విజయనగరం కంటోన్మెంట్: జిల్లా నుంచి ఒక అధికారికి బదిలీ అయితే మరొకరికి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఆ పోస్టు కూడా ఖాళీ అయితే మరో అధికారికి మూడు పోస్టులూ అప్పగిస్తున్నారు తప్ప భర్తీకి ఇతర జిల్లాల నుంచి అధికారులను తెచ్చుకునేందుకుయత్నించడం లేదు. ఒక్కొక్క అధికారికీ రెండుమూడు శాఖలను అప్పగించడం వల్ల ఏ శాఖకూ వారు న్యాయం చేయలేకపోతున్నారు. మరో పక్క పనిఒత్తిడితో అవస్థలు పడుతున్నారు.
సర్వశిక్షాభియాన్ పీఓ గా శారద బదిలీ అయ్యాక అప్పటి డిప్యూటీ డీఈఓ పి నాగమణికి బాధ్యతలు అప్పగించారు. ఇదే సమయంలో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సంజీవరావుకు కూడా బదిలీ అయింది. దీంతో ఆ బాధ్యతలు కూడా నాగమణికే అప్పగించారు. మొత్తం మూడు పోస్టులనూ ఆమె చేపట్టారు. ఆ తరువాత ఆమెకు విశాఖ బదిలీ అయింది. దీంతో ఈమె స్థానంలో ఉన్న డిప్యూటీ డీఈఓ లింగేశ్వరరెడ్డికి బాధ్యతలు స్వీకరించగా, ఎస్సీ వెల్ఫేర్ డీడీ కె.వి. ఆదిత్యలక్ష్మికి బీసీ వెల్ఫేర్ బాధ్యతలు అప్పగించారు. ఆ తరువాత ఈమెకు పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ అయింది. దీంతో ఈమె నిర్వహిస్తున్న బాధ్యతలను ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం రాజుకు అప్పగించారు. బీసీ కార్పొరేషన్‌లో బీసీ వెల్ఫేర్‌కు చెందిన అధికారి నాగరాణిని నియమించారు.
రెండేళ్లుగా డీపీఓ పోస్టు ఖాళీ
గ్రామ సౌభాగ్యాన్ని చూడాల్సిన జిల్లా పంచాయతీ అధికారి పోస్టు దాదాపు రెండేళ్ల పైబడి ఖాళీగా ఉంది. ఈ బాధ్యతలను కొన్నాళ్లు డీఎల్‌పీఓ మోహనరావు ఇన్ చార్జ్‌గా నిర్వర్తించగా ఆయనను తప్పించారు. ఆ తరువాత రెండు సార్లు ఈ శాఖకు ఇన్‌చార్జిలు మారారు. ఒక సారి జెడ్పీ సీఈఓ జి రాజకుమారి నిర్వహించగా, ప్రస్తుతం డీఆర్‌డీఏ పీడీ ఢిల్లీ రావు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అక్రమంగా నిధులు డ్రా..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ పథకాల ద్వారా జిల్లాలోని 920 పంచాయతీలకు రూ.127.53కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిని ఆయా గ్రామాల్లో సక్రమంగా ఖర్చు చేస్తున్నారా ? లేదా? అన్న విషయాన్ని డీపీఓ పర్యవేక్షించాలి. ప్రస్తుతం ఈ పోస్టు ఇన్‌చార్జితో నడుస్తున్నందు వల్ల ఈ నిధుల ఖర్చు పర్యవేక్షణను ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో అక్రమంగా నిధులు విత్ డ్రా చేస్తున్నారు. ఇదే అంశంపై గ్రీవెన్స్‌సెల్‌కు ఈ రెండేళ్లలో సుమారు 150 ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల రామభద్రపురం మండలంలో ఓ గ్రామానికి గ్రామానికి చెందిన సుమారు పది లక్షలు విత్ డ్రా చేసి రూ.2లక్షలకే ఖర్చు చూపారని అక్కడి వార్డుసభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇప్పటికీ వారు గ్రీవెన్స్‌సెల్‌కు తిరుగుతున్నారు.
మిగతా శాఖల్లోనూ ...
ఇక రవాణా శాఖలో చిన్నోడు ఇన్‌చార్జి ఆర్‌టీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గృహ నిర్మాణ శాఖ పీడీగా పనిచేసిన యూకే కుమార్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయగా అప్పటి నుంచి పార్వతీపురం ఈఈ ఎస్‌వి రమణమూర్తి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌కు బదిలీ అయి ఏడాది దాటిపోయింది. ప్రస్తుతం వైస్ ప్రిన్సిపాల్ ఇన్‌చార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. టూరిజం అధికారిగా భూ సేకరణ స్పెషల్‌డిప్యూటీ కలెక్టర్ అనిత ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.
పౌరసరఫరాల్లో మరీ దారుణం
ఈ శాఖలో మూడు ఏఎస్‌ఓ పోస్టులుండగా పార్వతీపురంలో చేరిన ఏఎస్‌ఓ పార్వతి... డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఆర్డీఓ కార్యాలయంలోని ఏఎస్‌ఓ నాగేశ్వరరావు డీఎస్‌ఓ కార్యాలయంలో పని చేస్తున్నారు. ఇక జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కే నిర్మలాబాయికి కూడా విశాఖ బదిలీ అయింది. కానీ ఈమెను రిలీవ్ చేయలేదు.
రేషన్‌షాపులపై పర్యవేక్షణ కరువు
ఏఎస్‌ఓ పోస్టులు ఖాళీగా ఉండడంవల్ల జిల్లాలో రేషన్ షాపుల్లో పర్యవేక్షణ ఉండడం లేదు. వీరికి అనుబంధంగా ఉండాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా లేరు. దీంతో రేషన్ షాపుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని షాపులకు ఈపోస్ విధానం ఇచ్చినా అమలు చేయకుండా రికార్డులతో ఇస్తున్నారు. నిత్యం పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. ఈ శాఖకు సంబంధించి గ్రీవెన్స్‌సెల్‌కు నెలకు కనీసం 25 ఫిర్యాదులు వస్తున్నాయి.
పెండింగ్‌లో రూ.30 కోట్ల బిల్లులు
గృహనిర్మాణ శాఖకు పూర్తిస్థాయి అధికారిలేకపోవడంతో జిల్లాలో సుమారు రూ. 30 కోట్ల గృహ నిర్మాణ బిల్లులు పెండిం గ్‌లో ఉండిపోయాయి. అలాగే గృహాలు మంజూరు చేయాలని కోరుతూ జిల్లావాసులు పెట్టుకున్న 46 వేల దరఖాస్తులు ఎదురు చూస్తున్నారు. గృహ నిర్మాణ శాఖకు చెందిన 30 ఫిర్యాదులు పెండిం గ్‌లో ఉండగా చాలా వరకూ డిస్పోజ్ చేసేశారు తప్ప న్యాయం చేయలేదు.
సెలవులో జేసీ....
జిల్లాలో ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఎంతో కొంత సహాయకారిగా ఉండే జాయింట్ కలెక్టర్ కూడా 40 రోజులు సెలవుపై వెళ్లిపోయారు. ఈయన పరిపాలనాపరమైన శిక్షణ కోసం త్రివేండ్రం వెళ్లేందుకు రిలీవ్ అయ్యారు. ఇప్పుడా బాధ్యతలను కూడా జిల్లా కలెక్టర్ చూడాల్సి ఉంది.
కీలకపోస్టులు ఖాళీ
Published Sun, Sep 6 2015 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 8:48 AM
Advertisement
Advertisement