సాక్షి, ఒంగోలు : స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో నూతన సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టారు. ఇక నుంచి, అన్ని సేవలను మాతృభాష తెలుగులోకి తీసుకొచ్చేందుకు యూనిక్‌కోడ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే సెంట్రల్ సర్వర్‌లో మార్పులు చేసేందుకు రిజిస్ట్రేషన్ శాఖ లావాదేవీలను బుధవారం నుంచి ఆరురోజుల పాటు నిలిపివేయనున్నారు.
అక్టోబర్ ఒకటి నుంచి ఆరో తేదీ వరకు భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు జరపరాదని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు మంగళవారం సాయంత్రం 7.30 గంటల నుంచి ఆ శాఖ సెంట్రల్ సర్వర్ నిలిచిపోయింది. ఒంగోలు, మార్కాపురం జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని 18 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మంగళవారం ఒక్కరోజునే అత్యధిక రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఇదిలా ఉంటే, త్వరలో అమలుకానున్న సంస్కరణల ప్రకారం భూముల క్రయవిక్రయాలకు స్లాట్ విధానం ప్రవేశపెట్టారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం క్రయవిక్రయదారులు ముందుగా ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్ చేసుకోవాలి.
అనంతరం స్లాట్‌లో ఇచ్చిన సమయంలో సంబంధిత రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే పద్ధతిని రూపొందించారు. అన్ని సేవలను ఒక ఫార్మెట్‌లోకి తీసుకొచ్చారు. తద్వారా యూనిక్‌కోడ్ అమలవుతుందని ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ ఎం.అబ్రహాం వివరించారు. సేల్‌డీడ్, గిఫ్ట్‌డీడ్, మార్టిగేజ్ వంటి సేవలు అన్నీ ఒకే ఫార్మెట్‌లోకి వచ్చేలా సెంట్రల్ సర్వర్‌లో మార్పులు తెస్తున్నారు. దీంతో ఏ ప్రాంతం నుంచైనా ఆన్‌లైన్‌లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల రికార్డులనూ అనుసంధానం చేస్తున్నారు. తద్వారా భూమి విలువ, భూమి సర్వే, స్వరూపం తెలుసుకోవడానికి రెవెన్యూ కార్యాలయానికి వెళ్లకుండానే.. ఆన్‌లైన్‌లో పూర్తిగా భూమి విలువ, సర్వే రూపం అందుబాటులోకి వస్తాయి.
తెలుగు భాషలో సేవలు..
రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా పొందే సేవలన్నీ తెలుగులోనే ఇవ్వనున్నారు. ఈసీలు, నకలుతో పాటుగా క్రయవిక్రయాదుల రిజిస్ట్రేషన్ తెలుగులో అందుబాటులోకి వస్తాయి. దళారుల ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఈ చర్యలు చేపట్టింది. గతంలో ఈసీలు, నకలు ఈసేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి వచ్చినప్పటికీ, ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నేటి నుంచి రిజిస్ట్రేషన్‌లు బంద్
Published Wed, Oct 1 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement
Advertisement