
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రతి రోజూ ఉదయమే క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు అందుతున్న పౌర సేవలను స్వయంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వీరు కార్యాలయ పనివేళలకు ముందుగానే తెల్లవారుజామున 5.30 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు తమ పరిధిలో పర్యటించి ప్రజలను కలుసుకోవాల్సి ఉంటుంది. నవరత్నాలతో పాటు ఇతర సేవలన్నీ వలంటీర్ల ద్వారా ప్రజల ముంగిటకే అందించే లక్ష్యంలో భాగంగా సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం జాబ్ చార్ట్‌లను కూడా రూపొందించింది.
జాబ్ చార్ట్ ఇలా...
- క్షేత్రస్థాయి పర్యటనలో ప్రధానంగా పారిశుధ్య పనులు, పారిశుధ్య కార్మికుల హాజరు, పనితీరును పరిశీలించాలి.
- మంచినీటి సరఫరా, వీధిలైట్ల పనితీరు, స్పందనలో అందిన వినతులు, ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
- క్షేత్రస్థాయి పర్యటనలో గుర్తించిన సమస్యలపై మధ్యాహ్నం నుంచి చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.
- ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణ వివరాలతో పాటు వలంటీర్ల పనితీరు గురించి తెలుసుకోవాలి.
- ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు ఉద్యోగులు సచివాలయ కార్యాలయాల్లో తప్పనిసరిగా ఉండాలి.
- ఉద్యోగులు రోజువారీ డైరీని నిర్వహించాలి.
- ఉద్యోగులంతా పంచాయతీ సమావేశాలు, గ్రామ సభలకు హాజరవ్వాలి. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనలో భాగస్వాములు కావాలి.
- నవరత్నాలతోపాటు ఇతర సేవలను ప్రజల ముంగిటకు సమర్థంగా, సకాలంలో చేర్చడంపై గ్రామ సచివాలయం దృష్టి సారించాలి.
- నవరత్నాలకు సంబంధించి ప్రజలకు ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.
- ప్రతి రోజూ స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు అభ్యర్థనలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలి.
- ప్రభుత్వ, గ్రామ పంచాయతీ ఆస్తులను పరిరక్షించాలి.
- 1956 కల్తీ ఆహార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి.
- తూనికలు, కొలతల్లో అక్రమాలను నిరోధించడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్య వివాహాల నివారణ, దశలవారీగా మద్యనిషేధం, గృహ హింస చట్టం అమలుకు కృషి చేయాలి.
- వివిధ పథకాల లబ్ధిదారుల గుర్తింపు, పంపిణీపై సమీక్షించాలి.
- లే అవుట్లు, తాగునీటి కనెక్షన్లు, వ్యాపార లైసెన్సుల కోసం అందిన దరఖాస్తులను తనిఖీ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment