నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్ : కేంద్ర కేబినెట్ గురువారం రాత్రి 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోద ముద్ర వేయడంతో జిల్లా పోలీసుశాఖ అప్రమత్తమైంది. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సున్నితమైన ప్రాంతాలతో పాటు ముఖ్య పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. కాంగ్రెస్ కార్యాలయంతో పాటు ఇందిర, నెహ్రు, రాజీవ్ విగ్రహాల వద్ద భద్రతను పెంచారు. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు ఎం. వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి పనబాక నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర బలగాలు ఆ ప్రాంతానంతా ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం పచ్చా జెండా ఊపడంతో సమైక్యాంధ్ర ఉద్యమకారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
అవసరమైతే మెరుపు సమ్మెకు దిగుతామని ఏపీ ఎన్‌జీఓ సంఘ నాయకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు జిల్లా పోలీసు యంత్రాగం సమయాత్తమైంది. జిల్లాలో ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ 84 మంది, సీఐఎస్‌ఎఫ్ 74 మంది, ఏపీఎస్‌పి 64 మందితో పాటు 84 మంది స్పెషల్ పార్టీ సిబ్బంది బందోబస్తు విధులను నిర్వర్తిస్తున్నారు. జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. సమైక్య ఆందోళనతో పాటు డిసెంబర్ ఆరు బ్లాక్‌డేను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. గురువారం రాత్రి నగర డీఎస్పీ పి. వెంకటనాథ్‌రెడ్డి నగరంలో విసృ్తతంగా పర్యటించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
అధికారులతో ఎస్పీ సమీక్ష
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలో సభలు సమావేశాలును నిషేధించాలని, 30 పోలీసు యాక్ట్ అమలు చేయాలని ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దని పోలీసు అధికారులకు సూచించారు. గురువారం జిల్లాకు వచ్చిన మెరైన్ ఐజీ కె.శ్రీనివాసులరెడ్డి ప్రస్తుత పరిస్థితులపై సిబ్బందితో సమావేశమైయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సూచించినట్లు సమాచారం.
రెడ్ అలర్ట్
Published Fri, Dec 6 2013 2:50 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement