జిల్లాలోని పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.16.58 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్
పంచాయతీలకు నిధులు విడుదల
Published Sun, Oct 20 2013 3:34 AM | Last Updated on Fri, Sep 1 2017 11:47 PM
తాడేపల్లిగూడెం రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.16.58 కోట్లు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్‌ఎఫ్‌సీ) నుంచి రూ.5.45 కోట్లు విడుదలైనట్టు జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) అల్లూరి నాగరాజువర్మ వెల్లడించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి, మౌలిక వసతుల కల్పన కోసం ఈ నిధులను మూడు నెలల్లోగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు, ఆయా పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రెండు మూడు రోజుల్లో పంచాయతీ అకౌంట్లలో నిధులు జమ అవుతాయని తెలిపారు. నిధుల వినియోగం, గ్రామ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు ఈనెల 22 నుంచి శిక్షణ ఇస్తున్నట్టు డీపీవో చెప్పారు.
ఆదాయం పెంపునకు చర్యలు
పంచాయతీల ఆదాయం పెంచేందుకు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి నూతన ప్రణాళికను సిద్ధం చేసినట్టు డీపీవో నాగరాజువర్మ తెలిపారు. ఇళ్ల పన్నుల సవరణ ద్వారా రూ.10 కోట్లు, మంచినీటి కుళాయి పన్నుల ద్వారా రూ.15 కోట్లు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. జిల్లాలో 200కు పైగా అక్రమ లేఅవుట్లను గుర్తించామని, వీటిసంఖ్య నర్సాపురం డివిజన్ పరిధిలో ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు. అక్రమ లేఅవుట్ ప్లాట్లను కొనేవారికి కరెంట్, నీరు, రోడ్డు వసతులు కల్పించమని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్లాట్లు కొనుగోలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీవోలు జి.రమణ, జీవీకే మల్లికార్జునరావు, ఈవోపీఆర్‌డీ రామాంజనేయశర్మ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement