’షేల్‌ గ్యాస్‌’పై నిరసన మంటలు | people aginast shale gas drilling | Sakshi
Sakshi News home page

’షేల్‌ గ్యాస్‌’పై నిరసన మంటలు

Published Tue, Dec 6 2016 10:40 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

’షేల్‌ గ్యాస్‌’పై నిరసన మంటలు - Sakshi

’షేల్‌ గ్యాస్‌’పై నిరసన మంటలు

 భూమి అట్టడుగు పొరల నుంచి గ్యాస్‌ వెలికితీసే నిర్ణయంపై రగులుతున్న జనం
 పోలీస్‌ నిర్బంధం నడుమ ప్రజాభిప్రాయ సేకరణ
 వ్యతిరేకిస్తున్న పర్యావరణ వేత్తలు, ప్రజా సంఘాలు
 తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పర్యావరణానికి ముప్పు కలిగించే షేల్‌ గ్యాస్‌ (భూమి అట్టడుగు పొరల్లో ఉండే సహజవాయువు)ను వెలికి తీయాలనే ఓఎన్‌జీసీ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా, కలుషితమైన పంట కాలువల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న డెల్టా వాసులు షేల్‌గ్యాస్‌ వెలికితీతకు వ్యతిరేకంగా ఉద్యమించడానికి సన్నద్ధమవుతున్నారు. షేల్‌ గ్యాస్‌ వెలికితీసే గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా.. ఆ  గ్రామాలకు 18 కిలో మీటర్ల దూరంలోని భీమవరం పట్టణంలో ఈ తంతు నిర్వహించడాన్ని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు, పర్యావరణ వేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. మంగళవారం భీమవరంలోని అల్లూరి సీతారామరాజు మునిసిపల్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణను పోలీసుల మోహరింపు నడుమ మమ అనిపించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా ఓఎన్‌జీసీ నిర్ణయాన్ని నిరసించారు.
 
పర్యావరణానికి ముప్పే
సాధారణంగా సముద్ర గర్భం నుంచి.. భూభాగంలో అయితే పైపొరల నుంచి చమురు, సహజ వాయువులను వెలికి తీస్తుంటారు. జిల్లాలోని డెల్టా ప్రాంతంలో భూమి అట్టడుగు పొరల్లో (భూమికి సుమారు 4 కిలోమీటర్ల దిగువన) అపార గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్టు కనుగొన్నారు. దీనినే షేల్‌ గ్యాస్‌ అని పిలుస్తారు. వీరవాసరం మండలం అండలూరు, కాళ్ల మండలం కోలనపల్లి గ్రామాల్లో ఈ గ్యాస్‌ను వెలికితీయాలని ఓఎన్‌జీసీ నిర్ణయించింది. ఇందుకోసం హైడ్రాలిక్‌æ ఫ్రాక్చరింగ్‌ విధానాన్ని అనుసరించేందుకు సిద్ధమైంది. భూమి అట్టడుగు పొరల్లో ఉన్న గ్యాస్‌ను హైడ్రాలిక్‌ ఫ్రాక్చరింగ్‌ విధానంలో వెలికి తీయడం వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలకూ నష్టం వాటిల్లుతుందని స్పష్టం చేస్తున్నారు.
 
కనీస సమాచారం ఇవ్వకుండానే..
అండలూరు, కోలనపల్లి గ్రామాల్లో షేల్‌ గ్యా నిక్షేపాలను వెలికి తీయడానికి సంబంధించి ఓఎన్‌జీసీ అధికారులు గాని, ప్రభుత్వం గాని ఆ గ్రామాల ప్రజలకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. ఆ గ్రామాల్లో టాంటాం వేయించడం, పంచాయతీ కార్యాలయ నోటీస్‌ బోర్డుల్లో ఈ విషయాన్ని ప్రదర్శించడం గాని చేయలేదు. దీనికి సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉండగా.. ఈ విషయాన్ని ఎవరికీ తెలియనివ్వకుండా, ఆ గ్రామాలకు 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీమవరంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కనీసం ఆ కార్యక్రమం భీమవరంలో ఎక్కడ నిర్వహిస్తారనే విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. షేల్‌గ్యాస్‌ తవ్వకాల వల్ల తలెత్తే దుష్పరిణామాలపై వామపక్షాలు, మానవ హక్కుల సంఘాలు గ్రామాల్లో ప్రచారం చేయడంతో ప్రజల్లో కొంత అవగాహన పెరిగి వారు ప్రజాభిప్రాయ సేకరణ జరిగే ప్రాంతానికి వచ్చి తమ వ్యతిరేకతను వెల్లడించారు. గతంలో తవ్వకాలు జరిపినప్పుడు కూడా ఇదే విధంగా వ్యవహరించారని స్థానికులు చెబుతున్నారు. పరిసర ప్రాంత ప్రజల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా చమురు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపించే ఈ తవ్వకాల విషయంలో ప్రభుత్వాలు సైతం ఆయా సంస్థలకే వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. వీరవాసరం మండలం అండలూరులో గ్యాస్‌ వెలికితీయడానికి ఆరు నెలల క్రితం ఓ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ డ్రిల్లింగ్‌ చేయడానికి అనుకూలంగా కాంక్రీట్‌తో దిమ్మెలు నిర్మించి ఆ ప్రాంతం చుట్టూ ఫెన్సింగ్‌ వేశారు. అయితే ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలంటే గ్రామస్తుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గ్రామంలో పంచాయతీ, రెవెన్యూ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డులను ఏర్పాటు చేయాలి. ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించాలని, భూసేకరణ చట్టం 2013తోపాటు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. అధికారులు ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం వివాదాస్పదం అవుతోంది. 
 
అడ్టుకుంటాం
 
అండలూరులో చేపట్టిన గ్యాస్, చమురు వెలికితీత పనులను అడ్డుకుంటాం. షేల్‌ గ్యాస్‌ తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగుంటి సముద్రంలోని ఉప్పునీరు ఎగదన్నుతుంది. పచ్చని వ్యవసాయ భూములు ఉప్పుకయ్యలుగా మారిపోతాయి. అండలూరు గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలి.
 బొల్లెంపల్లి శ్రీనివాసచౌదరి, అండలూరు
 
ప్రజల జీవితాలతో చెలగాటం
 
ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. అండలూరులో గ్యాస్, చమురు వెలికితీసే ప్రాజెక్ట్‌ చేపడుతున్న విషయం ఎవరికీ తెలియదు. తెలియ చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉందో అర్థంకావడం లేదు. మా ఊళ్లో రిగ్గులు వేస్తూ ఎక్కడో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం దారుణం.
 మల్లుల తాతారావు, అండలూరు
 
 
 
అధికారులు పునరాలోచించాలి
 
కోలనపల్లిలో గ్యాస్‌ వెలికితీస్తున్నట్టు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. హైడ్రాలిక్‌ ఫ్రాక్చరింగ్‌ విధానం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే  కాలుష్యంతో కూడిన నీటిని తాగి వ్యాధుల బారిన పడుతున్నాం. అధికారులు పునరాలోచించాలి.
 గులిపల్లి జోగయ్య, ఏఎంసీ చైర్మన్, ఆకివీడు
 
 
అగ్రదేశాలు వ్యతిరేకించినా..
 
అమెరికా వంటి ఆగ్రదేశాలు వ్యతిరేకించిన హైడ్రాలిక్‌ ఫ్రాక్చరింగ్‌ విధానంలో షేల్‌గ్యాస్‌ వెలికి తీయడం వల్ల  ఉ«భయ గోదావరి, కృష్ణా జిల్లాలకు పెను ప్రమాదం ముంచుకురానుంది. ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సుకంటే అంబానీ వంటి పెద్దలకు దోచిపెట్టడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి.  తక్షణం షేల్‌గ్యాస్‌ తవ్వకాలను నిలిపివేయకుంటే పెద్దఎత్తున ప్రజాఉద్యమం చేపడతాం.
 మంతెన సీతారామ్, సీపీఎం రాష్ట కార్యవర్గ సభ్యుడు
 
 
 
పొలాలు ఎడారిగా మారతాయి
 
భూగర్భ లోతుల్లోంచి తీసే షేల్‌ గ్యాస్‌ కారణంగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వేలాది ఎకరాల పచ్చటి పొలాలు ఎడారిగా మారతాయి. భూగర్భ జలాలు కలుషితం కావడమేగాక పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో విధ్వంసకర చర్యలకు అనుమతిస్తున్నారు. తక్షణం షేల్‌ గ్యాస్‌ తీసే పనులను విరమించుకోవాలి.
 ఎం.సీతారామ్‌ప్రసాద్, సీపీఐ పట్టణ కార్యదర్శి, భీమవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement