సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఎట్టకేలకు పంచాయతీ కార్యదర్శి పోస్టుల మెరిట్ జాబితా ఖరారైంది. కలెక్టర్ బి.శ్రీధర్ ఆమోదం తెలపడంతో బుధవారం అర్హుల జాబితాను జిల్లా యంత్రాంగం వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది. గతేడాది నవంబర్‌లో జిల్లాలోని 122 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టినప్పటికీ.. ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్యదర్శులకు 25శాతం వెయిటేజీ ఇచ్చారు. దీంతో భారీగా దరఖాస్తులు వచ్చినప్పటికీ.. వెయిటేజీ నేపథ్యంలో కాంట్రాక్టు పంచాయతీ కార్యదర్శులే ఎక్కువగా ఎన్నికయ్యారు. కేవలం డిగ్రీ మార్కుల ఆధారంగా 20మంది అర్హత సాధించగా, 100 మంది కాంట్రాక్టు కార్యదర్శులు ఎంపికయ్యారు.
మరో రెండు పోస్టులు అభ్యర్థులు లేకపోవడంతో ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి డిసెంబర్ ఆరో తేదీన ఈ జాబితా ప్రకటించాల్సిఉండగా.. పలువురు కాంట్రాక్టు కార్యదర్శులు కోర్టును ఆశ్రయించారు. దీంతో జాబితా విడుదలపై న్యాయ సలహా కోసం ఉన్నతాధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో జాబితా విడుదలలో తాత్సారం జరిగినట్లు తెలిసింది. తాజాగా ఈ అంశంపై స్పష్టత రావడంతో బుధవారం జాబితాను విడుదల చేశారు. మెరిట్ జాబితాలో ఉన్న వారు ఈ నెల 7వ తేదీన ఉదయం 10.30గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి డీపీఓ వరప్రసాద్‌రెడ్డి ‘సాక్షి’తో పేర్కొన్నారు.
మెరిట్ జాబితా కోసం: డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. రంగారెడ్డి.ఏపీ.జీఓవీ.ఇన్
కార్యదర్శుల జాబితా విడుదల
Published Wed, Jan 1 2014 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement