సైదన్న ఉర్సుకు రెడీ | Religious harmony, humanity, as a symbol of courage continues | Sakshi
Sakshi News home page

సైదన్న ఉర్సుకు రెడీ

Published Mon, Jan 20 2014 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM

Religious harmony, humanity, as a symbol of courage continues

మత సామరస్యానికి, మానవత్వానికి, ధైర్యానికి చిహ్నంగా జాన్‌పహాడ్ దర్గా విరాజిల్లుతోంది. నేరేడుచర్ల మండలకేంద్రానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాన్‌పహాడ్ దర్గా తెలంగాణలోనే ప్రసిద్ధి చెందింది. ఈ దర్గాను ముస్లింలతో పాటు హిందువులు కూడా అధిక సంఖ్యలో దర్శించుకుంటారు. భక్తులు తమ కోరుకున్న కోర్కెలు తీరితే కందూరు పేరిట మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల 23 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉర్సుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.  
 -న్యూస్‌లైన్, నేరేడుచర్ల
 
 సుమారు 400 ఏళ్ల క్రితం మద్రాస్ రాష్ట్రంలోని నాగూర్ గ్రామంలో వెలసిన నాగూర్ షరీఫ్ ఖాదర్ దర్గా విశిష్టతను పొరుగున ఉన్న ఆంధ్రరాష్ట్రంలో కూడా ప్రచారం చేయాలని తలచి జాన్‌పహాడ్ సైదా, బాజీ సైదా, మొయినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారన్న కథనం ప్రచారంలో ఉంది. ఈ ముగ్గురు భక్తులు ఆంధ్రరాష్ట్రానికి చేరి నాగూర్ షరీఫ్ గొప్పతనాన్ని చాటుతూ ఊరూరా తిరగసాగారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి వారు అమరులయ్యారు.
 
 వాడపల్లి వద్ద అమరుడైన జాన్‌పహాడ్ సైదా జ్ఞాపకార్థం వజీరాబాద్ రాజకుమారుడు జాన్‌పహాడ్ వద్ద సమాధులు కట్టించారని చెబుతుంటారు. దీంతో జాన్‌పహాడ్ సైదాగా పేరొచ్చిందని ఆ తరువాత జాన్‌పహాడ్ దర్గాగా వాడుకలోకి వచ్చిందని చెబుతుంటారు. ఈ ప్రాంతంలో నీటి వసతి లేదని బెంబేలు పడుతున్న తరుణంలో వేముల శేషారెడ్డి తండ్రి మట్టారెడ్డి కలలో జాన్‌పహాడ్ సైదా కన్పించి గుర్రపు డెక్కలు ఉన్నచోట బావిని తవ్వాలని చెప్పినట్లు ఓ కథ ప్రచారంలో ఉంది. దర్గా అంతా అడవి ప్రాంతం కావడంతో తన దగ్గరకు వచ్చిన భక్తులు భయపడకుండా రక్షణ కోసం అక్కడ ఒక నాగుపామును, పెద్ద పులిని కూడా ఏర్పాటుచేసినట్లు పూర్వికులు చెబుతారు.
 
 కందూరు...
 జాన్‌పహాడ్ దర్గా వద్దకు ప్రతి శుక్రవారం దర్శనానికి వచ్చేవారు, ఉర్సుకు వచ్చే వారు అక్కడ తీర్చుకొనేమొక్కును కందూరు అంటారు. కందూరు మొక్కులలో.. మేకపోతును, గొర్రెపొట్టేలును నివేదన ఇవ్వడం అచారంగా వస్తోంది. భక్తులు తమ మొక్కు ప్రకారం మేకపోతులు లేదా గొర్రె పొట్టేళ్లను తీసువచ్చి వాటికి స్నానం చేయించిన అనంతరం హలాల్ చేయించి సఫాయి బావి నీటితో వండుతారు. అనంతరం దర్గాలో నివేదన (ఫాతెహాలు)ఇవ్వడమే గాక మొక్కు చెల్లించుకుంటారు. ఆ తరువాత బంధుమిత్రులకు భోజనాలు పెడతారు. ఇలా చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని భావిస్తుంటారు.
 
 గొల్లభామ గుట్ట ...
 మత ప్రచారం సందర్భంగా జరిగిన యుద్ధ సమయంలో ఓ గొల్లభామ రావిపహాడ్ గ్రామం నుంచి వాడపల్లి వె ళ్తూ అటుగా వచ్చింది. ఆమె అందంగా ఉంటుంది. మం చి మాటకారి కూడా. అయితే ఈ యుద్ధం దృశ్యాన్ని చూ స్తూ వెళ్తున్న ఆమెను సైదులుబాబా గమనించారు. ‘ ఓ అమ్మాయి చూసినంత చూశావు.. ఇక నువ్వు వెనకకు చూడకుండా వెళ్లిపో.. ఒక వేళ తొందరపడి వెనక్కు చూ శావో అక్కడే శిలవైపోతావు. జాగ్రత్తగా వెళ్లు’ అని బాబా హెచ్చరించారు. బాబా ఆదేశాలు విన్న గొల్లభామ ముం దుకు సాగిపోయింది. కానీ కొంతదూరం వెళ్లాక .. ఆమె కు యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలనిపించింది. వెంటనే వెనకకు చూసింది. అంతే మరుక్షణంలో ఆమె శిలగా మారిపోయిందని మరో కథ ప్రచారంలో ఉంది. గొల్లభామ శిలగా మారిన ఆ ప్రాంతాన్ని ఇక్కడి వారు గొల్లభామగుట్టగా భావించి పవిత్రంగా నమస్కరిస్తారు. వచ్చిన భక్తులు తలా ఒక రాయి ఆమెకు సమర్పించి స్మరించుకుంటుంటారు.
 
 మూడు రోజుల పాటు..
 ఈ నెల 23, 24, 25 తేదీలలో ఉర్సు జరుగుతుంది.
 23న దర్గాలో కొవ్వొత్తులతో ఉల్సా నిర్వహిస్తారు.
 24న వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి తెచ్చిన పవిత్ర గంధాన్ని గుర్రంపై జాన్‌పహాడ్ పురవీధుల్లో ఊరేగించి దర్గాలో సమాధులపైకి ఎక్కిస్తారు.
 25న దర్గాలో దీపారాధన చేయడంతో ఉర్సు ముగుస్తుంది.
 జాన్‌పహాడ్‌కు బస్సుల సౌకర్యం ఇలా..
 మిర్యాలగూడ డిపో నుంచి దామరచర్ల మీదుగా జాన్‌పహాడ్ వరకు.
 సూర్యాపేట ఆర్టీసీ డిపో నుంచి నేరేడుచర్ల మండల కేంద్రం మీదుగా ..
 కోదాడ డిపో నుంచి నేరేడుచర్ల మీదుగా..
 
 కొనసాగుతున్న అభివృద్ధి పనులు
 జాన్‌పహాడ్ దర్గా వద్ద రూ.50లక్షలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో నిర్వహించనున్న ఉర్సు నాటికి ఈ పనులు పూర్తి చేయనున్నారు. వక్ఫ్‌బోర్డు నుంచి మంజూరైన రూ.50లక్షల నిధులతో చేపట్టనున్న పనులను గత సంవత్సరం జూన్ 9న గృహనిర్మాణశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించారు.  ఇప్పుడు వాటర్ ట్యాంకులు, సందల్‌ఖానా, అతిథిగృహం, వసతిగృహాలు, దర్గాలో క్యూలైన్ల ఏర్పాటు చేపడతున్నారు. ఉర్సు ఉత్సవాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తి చేయనున్నట్లు దర్గా కాంట్రాక్టర్ ఎంవీ సుబ్బారావు తెలిపారు. ఉర్సు సందర్భంగా దర్గా వద్ద భద్రతా ఏర్పాట్లను సీఐ బలవంతయ్య పర్యవేక్షించారు. భక్తులు సులభంగా వెళ్లేందుకు దుకాణ సముదాయాలు, పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన శిబిరాలను ఆయన పరిశీలించారు.
 
 సఫాయిబావి..
 జాన్‌పహాడ్ దర్గాకు వెళ్లే దారిలో మొద ట కుడివైపున ఒక దిగుడుబావి ఉంది. ఇది విచిత్రంగా ఒక గుహ వలె కన్పిస్తుంది. బాగా లోతులో నీళ్లు ఉం టాయి. జాన్‌పహా డ్ దర్గాను దర్శించుకునే భక్తులు ఈ బావి నీటిని తెచ్చుకొని పుణ్యస్నానాలు చేస్తారు. ఈ నీటితోనే వంటలు చేసుకుంటారు. ఇది చాలా పవిత్రమైన నీరున్న బావి. అందుకే దీనిని సఫాయి బావి అంటారు. ఈ బావి నీటితో స్నానం చేయడం వల్ల మానసిక శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ బావిలోని నీటిని పంటలపై చల్లితే మంచి దిగుబడి వస్తుందని విశ్వసిస్తారు. ఆలాగే పశువులకు తాగిస్తే ఆరోగ్యంగా ఉండి చక్కని పాడినిస్తాయని చెబుతారు.
 
 తీరని సమస్యలు
 జాన్‌పహాడ్ దర్గాకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నియంత్రణకు ఇక్కడ బైపాస్ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదనను వక్ఫ్‌బోర్డు  పంపినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
 జాన్‌పహాడ్ దర్గాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చినా ఇంతవరకు అమలుకాలేదు.
 దర్గాకు వచ్చే భక్తులకు స్నానాల గదులు, మరుగుదొడ్లు ఏర్పాటుచేయాల్సి ఉంది.
 దర్గా సమీపంలోని వీధులన్నీ అపరిశుభ్రంగా దుమ్ము, ధూళితో  నిండి ఉన్నాయి. దర్గా పరిసర ప్రాంతాన్ని సీసీతో నిర్మాణం చేపట్టాలి
 
 నాగులపుట్ట..
 దర్గా వద్ద వేపచెట్టు మొదట వెలసిన పుట్ట వద్ద మహిళలు కొబ్బరికాయలు కొట్టి పుట్టలో పాలు, పండ్లు, గుడ్లు పెట్టి పూజలు చేస్తుంటారు. సంతానం లేని మహిళలు పుట్ట చుట్టూ పానసానం పడుకొని శోకిస్తుంటారు. దర్గా దర్శనం అనంతరం నాగులపుట్టకు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement