Tightening measures
-
ఫిన్‌ఫ్లుయెన్సర్లకు కఠిన నిబంధనలు
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా రిజిస్టర్‌కాని ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్లు(ఫిన్ఫ్లుయెన్సర్ల)ను నియంత్రణ పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఉపక్రమించింది. ఇందుకు అనుగుణంగా నిబంధనలను సవరించింది. ఇటీవల అన్‌రిజిస్టర్డ్ ఫిన్‌ఫ్లుయెన్సర్లతో పెరుగుతు న్న రిసు్కలపై ఆందోళనల కారణంగా సెబీ నిబంధనలను కఠినతరం చేసింది. విడిగా జారీ చేసిన మూడు నోటిఫికేషన్ల ద్వారా రిజిస్టర్డ్ సంస్థలు, రిజిస్టర్‌కాని వ్యక్తుల మధ్య సహకారంపై పరిమితులు విధించింది. ఈ అంశాలపై ప్రతిపాదనలను గత నెలలోనే సెబీ బోర్డు అనుమతించింది. ప్రస్తుత నోటిఫికేషన్ల ప్రకారం సెబీ నియంత్రణలోని ఏజెంట్లు, సంబంధిత వ్యక్తులపై ఆంక్షలు వర్తించనున్నాయి. సొమ్ము సంబంధ ఎలాంటి లావాదేవీలు, క్లయింట్‌కు రిఫర్ చేయడం, ఏ ఇతర వ్యక్తులతోనూ ఐటీ సిస్టమ్స్‌తో జత కలవడం తదితరాలు నిషిద్ధం. అంతేకాకుండా వీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సలహాలు, రికమండేషన్లు, స్పష్టమైన రిటర్నుల క్లెయిములు తదితరాలను చేపట్టకూడదు. సెబీ వద్ద రిజిస్టరైన లేదా బోర్డు అనుమతిస్తే తప్ప నియంత్రణలోలేని సంస్థలు, సంబంధిత ఏజెంట్లు సైతం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇవేమీ చేపట్టేందుకు అనుమతి ఉండదు. ఫిన్ఫ్లుయెన్సర్లు సెబీ వద్ద రిజిస్టర్కావలసి ఉంటుంది. అంతేకాకుండా వీటికి సంబంధించిన మార్గదర్శకాలకు కట్టుబడవలసి ఉంటుంది. ఇందుకు నైపుణ్యాలు, జవాబుదారీతనం వంటి అంశాలలో సెబీ ప్రమాణాలకు తెరతీసినట్లు ఈ సందర్భంగా మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి ఫిన్‌ఫ్లుయెన్సర్లతో మ్యూచువల్ ఫండ్ సంస్థలు, రీసెర్చ్ నిపుణులు, రిజిస్టర్డ్ పెట్టుబడి సలహాదారులు, స్టాక్ బ్రోకర్లు జత కట్టేందుకు వీలుండదు. -
పేదల నడ్డి విరుస్తున్న అడ్డగోలు వడ్డీ వసూళ్లు, ఆర్బీఐ కీలక నిర్ణయం!
ముంబై: డిజిటల్‌గా రుణాల మంజూరుకు సంబంధించి నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసింది. ఇష్టారీతిన వడ్డీ రేట్లు వసూలు చేయడం, అనైతిక వసూళ్ల విధానాలకు చెక్ పెట్టే లక్ష్యంతో వీటిని తీసుకొచ్చింది. కొత్త నిబంధనల కింద.. బ్యాంకులు లేదా ఎన్బీఎఫ్సీలు రుణాలను నేరుగా రుణ గ్రహీత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. మధ్యలో రుణ సేవలను అందించే ఫిన్‌టెక్‌లు కానీ, మరో సంస్థ (మూడో పక్షం)లకు ఇందులో పాత్ర ఉండకూడదు. రుణ సేవలను అందించినందుకు మధ్యవర్తులకు ఫీజులు, చార్జీలను ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలే (బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు/ఆర్ఈలు) చెల్లించాలి. రుణ గ్రహీతల నుంచి వసూలు చేయకూడదు. ముఖ్యంగా థర్డ్ పార్టీ సంస్థల అగడాలను అరికట్టడానికి ఆర్బీఐ ప్రాధాన్యం ఇచ్చింది. రుణ ఉత్పత్తులను అడ్డగోలుగా మార్కెటింగ్ చేయడం, డేటా గోప్యతను ఉల్లంఘించడం, అనైతిక వ్యాపార విధానాలు, భారీ వడ్డీ రేట్లు, అనైతిక వసూళ్ల విధానాలకు సంబంధించి స్పష్టమైన నిబంధనలను తీసుకొచ్చింది. ఆర్బీఐ నియంత్రణల పరిధిలోని సంస్థలు లేదా ఇతర చట్టాల కింద అనుమతించిన సంస్థల ద్వారానే రుణాల మంజూరు కొనసాగాలన్నది ఆర్బీఐ కార్యాచరణగా ఉంది. నిబంధనల్లో ఇతర ముఖ్యాంశాలు.. ► రుణ ఒప్పందానికి ముందు రుణ గ్రహీతకు కీలకమైన వాస్తవ సమాచార స్టేట్మెంట్ (కేఎఫ్ఎస్) ఇవ్వాలని ఆర్బీఐ నిర్ధేశించింది. ఆర్బీఐ నియంత్రణల కింద పనిచేసే సంస్థలు, డిజిటల్ లెండింగ్ యాప్‌లు, వీటి కింద పనిచేసే రుణ సేవల సంస్థలు (థర్డ్‌పార్టీ) దీన్ని తప్పక పాటించాలి. ► రుణ గ్రహీత ఆమోదం లేకుండా ఆటోమేటిక్‌గా రుణ పరిమితి పెంచడాన్ని నిషేధించింది. ► డిజిటల్ రుణాలను అసలుతోపాటు, అప్పటి వరకు వడ్డీతో చెల్లించి (ఎటువంటి పెనాల్టీ లేకుండా) క్లోజ్ చేసేందుకు వీలుగా కూలింగ్ ఆఫ్/ లుక్ అప్ పీరియడ్‌ను కల్పించాలి. ► రుణ గ్రహీత తన ఫిర్యాదుపై నియంత్రిత సంస్థ 30 రోజుల్లోపు పరిష్కారం చూపకపోతే.. అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఆర్బీఐకి ఫిర్యాదు చేయవచ్చు. ► డిజిటల్ లెండింగ్ యాప్‌లు, రుణ సేవల సంస్థలు రుణ గ్రహీత అనుమతితో, కావాల్సిన వివరాలను మాత్రమే తీసుకోవాలి. డేటా వినియోగంపై రుణ గ్రహీత అనుమతి తీసుకోవాలి. ► ఫిన్‌టెక్, డిజిటల్ లెండింగ్ సేవలపై ఫిర్యాదుల పరిష్కారానికి వీలుగా నియంత్రిత సంస్థలు, వాటి కింద రుణ సేవలను అందించే సంస్థలు తగిన యంత్రాంగాన్ని కలిగి ఉండాలి. వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అందించే రుణాలను డిజిటల్ లెండింగ్‌గా పరిగణిస్తారు. -
ఫిర్యాదులొస్తే ‘బెల్ట్’ తీస్తా..
సాక్షి, గుంటూరు: ‘బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు.. వీటి మూసివేతకు ఏం చేయూలో అది చేయండి.. బెల్టుషాపులు ఉన్నాయంటూ ఫిర్యాదులొస్తే కఠిన చర్యలు తప్పవు..’ అని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ఎక్సైజ్ అధికారులను హెచ్చరించారు. మద్యం బెల్ట్ షాపులపై ఎక్సైజ్, పోలీస్, డీఆర్డీఏ అధికారులు, ఎన్జీవోల ప్రతినిధులతో శనివారం డీఆర్సీ సమావేశ మందిరంలో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి దాడులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పొన్నూరులో పెద్దఎత్తున బెల్ట్ షాపులున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని, దీనిపై ఏం చర్యలు తీసుకుంటున్నారని తెనాలి ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ను నిలదీశారు. జీవనభృతి కోల్పోయే అవకాశం ఉన్నందున బెల్ట్ షాపుల నిర్వాహకులు ఒక్కసారిగా మద్యం అమ్మకాలు మానరని, వారిని చైతన్యపరిచి చట్టాల గురించి వివరించి మార్పు వచ్చేలా చేయాలని చెప్పారు. రెంటచింతల, బొల్లాపల్లి, అచ్చంపేట, పిడుగురాళ్ల ప్రాంతాల్లో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీశారు. హైవేల పక్కన ఉన్న డాబాల్లో మద్యం దొరుకుతోందని, దీంతో తెల్లవారుజాము 2 గంటల నుంచి 5 గంటల మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. దాబాలపై ప్రత్యేక బృందాలతో దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు. నరసరావుపేట డివిజన్లో ఫిర్యాదులు పెద్దగా రావటం లేదని ఎక్సైజ్ సూపరిండెంట్ ఆర్.సుధాకర్ చెప్పగా, అక్కడ ఫిర్యాదులు రావు.. జరిగేది జరుగుతుంటుందని కలెక్టర్ చురకలంటించారు. సర్టిఫికెట్లు తీసుకొంటున్నాం.: పోలీసు శాఖ తరపున క్రైం డీఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు ఆయూ స్టేషన్ల పరిధిలో బెల్ట్ షాపులు లేవని ఎస్సైలనుంచి సర్టిఫికెట్లు తీసుకుంటున్నామని వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు నిర్వహించి ఎక్కడైనా బెల్ట్ షాపులున్నట్లు తెలితే ఎస్సైలపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు. కానిస్టేబుళ్లు లీక్ చేస్తున్నారు.: ఫలానా చోట బెల్ట్‌షాపు ఉందని ఎక్సైజ్ అధికారులకు తెలియజేస్తే ఆ సమాచారాన్ని కానిస్టేబుళ్లు బెల్ట్ షాపుల నిర్వాహకులకు తెలియజేస్తున్నారని డ్వాక్రా సంఘాల నాయకులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఇలాంటి ఘటన చేబ్రోలు మండలం కొల్లూరులో జరిగిందని వివరించారు. ఆ కానిస్టేబుల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని లేకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తానని తెనాలి సూపరింటెండెంట్ మహేష్‌ను కలెక్టర్ హెచ్చరించారు. ఇప్పటివరకు మూసివేరుుంచిన బెల్టుషాపుల వివరాలను అందజేయూలని ఎక్సైజ్ డీసీ కుళ్లాయప్పను ఆదేశించారు. 180 కేసుల నమోదు.: ఎక్సైజ్ డీసీ కుళ్లాయప్ప మాట్లాడుతూ బెల్ట్‌షాపులపై ఇప్పటివరకు 180 కేసులు నమోదు చేసి 153 మందిని అరెస్టు చేశామని, 3859 బాటిళ్ల మద్యాన్ని సీజ్ చేశామని వెల్లడించారు. డీఆర్డీఏ పీడీ ప్రశాంతి మాట్లాడుతూ ప్రతి సోమవారం జరిగే మహిళా సంఘాల నాయకుల సమావేశంలో బెల్ట్ షాపులపై ప్రత్యేకంగా చర్చిస్తున్నామన్నారు. మరో 65 చోట్ల బెల్ట్ షాపులు నడుస్తున్నట్లు ఎక్సైజ్, పోలీస్ అధికారుల దృష్టికి తెచ్చామన్నారు కంట్రోల్ రూముల ఏర్పాటు ప్రతి డివిజన్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి తగినంత సిబ్బంది నిరంతరం విధులు నిర్వర్తించేలా చూడాలని కలెక్టర్ దండే ఆదేశించారు. కంట్రోల్ రూముల నంబర్లు, సిబ్బంది వివరాలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.(గుంటూరు కంట్రోల్ రూం నంబరు: 0863-223576, తెనాలి: 08644-223500, నరసరావుపేట: 08647- 231630). మాచర్లలో కూడా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో తెనాలి, గురజాల ఆర్డీవోలు శ్రీనివాసమూర్తి, అరుణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.