ఫిర్యాదులొస్తే ‘బెల్ట్’ తీస్తా.. | removed the belt shops collector kanthi lal | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులొస్తే ‘బెల్ట్’ తీస్తా..

Published Sun, Aug 24 2014 2:27 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM

removed the belt shops collector kanthi lal

సాక్షి, గుంటూరు: ‘బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు.. వీటి మూసివేతకు ఏం చేయూలో అది చేయండి.. బెల్టుషాపులు ఉన్నాయంటూ ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవు..’ అని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఎక్సైజ్ అధికారులను హెచ్చరించారు. మద్యం బెల్ట్ షాపులపై ఎక్సైజ్, పోలీస్, డీఆర్‌డీఏ అధికారులు, ఎన్‌జీవోల ప్రతినిధులతో శనివారం డీఆర్‌సీ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి దాడులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పొన్నూరులో పెద్దఎత్తున బెల్ట్ షాపులున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని తెనాలి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను నిలదీశారు.

జీవనభృతి కోల్పోయే అవకాశం ఉన్నందున బెల్ట్ షాపుల నిర్వాహకులు ఒక్కసారిగా మద్యం అమ్మకాలు మానరని, వారిని చైతన్యపరిచి చట్టాల గురించి వివరించి మార్పు వచ్చేలా చేయాలని చెప్పారు. రెంటచింతల, బొల్లాపల్లి, అచ్చంపేట, పిడుగురాళ్ల ప్రాంతాల్లో ఎంఆర్‌పీ కన్నా ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. హైవేల పక్కన ఉన్న డాబాల్లో మద్యం దొరుకుతోందని, దీంతో తెల్లవారుజాము 2 గంటల నుంచి 5 గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దాబాలపై ప్రత్యేక బృందాలతో దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. నరసరావుపేట డివిజన్‌లో ఫిర్యాదులు పెద్దగా రావటం లేదని ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్.సుధాకర్ చెప్పగా, అక్కడ ఫిర్యాదులు రావు.. జరిగేది జరుగుతుంటుందని కలెక్టర్ చురకలంటించారు.
 
సర్టిఫికెట్లు తీసుకొంటున్నాం.: పోలీసు శాఖ తరపున క్రైం డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆయూ స్టేషన్ల పరిధిలో బెల్ట్ షాపులు లేవని ఎస్సైలనుంచి సర్టిఫికెట్లు తీసుకుంటున్నామని వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి ఎక్కడైనా బెల్ట్ షాపులున్నట్లు తెలితే ఎస్సైలపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.
 
కానిస్టేబుళ్లు లీక్ చేస్తున్నారు.: ఫలానా చోట బెల్ట్‌షాపు ఉందని ఎక్సైజ్ అధికారులకు తెలియజేస్తే ఆ సమాచారాన్ని కానిస్టేబుళ్లు బెల్ట్ షాపుల నిర్వాహకులకు తెలియజేస్తున్నారని డ్వాక్రా సంఘాల నాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇలాంటి ఘటన చేబ్రోలు మండలం కొల్లూరులో జరిగిందని వివరించారు. ఆ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని తెనాలి సూపరింటెండెంట్ మహేష్‌ను కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటివరకు మూసివేరుుంచిన బెల్టుషాపుల వివరాలను అందజేయూలని ఎక్సైజ్ డీసీ కుళ్లాయప్పను ఆదేశించారు.
 
180 కేసుల నమోదు.: ఎక్సైజ్ డీసీ కుళ్లాయప్ప మాట్లాడుతూ బెల్ట్‌షాపులపై ఇప్పటివరకు 180 కేసులు నమోదు చేసి 153 మందిని అరెస్టు చేశామని, 3859 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. డీఆర్‌డీఏ పీడీ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే మహిళా సంఘాల నాయకుల సమావేశంలో బెల్ట్ షాపులపై ప్రత్యేకంగా చర్చిస్తున్నామన్నారు. మరో 65 చోట్ల బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు ఎక్సైజ్, పోలీస్ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు
 కంట్రోల్ రూముల ఏర్పాటు
 
ప్రతి డివిజన్‌లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి తగినంత సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తించేలా చూడాలని కలెక్టర్ దండే ఆదేశించారు. కంట్రోల్ రూముల నంబర్లు, సిబ్బంది వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.(గుంటూరు కంట్రోల్ రూం నంబరు: 0863-223576, తెనాలి: 08644-223500, నరసరావుపేట: 08647- 231630). మాచర్లలో కూడా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో తెనాలి, గురజాల ఆర్డీవోలు శ్రీనివాసమూర్తి, అరుణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement