ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి
షేల్ గ్యాస్ వెలికితీత నిర్ణయంపై ప్రజా సంఘాల వ్యతిరేకత
భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో భూమి అట్టడుగు పొరల నుంచి సహజవాయువు (షేల్ గ్యాస్) వెలికితీయాలన్న ఓఎన్‌జీసీ నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారుు. షేల్‌గ్యాస్ వెలికితీత వల్ల పర్యావరణానికి, పంటలకు నష్టం వాటిల్లుతుందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారుు. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో భూమి అట్టడుగు పొరల (సుమారు 4 కిలోమీటర్ల దిగువ) నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు సిద్ధమైన ఓఎన్‌జీసీ.. భీమవరం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు మునిసిపల్ ఆడిటోరియంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
జిల్లా అదనపు జారుుంట్ కలెక్టర్ ఎండీఘూ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం అరుపులు, కేకల మధ్య గందరగోళంగా మధ్యసాగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు పర్యావరణ వేత్తలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. గ్యాస్ వెలికితీసే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఆ గ్రామాలకు 18 కిలోమీటర్ల దూరంలోని భీమవరంలో నిర్వహించడంపై నిలదీశారు. ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న దృష్ట్యా అమెరికా వంటి ఆగ్రదేశాలు షేల్ గ్యాస్ వెలికితీతను విరమించుకోగా.. అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని ఓఎన్‌జీసీ సంస్థ మాత్రం బంగారం లాంటి పంటలు పండే పచ్చటి పొలాల మధ్య దీన్ని వెలికి తీయాలనుకోవడం తగదన్నారు.
డ్రిల్లింగ్ జరిగే గ్రామాల్లో ప్రజల మధ్య అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఓఎన్‌జీసీ కేజీ బేసిన్ మేనేజర్ ఎం.చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ వీఎస్‌ఎస్ కామరాజు, సీపీఎం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, బీవీ వర్మ, సీపీఐ నాయకులు డేగా ప్రభాకర్, ఎం.సీతారామ్‌ప్రసాద్, రైతు సంఘం నాయకుడు యెర్నేని నాగేంద్రనాథ్, గోదావరి పర్యావరణ పరిరక్షణ సమితి నాయకుడు మట్లపూడి సత్యనారాయణ పాల్గొన్నారు.