
మంత్రాలయం/ఆలూరు: రైతాంగ సమస్యలపై అధ్యయనం కోసం సినీనటి రేణుదేశాయ్ సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రే ఆమె మంత్రాలయం చేరుకున్నారు. స్థానిక ఎస్‌వీబీ అతిథిగృహంలో బస చేసిన ఆమె ఉదయాన్నే.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు తెలుసుకుంటారు. ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు గతేడాది ఆగస్టులో, అదే ఏడాది డిసెంబర్ 25న పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ ఇవాళ ఉదయం తుంబళబీడు, మధ్యాహ్నం పెద్దకడబూరులో పర్యటించనున్నారు. ఆమె పర్యటనపై సాక్షి టీవీలో లైవ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
కాగా రైతు సమస్యలను ఇతివృత్తంగా ఓ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు గతంలో రేణు దేశాయ్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆమె తాజాగా దర్శకురాలుగా రీ–ఎంట్రీ ఇస్తున్నారు. అందుకోసం రేణు దేశాయ్ స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. ఈ సినిమాకు సంబంధించి స్క్రీన్‌ప్లే వర్క్ కూడా పూర్తి అయింది. ఇక 2014లో డైరెక్టర్‌గా ’ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని తెరకెక్కించిన రేణు దేశాయ్.... ఆ తర్వాత ఆ సినిమాను తెలుగులోనూ డబ్ చేశారు.