బిక్కుబిక్కుమంటూ..
ఇరగవరం/తణుకు రూరల్ : ఇరాక్‌లో అంతర్యుద్ధంతో అక్కడ ఉన్న జిల్లావాసులు అవస్థలు పడుతున్నట్టు సమాచారం. తినేం దుకు తిండి లేక.. కనీసం తాగేందుకు నీరు లేక ఇబ్బంది పడుతున్నట్టు ఇరాక్ బాధితులు ఫోన్ ద్వారా ఇక్కడ వారి తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారంతా ఆందోళనలో ఉన్నారు. ఇరగవరం మండలంలోని తూర్పు విప్పర్రు నుంచి ఐదు నెలల క్రితం పలువురు యువకులు ఇరాక్ పయనమయ్యారు. వారంతా అక్కడ నరకయాతన అనుభవించడంతో కుటుంబసభ్యులు కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. తమ బిడ్డలను స్వగ్రామాలకు రప్పిం చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తూర్పు విప్పర్రు గ్రామానికి చెందిన కొండేటి సుబ్బారావు, లక్ష్మి దంపతుల కుమారుడు పద్మారావు, అడ్డాల రాంబాబు, వెంకటలక్ష్మిల కుమారుడు నరేష్ గత జనవరిలో ఇరాక్‌లోని భాష్రా యూనివర్సిటీలో లేబర్ పని కోసం వెళ్లారు. వీరితో పాటు మరిం త మంది తెలుగువాళ్లు అక్కడ పనిచేస్తున్నట్టు సమాచారం.
చర్యలు తీసుకున్నాం.. అధైర్యపడొద్దు
తణుకు : ఇరాక్‌లో చిక్కుకున్న బాధితులను ఆదుకోవడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ ద్వారా ఢిల్లీలోని ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లినట్టు పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలు అధైర్యపడవద్దని తెలిపారు.
దువ్వవాసులు 15 మంది..
ఇరాక్ లో చిక్కుకున్న జిల్లావాసుల్లో తణుకు మండలానికి చెందిన దువ్వ గ్రామస్తులు 15 మంది ఉన్నారు. వీరంతా ఐదు నెలల క్రితం రూ. లక్ష వరకు ఖర్చుచేసి ఇరాక్‌లో జీవనోపాధి కోసం వెళ్లారు. ఇరాక్‌లో అంతర్యుద్ధంతో వీరి పాస్‌పోర్టులు అక్కడ ఏజెంట్లు తీసుకోవడంతో ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన నాగిరెడ్డి దుర్గారావు, వెలగన శ్రీనివాస్, తూము అర్జున్, శ్రీరాములు గంగయ్య, రాయుడు శ్రీను, రాయుడు అంజి, రాయుడు గోపాల కృష్ణ, కాపకాయల రామకృష్ణ, బందెల కోటేశ్వరరావు, దైబాల గోపాలం, కోటిపల్లి నరశింహమూర్తి, గుత్తికొండ వెంకటేశ్వరరావు, గరగ సాయి, గరగ గోపాలకృష్ణ ఇరాక్‌లో చిక్కుకున్న వారిలో ఉన్నారు. పది రోజుల నుంచి తమ బిడ్డ ఫోన్ కూడా చేయడం లేదని గుత్తికొండ వెంకటేశ్వరరావు తండ్రి ధనరాముడు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డలను క్షేమంగా స్వగ్రామాలకు తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి బాధితుల కుటుంబసభ్యులు వేడుకున్నారు.