కరోనా సోకిన మృతదేహాన్ని ట్రక్కులోకి ఎక్కిస్తున్నపంచాయతీ, ఆరోగ్య సిబ్బంది
గణపవరం: కరోనాతో మరణించిన వారి మృతదేహాలను ముట్టుకోవడం కాదు కదా.. కనీసం చూడటానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. కుటుంబ సభ్యులు కూడా ఆమడదూరం పారిపోతున్నారు. ఇలాంటి హృదయ విదారక ఘటన గణపవరంలో చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం దళితపేటలో ఒక వృద్ధురాలు మరణించింది. ఆమెకు కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో వైద్యులు పరీక్ష నిర్వహించగా సాయంత్రం కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో అప్పటివరకూ అక్కడ వృద్ధురాలు కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. మృతదేహాన్ని వదిలేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. చుట్టుపక్కల వారంతా తలుపులు గడియ వేసుకుని ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు.
రాత్రి 9 గంటలవరకూ మృతదేహం ఇంట్లోనే పడి ఉంది. ఈ విషయం తెలిసిన ఎంపీడీఓ జ్యోతిర్మయి, ఎస్సై వీరబాబు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్, ఎంపీహెచ్‌డబ్ల్యూ హరి వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో వచ్చి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మృతదేహం అక్కడి నుంచి వెంటనే తరలించాలని, కనీసం తరలింపుకైనా సహకరించాలని కోరారు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పంచాయతీ, వైద్యశాఖ అధికారులు అప్పటికప్పుడు రక్షణ దుస్తులు ధరించి మృతదేహాన్ని తరలించారు. ఆ ప్రాంతాల్లో పకడ్బందీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. వచ్చిన సిబ్బంది కూడా మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి ససేమిరా అనడంతో అధికారులు బతిమాలి తలోచేయి వేసి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. మృతదేహాన్ని తరలించిన సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయించనున్నట్టు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment