shale gas
-
ఆ వ్యాపారానికి స్వస్తి పలికిన రిలయన్స్...!
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) యూఎస్‌లోని చిట్టచివరి షేల్ గ్యాస్ ఆస్తులను సైతం విక్రయిస్తోంది. ఇందుకు వీలుగా డెలావేర్ కంపెనీ ఎన్సైన్ ఆపరేటింగ్–3 ఎల్ఎల్సీతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే డీల్ విలువను వెల్లడించలేదు. అనుబంధ సంస్థ రిలయన్స్ ఈగిల్ఫోర్డ్ అప్‌స్ట్రీమ్ హోల్డిం గ్‌కు చెందిన షేల్ గ్యాస్ ఆస్తులను విక్రయించేందుకు డెలావేర్ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసినట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. దీంతో యూఎస్‌లోని మొత్తం షేల్ గ్యాస్ ఆస్తుల నుంచి తప్పుకున్నట్లేనని ఆర్ఐఎల్ పేర్కొంది. తద్వారా ఉత్తర అమెరికా షేల్ గ్యాస్ బిజినెస్ నుంచి పూర్తిగా వైదొలగుతున్నట్లు తెలియజేసింది. 2010– 2013 మధ్య కాలంలో మూడు భాగస్వామ్య సంస్థలలో ఆర్ఐఎల్ వాటాలు కొనుగోలు చేసింది. -
డెల్టా గుండెలపై ’షేల్’ కుంపటి
ప్రకంపనలు సృష్టిస్తున్న చమురు, గ్యాస్ వెలికితీత నిర్ణయం రాతి పొరల నుంచి తీయడం వల్ల పంటలు, పర్యావరణం దెబ్బతింటాయని ఆందోళన హైడ్రో ప్రాక్చరింగ్ విధానం వల్ల ముప్పు తప్పదంటున్న నిపుణులు ఓఎన్జీసీ నిర్ణయానికి వ్యతిరేకంగా నేడు భీమవరంలో భారీ సభ భీమవరం : డెల్టా ప్రాంతంలోని పచ్చటి పొలాలు, గ్రామాల మధ్య రాతి పొరల అడుగున నిక్షిప్తమై ఉన్న చమురు, సహజ వాయు నిక్షేపాలను (షేల్ గ్యాస్) వెలికి తీయాలనే ఓఎన్జీసీ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రాతి పొరల మధ్య నుంచి హైడ్రో ఫ్రాక్చరింగ్ విధానంలో ఈ నిక్షేపాలను వెలికి తీయడం వల్ల పంటలతోపాటు పర్యావరణం దెబ్బతింటోందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు ప్రజా సంఘాలు ఉద్యమబాట పట్టాయి. నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఉ«భయ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4,320 చదరపు మైళ్ల విస్తీర్ణంలో షేల్ రాతి పొర విస్తరించి ఉందనేది నిపుణుల అంచనా. ఆ పొర దిగువ నుంచి గ్యాస్, చమురు నిక్షేపాలను వెలికి తీయడానికి హైడ్రో ఫ్రాక్చరింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారు. జిల్లాలోని వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలంలోని కోలనపల్లి గ్రామాల్లో 4 వేల మీటర్ల దిగువన రాతి పొరను తవ్వి నిక్షేపాలను వెలికితీయాలనేది ఓఎన్జీసీ ప్రణాళిక. రాతి పొరల దిగువకు గొట్టాలను అమర్చి నీరు, ఇసుక వంటి 700 రకాల రసాయనాలను విపరీతమైన పీడనంతో పంపిస్తారు. ఈ చర్యల వల్ల పర్యావరణానికి పెను ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల అతి ప్రమాదకరమైన మీథేన్ వాయువు లీకైతే గ్రామాలు మొత్తం ఖాళీ చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. అమెరికాతోపాటు జర్మనీ, స్కాట్లాండ్, ఫ్రాన్స్, బల్గేరియా, రుమేనియా వంటి దేశాలు షేల్ గ్యాస్ నిక్షేపాల వెలికితీతను నిషేధించాయి. ఎటువంటి నియంత్రణా విధానాలు లేని మన దేశంలో షేల్ గ్యాస్ తవ్వకం ప్రమాదాలకు దారితీస్తుందనేది నిపుణుల వాదన. ఇప్పటికే పరిశ్రమల కారణంగా డెల్టా ప్రాంతం కాలుష్యం బారినపడి ప్రమాదకర స్థితికి చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో షేల్ గ్యాస్ వెలికితీత కార్యకలాపాలు చేపడితే ఈ ప్రాంతంలోని పంటలు, పర్యావరణం పూర్తిగా దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 8 నెలల క్రితమే రంగం సిద్ధం షేల్ గ్యాస్ వెలికితీసేందుకు నిర్ణయించిన ఓఎన్జీసీ ఇక్కడి ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదనేది ప్రజా సంఘాల వాదన. వెలికితీత చేపట్టే గ్రామాల్లోని ప్రజలకు కనీసం సమాచారం ఇవ్వలేదు. ఇదిలావుంటే.. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో షేల్ గ్యాస్ వెలికితీసేందుకు ఓఎన్జీసీ అధికారులు 8 నెలల క్రితమే రంగం సిద్ధం చేశారు. అండలూరులో బోరుబావి తవ్వడానికి అనుకూలంగా కాంక్రీటుతో దిమ్మెలు నిర్మించి ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఈ ప్రాజెక్ట్ విషయమై గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. నేడు మూడు జిల్లాల సదస్సు ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో చేపట్టే షేల్ గ్యాస్ వెలికితీత కార్యకలాపాలపై ఆదివారం భీమవరంలో మూడు జిల్లాల స్థాయిలో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. డిసెంబర్లో భీమవరంలో విస్తృతమైన పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా షేల్ గ్యాస్ వెలికితీతను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుని తీరతామని పలు ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హెచ్చరించారు. అనంతరం ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో సీపీఐ ఆధ్వర్యంలో షేల్‌గ్యాస్ తవ్వకాలకు వ్యతిరేకంగా భీమవరం సదస్సు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తుందుర్రులో గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ భీమవరం, నరసాపురం నియోజకవర్గాల ప్రజలు ఉద్యమ బాట పట్టారు. డెల్టా గుండెలపై ’షేల్’ కుంపటి రగిల్చేందుకు సాగుతున్న ఏర్పాట్లపై ఆక్వా పార్క్ వ్యతిరేక ఉద్యమం తరహాలో మరో పోరాటం చేపట్టేందుకు ప్రజా సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. -
షేల్ గ్యాస్ వెలికితీతను అడ్డుకోండి
సీపీఎం జిల్లా కార్యదర్శిబలరాం ఏలూరు(సెంట్రల్): అభివృద్ధి పేరిట మరో విధ్వంసానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయని, ఈ విషయంలో ఉభయగోదావరి జిల్లాల ప్రజలు, రైతాంగం అప్రమత్తంగా ఉంటూ ఐక్యంగా షేల్ గ్యాస్ వెలికితీత కార్యక్రమాన్ని అడ్డుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. పచ్చని పొలాలతో కళకళలాడే ఉభయగోదావరి జిల్లాను కాలుష్యకాసారంగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయన్నారు. కృష్ణగోదావరి బేసిన్లో షేల్ గ్యాస్ వెలికితీతకు తొలుత ఒఎన్‌జిసీ పేరుతో ఆ తర్వాత కార్పొరేట్ సంస్థలకు అప్పగించి బావులు తవ్వేందుకు ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారని, చట్టాలను ఉల్లంఘించి బాధిత గ్రామాలను వదిలి భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం ఏమిటని బలరాం ప్రశ్నించారు. అనేక అనర్థాలకు, ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే షేల్ గ్యాస్ వెలికితీత కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బాధిత గ్రామాల ప్రజలకు అండగా ఉండి అన్ని రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు, ప్రజల సహయంతో పెద్ద ఎత్తున ఉద్యమానికి పూనుకుంటామని ఆయణ హెచ్చరించారు. -
ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి
షేల్ గ్యాస్ వెలికితీత నిర్ణయంపై ప్రజా సంఘాల వ్యతిరేకత భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలోని డెల్టా ప్రాంతంలో భూమి అట్టడుగు పొరల నుంచి సహజవాయువు (షేల్ గ్యాస్) వెలికితీయాలన్న ఓఎన్జీసీ నిర్ణయంపై వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేశారుు. షేల్‌గ్యాస్ వెలికితీత వల్ల పర్యావరణానికి, పంటలకు నష్టం వాటిల్లుతుందని, తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారుు. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో భూమి అట్టడుగు పొరల (సుమారు 4 కిలోమీటర్ల దిగువ) నుంచి గ్యాస్‌ను వెలికితీసేందుకు సిద్ధమైన ఓఎన్జీసీ.. భీమవరం పట్టణంలోని అల్లూరి సీతారామరాజు మునిసిపల్ ఆడిటోరియంలో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. జిల్లా అదనపు జారుుంట్ కలెక్టర్ ఎండీఘూ షరీఫ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమం అరుపులు, కేకల మధ్య గందరగోళంగా మధ్యసాగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణకు పర్యావరణ వేత్తలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. గ్యాస్ వెలికితీసే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఆ గ్రామాలకు 18 కిలోమీటర్ల దూరంలోని భీమవరంలో నిర్వహించడంపై నిలదీశారు. ప్రజాభిప్రాయ సేకరణను రద్దుచేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతున్న దృష్ట్యా అమెరికా వంటి ఆగ్రదేశాలు షేల్ గ్యాస్ వెలికితీతను విరమించుకోగా.. అంతగా సాంకేతిక పరిజ్ఞానం లేని ఓఎన్జీసీ సంస్థ మాత్రం బంగారం లాంటి పంటలు పండే పచ్చటి పొలాల మధ్య దీన్ని వెలికి తీయాలనుకోవడం తగదన్నారు. డ్రిల్లింగ్ జరిగే గ్రామాల్లో ప్రజల మధ్య అభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి వచ్చిన అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ నిర్ణయం మేరకు తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో పర్యావరణ ఇంజనీర్ ఎస్.వెంకటేశ్వర్లు, ఓఎన్జీసీ కేజీ బేసిన్ మేనేజర్ ఎం.చంద్రశేఖర్, జనరల్ మేనేజర్ వీఎస్ఎస్ కామరాజు, సీపీఎం నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, బీవీ వర్మ, సీపీఐ నాయకులు డేగా ప్రభాకర్, ఎం.సీతారామ్‌ప్రసాద్, రైతు సంఘం నాయకుడు యెర్నేని నాగేంద్రనాథ్, గోదావరి పర్యావరణ పరిరక్షణ సమితి నాయకుడు మట్లపూడి సత్యనారాయణ పాల్గొన్నారు. -
’షేల్ గ్యాస్’పై నిరసన మంటలు
భూమి అట్టడుగు పొరల నుంచి గ్యాస్ వెలికితీసే నిర్ణయంపై రగులుతున్న జనం పోలీస్ నిర్బంధం నడుమ ప్రజాభిప్రాయ సేకరణ వ్యతిరేకిస్తున్న పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాలు తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : పర్యావరణానికి ముప్పు కలిగించే షేల్ గ్యాస్ (భూమి అట్టడుగు పొరల్లో ఉండే సహజవాయువు)ను వెలికి తీయాలనే ఓఎన్జీసీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా, కలుషితమైన పంట కాలువల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న డెల్టా వాసులు షేల్‌గ్యాస్ వెలికితీతకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సన్నద్ధమవుతున్నారు. షేల్ గ్యాస్ వెలికితీసే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా.. ఆ గ్రామాలకు 18 కిలో మీటర్ల దూరంలోని భీమవరం పట్టణంలో ఈ తంతు నిర్వహించడాన్ని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు మునిసిపల్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను పోలీసుల మోహరింపు నడుమ మమ అనిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఓఎన్జీసీ నిర్ణయాన్ని నిరసించారు. పర్యావరణానికి ముప్పే సాధారణంగా సముద్ర గర్భం నుంచి.. భూభాగంలో అయితే పైపొరల నుంచి చమురు, సహజ వాయువులను వెలికి తీస్తుంటారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో భూమి అట్టడుగు పొరల్లో (భూమికి సుమారు 4 కిలోమీటర్ల దిగువన) అపార గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు కనుగొన్నారు. దీనినే షేల్ గ్యాస్ అని పిలుస్తారు. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో ఈ గ్యాస్‌ను వెలికితీయాలని ఓఎన్జీసీ నిర్ణయించింది. ఇందుకోసం హైడ్రాలిక్æ ఫ్రాక్చరింగ్ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. భూమి అట్టడుగు పొరల్లో ఉన్న గ్యాస్‌ను హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో వెలికి తీయడం వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకూ నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేస్తున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండానే.. అండలూరు, కోలనపల్లి గ్రామాల్లో షేల్ గ్యా నిక్షేపాలను వెలికి తీయడానికి సంబంధించి ఓఎన్జీసీ అధికారులు గాని, ప్రభుత్వం గాని ఆ గ్రామాల ప్రజలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ గ్రామాల్లో టాంటాం వేయించడం, పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డుల్లో ఈ విషయాన్ని ప్రదర్శించడం గాని చేయలేదు. దీనికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉండగా.. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా, ఆ గ్రామాలకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కనీసం ఆ కార్యక్రమం భీమవరంలో ఎక్కడ నిర్వహిస్తారనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. షేల్‌గ్యాస్ తవ్వకాల వల్ల తలెత్తే దుష్పరిణామాలపై వామపక్షాలు, మానవ హక్కుల సంఘాలు గ్రామాల్లో ప్రచారం చేయడంతో ప్రజల్లో కొంత అవగాహన పెరిగి వారు ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతానికి వచ్చి తమ వ్యతిరేకతను వెల్లడించారు. గతంలో తవ్వకాలు జరిపినప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు. పరిసర ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించే ఈ తవ్వకాల విషయంలో ప్రభుత్వాలు సైతం ఆయా సంస్థలకే వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వీరవాసరం మండలం అండలూరులో గ్యాస్ వెలికితీయడానికి ఆరు నెలల క్రితం ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ డ్రిల్లింగ్ చేయడానికి అనుకూలంగా కాంక్రీట్‌తో దిమ్మెలు నిర్మించి ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్ వేశారు. అయితే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలంటే గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామంలో పంచాయతీ, రెవెన్యూ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాలని, భూసేకరణ చట్టం 2013తోపాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం వివాదాస్పదం అవుతోంది. అడ్టుకుంటాం అండలూరులో చేపట్టిన గ్యాస్, చమురు వెలికితీత పనులను అడ్డుకుంటాం. షేల్ గ్యాస్ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగుంటి సముద్రంలోని ఉప్పునీరు ఎగదన్నుతుంది. పచ్చని వ్యవసాయ భూములు ఉప్పుకయ్యలుగా మారిపోతాయి. అండలూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి. బొల్లెంపల్లి శ్రీనివాసచౌదరి, అండలూరు ప్రజల జీవితాలతో చెలగాటం ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అండలూరులో గ్యాస్, చమురు వెలికితీసే ప్రాజెక్ట్ చేపడుతున్న విషయం ఎవరికీ తెలియదు. తెలియ చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉందో అర్థంకావడం లేదు. మా ఊళ్లో రిగ్గులు వేస్తూ ఎక్కడో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దారుణం. మల్లుల తాతారావు, అండలూరు అధికారులు పునరాలోచించాలి కోలనపల్లిలో గ్యాస్ వెలికితీస్తున్నట్టు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కాలుష్యంతో కూడిన నీటిని తాగి వ్యాధుల బారిన పడుతున్నాం. అధికారులు పునరాలోచించాలి. గులిపల్లి జోగయ్య, ఏఎంసీ చైర్మన్, ఆకివీడు అగ్రదేశాలు వ్యతిరేకించినా.. అమెరికా వంటి ఆగ్రదేశాలు వ్యతిరేకించిన హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ విధానంలో షేల్‌గ్యాస్ వెలికి తీయడం వల్ల ఉ«భయ గోదావరి, కృష్ణా జిల్లాలకు పెను ప్రమాదం ముంచుకురానుంది. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సుకంటే అంబానీ వంటి పెద్దలకు దోచిపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తక్షణం షేల్‌గ్యాస్ తవ్వకాలను నిలిపివేయకుంటే పెద్దఎత్తున ప్రజాఉద్యమం చేపడతాం. మంతెన సీతారామ్, సీపీఎం రాష్ట కార్యవర్గ సభ్యుడు పొలాలు ఎడారిగా మారతాయి భూగర్భ లోతుల్లోంచి తీసే షేల్ గ్యాస్ కారణంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వేలాది ఎకరాల పచ్చటి పొలాలు ఎడారిగా మారతాయి. భూగర్భ జలాలు కలుషితం కావడమేగాక పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో విధ్వంసకర చర్యలకు అనుమతిస్తున్నారు. తక్షణం షేల్ గ్యాస్ తీసే పనులను విరమించుకోవాలి. ఎం.సీతారామ్‌ప్రసాద్, సీపీఐ పట్టణ కార్యదర్శి, భీమవరం