 2007లో రేడియోను తీసుకొచ్చారు. అప్పటి నుంచీ వివాదాలను మూటగట్టుకుంటోంది. పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో అక్కడ ఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్న వారిదే ఇష్టారాజ్యంగా మారిపోయింది. భక్తి కార్యక్రమాలు పలికించేందుకు అప్పట్లో నందిని, కీర్తి, సుగుణ, కుమారి, శివయ్యలను నియమించారు. వాళ్లు ఎవరో కూడా ఇక్కడి అధికారులకు తెలియదు. వారి పేరుపై భక్తి కార్యక్రమాలకు బినామీలు వాయిస్ అందిస్తున్నారు. అసలు వీళ్లను ఎవరు నియమించారో కూడా తెలియని పరిస్థితి. అక్కడ పెత్తనం అంతా వారిదే. అడిగితే వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు. రికార్డుల్లో ఉన్నవారి పారితోషకం మాత్రం వీరు తీసుకుంటున్నారు. ఇప్పుడేమో తాజా ప్రతిపాదనలకు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
బినామీ పేర్లతో ఉద్యోగులుగా వ్యవహరిస్తున్న ముగ్గురిని రెగ్యులర్ ఉద్యోగులుగా తీసుకొచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఈ ఏడాది వార్షిక బడ్జెట్‌లో కొత్తగా ఇద్దరు ప్రోగ్రామ్ ప్రొడక్షన్ అసిస్టెంట్లను తీసుకోవాలని టీటీడీ ఈవో, జేఈవోలకు ప్రతిపాదనలు పంపారు. ప్రతి ఒక్కరికీ నెలకు రూ.15 వేలు పారితోషకం చెల్లించే విధంగా ఫైల్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ప్రోగ్రామ్ ప్రొడక్షన్ స్టాఫ్‌గా పనిచేస్తున్న సీనియర్లను పక్కకు నెట్టి దొడ్డిదారిలో నియామకాలకు తెరతీశారు. టీటీడీ యాజమాన్యం వెంకటేశ్వర ఎఫ్‌ఎం రేడియో కమ్యూనిటీలో ఏమి జరుగుతుందో పట్టించుకోవాలని సిబ్బంది వేడుకుంటున్నారు.
టీటీడీ విజిలెన్స్ ఆరా ..
వారం రోజుల కిందట ఇక్కడ జరుగుతున్న తతంగంపై టీటీడీ విజిలెన్సు విభాగం ఆరా తీసింది. రికార్డులను పరిశీలించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ అన్ని తామై నడిపిస్తున్న అధికారులు ఈ గడ్డు పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియక ఉన్నతాధికారుల వద్ద పంచాయితీ చేస్తున్నట్లు సమాచారం.
సూచనల మేరకే పనిచేస్తున్నాం..
దీనిపై ఇన్‌చార్జి, ఓరియంటల్ కళాశాల ప్రిన్సిపాల్ సురేంద్రనాయక్‌ను వివరణ కోరగా ఉద్యోగులు ఫిర్యాదు చేస్తున్నట్లు బినామీ పేర్లపై ఎవరూ పనిచేయడం లేదని తెలిపారు. రికార్డుల ప్రకారం వార్షిక బడ్జెట్ తయారుచేస్తున్నామని చెప్పారు. నూతన నియామకాల విషయంలో ఈవో, జేఈవో సూచనలను పాటిస్తున్నామని తెలిపారు.