
అద్దెకున్నవారే ‘కత్తి’దూశారు!
- డుంబ్రిగుడలో సంచలనం
- వివాహిత భర్త గోంతుకోసి పరారైన ముగ్గురు యువకులు
- నిందితులు ‘ఆధార్’ ఉద్యోగులు
- పోలీసుల అదుపులో నిందితులు
డుంబ్రిగుడ: ఇంట్లో అద్దెకున్న ముగ్గురు యువకులు ఊరెళ్లి రాత్రిమీద వచ్చారు. బయట హోటళ్లు లేవని, ఆకలిదప్పులతో ఉన్నామని నమ్మబలికారు. అయ్యో నిజమేకాబోలు అంటూ వారికి ఇంటిని అద్దెకిచ్చిన ఆ ఇల్లాలు వంట చేస్తుండగా, ఇంతలో ఆ యువకులు ఆమె భర్తపై అనూహ్యంగా కత్తితో దాడి చేశారు. మండల కేంద్రమైన డుంబ్రిగుడలో ఆదివారం రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పోలీసులు, బాధితుల బంధువుల కథనం ప్రకారం...
మండలంలోని అరమ పంచాయతీ సుండివలస గ్రామానికి చెందిన బంగారుబండి సందీప్ కుమార్ డుంబ్రిగుడ మండల కేంద్రాన్ని ఆనుకుని ఉన్న సంతవలసలో ఇల్లు నిర్మించుకుని భార్య గౌరితోపాటు కిరాణా దుకాణం ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నాడు. తన ఇంటిలో ఒక గదిని ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ చేపట్టే ఖమ్మం జిల్లా బయ్యారానికి చెందిన రంజిత్, శ్రీకాంత్, అనిల్‌అనే యువకులకు నెల క్రితం అద్దెకిచ్చారు. వారు కొద్ది రోజుల కిత్రం స్వగ్రామం వెళ్లి ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వచ్చారు. బయట హోటళ్లు లేవని, ఆకలితో ఉన్నామని సందీప్‌కు చెప్పారు.
ఆయన సూచనమేరకు గౌరి వంటగదిలోకి వెళ్లి భోజన ఏర్పాట్లు చేస్తుండగా, ముందు గదిలో ఒంటరిగా ఉన్న సందీప్‌పై ఆ ముగ్గురూ దాడి చేశారు. కత్తితో పీక కోశారు. వారి పెనుగులాటను చూసిన గౌరి భయంతో కేకలు వేయడంతో నిందితులు బ్యాగును, చిన్నకత్తిని, వారి చెప్పులను సైతం వదిలేసి పరారయ్యారు. చుట్టుపక్కలవారు వచ్చి చూసేసరికి గదిలో నేలపై రక్తపుమరకలు ఉండడంతో సందీప్‌పై హత్యాయత్నం జరిగినట్లు గమనించి, వెంటనే 108కు సమాచారం అందించారు. 20 నిమిషాల్లోగా వాహనం రావడంతో విశాఖపట్నంలోని ఓ కేర్ ఆస్పత్రికి తరలించారు.
ఎలా చిక్కారంటే?
పరారైన ముగ్గురిలో రంజిత్ ఆ రాత్రి మీద పరుగుతీసి కించుమండ సమీపంలోని ఓ బస్ షెల్టర్ వద్ద తలదాచుకున్నాడు. తెల్లవారుజామున బస్సు ఎక్కుతున్న సమయంలో కంగారు పడుతుండడాన్ని కించుమండ గ్రామానికి చెందిన కొందరు చూశారు. ఊరికి కొత్తవ్యక్తి అయిన రంజిత్ ఒంటిపై రక్తపు చారికలున్నట్లు గుర్తించి పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.
పరారైన ఇద్దరూ ఎస్.కోట ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు చిక్కినట్లు సమాచారం. అనిల్, శ్రీకాంత్ మాత్రమే సందీప్‌పై హత్యాయత్నం చేశారని, తనకు ఎలాంటి సంబంధమూ లేదని రంజిత్ పోలీసుల దర్యాప్తులు తెలిపినట్లు తెలిసింది. హత్యాయత్నానికి గల పూర్తి కారణాలు తెలియరాలేదు. సందీప్ బంధువుల మౌఖిక ఫిర్యాదు మేరకు సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ రామకృష్ణ సోమవారం ఉదయం సందర్శించి పరిశీలించారు. చిన్నకత్తితోపాటు, నిందితులు వదిలి వెళ్లిన ఓ బ్యాగును గుర్తించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు డుంబ్రిగుడ ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.