
జిల్లాలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఎక్సైజ్ ఆదాయాన్ని పరిశీలిస్తే విక్రయాల్లో 30 శాతం వృద్ధి కనిపిస్తోంది. 8 నెలల కాలంలో మందు బాబులు ఏకంగా రూ.1076.34 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. కిందటేడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది రూ.300 కోట్లపైనే అమ్మకాలు సాగాయి. నవంబర్ ఒక్క నెలలోనే రికార్డు స్థాయిలో రూ.130 కోట్ల మద్యం అమ్ముడయ్యింది. దీన్నిబట్టి జిల్లాలో మద్యపాన ప్రియులు గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ శాఖ గణాం కాలు తెలియజేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలోని 17 ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలో 417 ఐఎంఎల్ షాపులు, 37 బార్లు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు లెక్కలు తీస్తే 24,11,914 ఐఎంఎల్ బాక్సులు, 17,23,008 బీరు బాక్సులు అమ్ముడుపోయాయి. చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో 12,31,610, తిరుపతి పరిధిలో 11,80,304 ఐఎంఎల్ బాక్సులు అమ్ముడుపోయాయి. చిత్తూరు ఎక్సైజ్ పరిధిలో 9,04,616 బీరు బాటిళ్ల బాక్సులు, తిరుపతి పరిధిలో 8,18,394 బాక్సుల అమ్మకాలు జరిగాయి. వీటన్నింటి విలువ రూ.1076.34 కోట్లు. 2016 ఏప్రిల్ నుంచి మార్చి వరకు మొత్తం అమ్మకాలు రూ.873.40 కోట్లు. ఈ ఏడాది నెలకు సగటు అమ్మకాలు రూ.100 కోట్లు వేసుకున్నా వ చ్చే మార్చి నాటికి మరో రూ.400 కోట్ల అమ్మకాలు ఉం టాయి. ఈలెక్కన ఏడాది అమ్మకాలు సుమారు రూ.1,500 కోట్లకు చేరొచ్చు. దీంతో పోలిస్తే పెరిగిన మ ద్యం అమ్మకాలు గత ఏడాది కంటే సుమారు 50 శాతం ఎక్కువ.
అమ్మకాలు పెరగడానికి కారణాలివే..
తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోజూ జిల్లాకు లక్ష మందికిపైగా రాకపోకలు సాగిస్తుంటారు. క్వారీలు, కా ల్వ పనులు, పండ్ల మార్కెట్, టమాట మార్కెట్, వెండి, బంగారం వంటి వ్యాపార సంబంధాలతో ఎక్కువ మంది జిల్లాకు వస్తుంటారు. దీనికితోడు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి నిత్యం పర్యాటక, దర్శనీయ క్షేత్రాలకు వచ్చే వారు కూడా ఎక్కువే. దీనివల్ల ఇతర జిల్లాల కం టే మన జిల్లాలో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయని అధికారులు విశ్లేషిస్తున్నారు.
న్యూ ఇయర్‌కి నిల్వలు
న్యూ ఇయర్ వేడుకల కోసం ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున మద్యం నిల్వలు అందుబాటులో ఉంచుతున్నారు. డిసెంబర్ 29 నుంచి జనవరి ఒకటో తేదీ మధ్యన సుమారు రూ.50 కోట్ల అమ్మకాలు ఉండొచ్చని అంచనా. ఇందుకోసం అవసరమైన ఐఎంఎల్, బీరు నిల్వలను గోదాముల్లో ఉంచుతున్నారు. ఇప్పటికే డెప్యూటీ కమిషనర్ డాక్టర్ రాధయ్య రెండు దఫాలుగా తిరుపతి చేరుకుని ఈఎస్ ఆఫీస్‌లో సమీక్ష నిర్వహించారు.