
చైతన్యం నింపిన యువ మైత్రి
మీ భవితకు మీరే నిర్దేశకులు.. మీ మనసే మీ ఆయుధం.. ఆశల పల్లకీలో ఊరేగుతూనే అవకాశాలు అందిపుచ్చుకోవాలి.. లక్ష్యం ఎంత కఠినంగా ఉన్నా.. గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా..
- 30 కళాశాలల నుంచి 1,500 మంది విద్యార్థులు హాజరు
- భవితను నిర్దేశించిన ప్రొఫెసర్ల ప్రసంగాలు
మీ భవితకు మీరే నిర్దేశకులు.. మీ మనసే మీ ఆయుధం.. ఆశల పల్లకీలో ఊరేగుతూనే అవకాశాలు అందిపుచ్చుకోవాలి.. లక్ష్యం ఎంత కఠినంగా ఉన్నా.. గమ్యం ఎంత సుదూరంగా ఉన్నా.. అనుకున్న చోటికి, అనుకున్న సమయూనికి చేరుకోవాలి... అంటూ పలువురు ప్రొఫెసర్లు చేసిన ప్రసంగాలు విద్యార్థుల్లో చైతన్యం నింపారుు. ఈ-సిటీ సౌజన్యంతో ‘సాక్షి’ మీడియా, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘యువమైత్రి’ వర్క్‌షాప్‌నకు విశేష స్పందన వచ్చింది. నిపుణుల ఇచ్చిన పలు సూచనలు సలహాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడ్డాయి.
విజయవాడ : పోటీ ప్రపంచంలో.. విద్యార్థులు ఉన్నత ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవటం కోసం నిర్వహించిన ‘యువమైత్రి’ వర్క్‌షాపు విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపింది. ఈ-సిటీ సౌజన్యంతో ‘సాక్షి’ మీడియా, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో వక్తల ప్రసంగాలు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేశాయి. సిద్ధార్థ ఆడిటోరియంలో శనివారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిద్ధార్థ అకాడమి అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు తొలుత జ్యోతి వెలిగించి వర్క్‌షాప్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి చెందినవారు కుంగిపోకుండా మళ్లీమళ్లీ ప్రయత్నిస్తే విజయం సాధిస్తారన్నారు. విద్యార్థులు మానవీయ విలువలను తెలుసుకోవాలని సూచించారు. వర్క్‌షాపులో నిపుణులు చెప్పిన అంశాలను ఆకలింపు చేసుకోవాలన్నారు. కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షుడు చంటిరాజు క్లబ్ చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు.
న్యూ జనరేషన్స్ మంత్‌ను పురస్కరించుకుని రోటరాక్ట్ క్లబ్ విభాగం ఆధ్వర్యంలో యువత కోసం నెలరోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్క్‌షాపునకు హాజరైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ-సిటీ వారు లక్కీడ్రా నిర్వహించారు. ఈ డ్రాలో సిద్ధార్థ మహిళా కళాశాలకు చెందిన జి.భవానీ, ఆంధ్రా లయోలా కాలేజీకి చెందిన బి.శ్రీను బహుమతులు గెలుచుకున్నారు. సోమవారం బంపర్ డ్రా నిర్వహించి విజేతకు భారీ బహుమతి ఇస్తారు.
మూడున్నర గంటల పాటు ఈ వర్క్‌షాపు జరిగింది. వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ పి.పద్మ, డాక్టర్ జీఎన్‌కే దుర్గ, ప్రొఫెసర్ వి.విశ్వనాథమ్, రోటరీ క్లబ్ యూత్ సర్వీసెస్ డెరైక్టర్లు కె.నారాయణ, సీహెచ్ నారాయణ, డాక్టర్ కె.పట్టాభి రామయ్య, రోటరాక్ట్ క్లబ్ అధ్యక్షుడు సత్య, సభ్యులు సీహెచ్ సాయిరామ్, కేఎన్‌ఎస్ ప్రసాద్, ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్ ఎన్‌ఆర్‌కే ప్రసాద్, ‘సాక్షి’ ఈవెంట్ మేనేజర్ జె.ప్రవీణ్‌కుమార్, పానావిజన్ సీఈవో జనార్థనమూర్తి తదితరులు పాల్గొన్నారు.
భావ ప్రకటన ముఖ్యం..
ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. భావ వ్యక్తీకరణ ఒక్కొక్కరిదీ ఒక్కోలా ఉంటుంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ తక్కువగా మాట్లాడితే.. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడి విద్యార్థులతో చాలాసేపు మాట్లాడారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని భావాన్ని వ్యక్తం చేయాలి. మాట్లాడిన సందర్భం, వ్యక్తులను బట్టి వాటి ప్రభావం ఉంటుంది. ఎవరు, ఏ సందర్భంలో మాట్లాడారు అనేది ముఖ్యం. ఇంటర్వ్యూలకు వెళ్లేవారు రెజ్యూమ్‌లో తప్పులు లేకుండా చూసుకోవాలి. నిజాయితీగా వ్యవహరించాలి. బృంద చర్చల్లో తప్పకుండా పాల్గొని సొంత అభిస్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేయాలి. ఆంగ్లంపై పట్టు సాధించేందుకు కృషి చేయాలి.
- డాక్టర్ పి.పద్మ, సైకాలజిస్ట్
లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధన చేయండి
సానుకూల దృక్పథంతో ఆలోచించటం అలవరుచుకోవాలి. బలం, బలహీనతలు, అవకాశాలు, అనుసరించే విధానాన్ని తెలుసుకుని ముందుకుసాగాలి. మన లక్ష్యం ఏమిటి? ఎంత సమయం కావాలి? వాస్తవంగా ఉన్న పరిస్థితులను అంచనా వేసుకుని కృషి చేయాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ముఖ్యం. సృజనాత్మకంగా ఆలోచించే వారు విజయం సాధిస్తారు. వ్యక్తిగత, సామాజిక, దేశీయంగా ఉన్న విలువలను కాపాడుకోవాలి. విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్ లేకపోవటం వల్లే ఉపాధి దొరకట్లేదు.
- డాక్టర్ జీఎల్‌కే దుర్గ
మనసును నియంత్రిస్తే విజయం మీదే..
మనసును నియంత్రించుకుంటే విజయం తప్పక వరిస్తుంది. మన సంస్కృతీ సంప్రదాయాల్లో మనసును నియంత్రించే విధానాలు ఉన్నాయి. తర్కబద్దంగా ఆలోచిస్తే సమస్యలను అధిగమించవచ్చు. విద్యార్థి దశలో ఉన్న సామర్థ్యాలతోనే మంచి సిటిజన్‌గా మారతారు. జీవితం గురించి అవగాహన కలగాలంటే 20 క్యారెక్టర్లు, 29 క్యాలిటీలు, 16 స్కిల్స్ అవసరం. విలువలు లేని సమాజంలో భద్రత ఉండదు. ఆలోచించలేని వారు ప్రశ్నించలేరు. సంస్కారం నేర్పించే వ్యవస్థ రావాల్సి ఉంది.
- వి.విశ్వనాథం, ప్రొఫెసర్
నేటి కార్యక్రమం..
‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువమైత్రి వర్క్‌షాపు ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ‘లైఫ్‌స్కిల్స్’ అంశంపై ప్రొఫెసర్ ఆర్య వర్థన్, ‘మెంటల్ డెవలెప్‌మెంట్’పై ప్రొఫెసర్ కేఎల్ దేవదాస్,‘మ్యూమన్ ఎక్స్‌లెన్స్’పై డాక్టర్ ఎంసీ దాస్ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులెవరైనా పాల్గొనవచ్చు.