వాకాడు డిపోను పరిశీలిస్తున్న ఆర్‌ఎం చింతల రవికుమార్
వాకాడు, న్యూస్‌లైన్ : నెల్లూరు రీజనల్ పరిధిలో ఆర్టీసీ రూ.51 కోట్ల నష్టంతో నడుస్తుండటంతో దాదాపు 80 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఆర్‌ఎం చింతల రవికుమార్ తెలిపారు. స్థానిక ఆర్టీసీ డిపోను సోమవారం ఆయన సందర్శించారు. డిపోలోని వివిధ సెక్షన్లను పరిశీలించారు. ఆర్‌ఎం మాట్లాడుతూ నష్టాల్లో నడుస్తున్న 36 ఎక్స్‌ప్రెస్ సర్వీస్‌లను త్వరలో రద్దు చేస్తామన్నారు. దీని వల్ల దాదాపు 80 మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు.
నష్టాలను పూడ్చుకునేందుకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించేలా ప్రతి కూడలిలో ప్రత్యేక సిబ్బందిని నియమించామన్నారు. అలాగే కండక్టర్లు, డ్రైవర్లు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి చెయ్యి ఎత్తిన చోట నిలిపి ఎక్కించుకోవాలన్నారు. వాకాడు, సూళ్లూరుపేట, నెల్లూరు-1, ఉదయగిరి డిపోలు నష్టాల్లో ఉన్నాయన్నారు. వాకాడు డిపో పనితీరు బాగాలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
సగటున కిలోమీటర్‌కు రూ.27 కంటే తక్కువ వచ్చిన సర్వీస్‌లను రద్దు చేయాలని ఆయన డిపో మేనేజర్ రామలింగేశ్వరరావుకు సూచించా రు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వరరావు, ఎంసీ నారాయణ,ట్రాఫిక్ సూపర్‌వైజర్ రాధారెడ్డి, సీఆర్‌సీ రఘురామయ్య ఉన్నారు.