ఎల్.ఎన్.పేట: రాష్ట్రంలో సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు కమీషన్లు ఇచ్చిన కాంట్రాక్టర్లకే నిధులు మంజూరు చేయించడం, రైతుల భూమలు బలవంతంగా లాక్కోవడం, ఆర్థిక నేరాలు(స్కాం), మహిళలపై దాడులు, అత్యాచారాలు వంటి ఘటనల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. స్థానిక మండల కేంద్రంలో ఆదివారం ఆమె మాట్లాడుతూ పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల్లో సగం నిధులు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆరోపించారు. ఆ సొమ్ముతోనే ప్రతిపక్ష పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్లు దుయ్యబట్టారు. కమీషన్లు ఇచ్చిన పనులకే నిధులు మంజూరు చేస్తున్నారని, ఇందుకు నిదర్శనమే వంశధార రిజర్వాయర్ నిర్మాణమని తెలిపారు. అందుకే నిర్వాసితులకు అన్యాయం చేస్తున్నా స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే వెంకటరమణ పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు. అవసరం లేకపోయినా రాజధాని నిర్మాణం పేరుతో వేలాది ఎకరాలు బలవంతంగా సేకరించారని మండిపడ్డారు.
అడ్డుకున్న వారినే తప్పుబట్టారు
అమరావతి ప్రాంతంలో మంత్రి లోకేష్ తోపాటు పలువురు మంత్రులు, కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభ సభ్యుడు వందలాది ఎకరాలను బినామీల పేర్లతో దక్కించుకుని వేలాది కోట్లు వెనకేసుకున్నారని రెడ్డి శాంతి నిప్పులు చెరిగారు. అగ్రిగోల్డ్ సంస్థ భూములు కూడా అక్రమించుకున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాలు ఎప్పుడూ లేనంతగా ఏపీలో పెరిగి పోయాయని, అనేక సర్వేలు స్పష్టమైందన్నారు. ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకున్న తహసీల్దారు వనజాక్షినే తప్పుపట్టిన ఘనచరిత్ర ఆధికార పార్టీకి చెందుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కన్వీనర్ కిలారి త్రినా«థరావు, నాయకులు పెనుమజ్జి విష్ణుమూర్తి, లోచర్ల మల్లేశ్వరరావు, మహంతి రవికుమార్, కొల్ల కృష్ణ, పైల తవిటినాయడు, సవర లకాయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment